Begin typing your search above and press return to search.

మంత్రి ప‌ద‌విపై లోకేశ్ మాట‌లో తేడాగా లేదు?

By:  Tupaki Desk   |   26 Oct 2016 10:38 AM GMT
మంత్రి ప‌ద‌విపై లోకేశ్ మాట‌లో తేడాగా లేదు?
X
దీపావ‌ళి పండ‌గ సంద‌ర్భంగా ఏపీ ముఖ్య‌మంత్రి మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ చేస్తార‌ని.. ఈసారి చేస్తున్న మార్పులు చేర్పుల్లో పార్టీ జాతీయ కార్య‌ద‌ర్శి నారా లోకేశ్‌కు మంత్రి ప‌ద‌విని క‌ట్ట‌బెడ‌తార‌న్న ప్ర‌చారం జోరుగా సాగుతోంది. ఈ విష‌యంపై ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నుంచి ఎలాంటి మాట బ‌య‌ట‌కు రాన‌ప్ప‌టికీ.. పార్టీ నేత‌లు మాత్రం చిన‌బాబును మంత్రిగా చూడాల‌ని విప‌రీతంగా త‌పిస్తున్నారు. ఇందులో భాగంగా ఎవ‌రికి వారు చిన‌బాబు మీద త‌మ‌కున్న అభిమానాన్ని ప్ర‌ద‌ర్శించ‌ట‌మే కాకుండా.. మంత్రివ‌ర్గంలో స్థానం క‌ల్పించాల‌న్న విన‌తుల్ని బాహాటంగానే చెప్పేశారు.

పార్టీ నేత‌లు.. మీడియాలో ఊహాగానాలు భారీగా సాగుతున్న వేళ‌.. చిన‌బాబు మాత్రం కూల్ గా చెప్పిన మాట ఇప్పుడు పార్టీ వ‌ర్గాల్లో చ‌ర్చ‌గా మారింది. పార్టీ అప్ప‌గించిన బాధ్య‌త‌తోనే ఊపిరి స‌ల‌ప‌నంత బిజీగా ఉన్నాన‌ని.. అలాంటి వేళ త‌న‌కు మంత్రి ప‌ద‌వి అక్క‌ర్లేద‌న్న మాట లోకేశ్ నోటి రావ‌టం గ‌మ‌నార్హం. మంత్రి ప‌ద‌విని ఇప్ప‌టికిప్పుడు చేప‌ట్ట‌టం ఇష్టం లేక ఈ మాట అన్నారా? లేక‌.. ఇంకేదైనా కార‌ణ‌మా? అన్న‌ది ప్ర‌శ్న‌గా మారింది.

అంద‌రూ అనుకున్న‌ట్లుగా మంత్రివ‌ర్గ పున‌ర్ వ్య‌వ‌స్థీక‌ర‌ణ విష‌యంలో బాబు ఆలోచ‌న మ‌రోలా ఉందా? అన్న‌ది ఇప్పుడు సందేహంగా మారింది. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో మంత్రివ‌ర్గంలో మార్పులు చేర్పులు చేయ‌టం ద్వారా.. పార్టీలో అసంతృప్తిని పెంచ‌టంతో పాటు.. కొత్త అధికార కేంద్రాల్ని ఏర్పాటు చేసిన‌ట్లు అవుతుంద‌న్న ఆలోచ‌న‌లో బాబు ఉన్నారా అన్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. అయితే.. ఈ అంశంపై ఓ సీనియ‌ర్ టీడీపీ నేత ఒక ఆస‌క్తిక‌ర వాద‌న‌ను వినిపించారు.

ఈ మ‌ధ్య‌న బెజ‌వాడ‌కు వ‌చ్చిన గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ బాబుతో సుదీర్ఘ భేటీ కావ‌టం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా వారి మ‌ధ్య‌న‌ మంత్రివ‌ర్గ పున‌ర్ వ్య‌వ‌స్థీక‌ర‌ణ అంశం చ‌ర్చ‌కు రావ‌టం.. ఇత‌ర పార్టీల నుంచి వ‌చ్చి వారికి మంత్రివ‌ర్గంలో స్థానం క‌ల్పిస్తూ నిర్ణ‌యం తీసుకోవ‌ద్ద‌న్న మాట‌ను గ‌వ‌ర్న‌ర్ బాబుకు చెప్పిన విష‌యాన్ని గుర్తు చేస్తూ.. గ‌వ‌ర్న‌ర్ సూచ‌న నేప‌థ్యంలో.. మంత్రివ‌ర్గ పున‌ర్ వ్య‌వ‌స్థీక‌ర‌ణ అంశాన్ని వాయిదా వేయాల‌ని బాబు భావిస్తున్న‌ట్లుగా చెప్పొకొచ్చారు. ఈ కార‌ణంతోనే మంత్రి ప‌ద‌వి కోసం తాను ఆస‌క్తిగా లేన‌న్న విష‌యాన్ని లోకేశ్ త‌న మాట‌గా చెప్పిన‌ట్లుగా తెలుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/