Begin typing your search above and press return to search.

లోకేశ్ మాట‌!... అఖిల‌కు ఊస్టింగ్ లేదు!

By:  Tupaki Desk   |   21 Nov 2017 10:54 AM GMT
లోకేశ్ మాట‌!... అఖిల‌కు ఊస్టింగ్ లేదు!
X
విజ‌య‌వాడ ప‌విత్ర సంగ‌మం స‌మీపంలో మొన్నామ‌ధ్య జ‌రిగిన బోటు ప్ర‌మాదం... చంద్రబాబు కేబినెట్‌ కు నిద్ర ప‌ట్ట‌నివ్వ‌డం లేదు. ఎందుకంటే... ఏకంగా 22 మంది అమాయ‌క ప్ర‌జ‌ల ప్రాణాల‌ను హ‌రించేసిన ఆ ప్ర‌మాదం... కేవ‌లం ప‌ర్యాట‌క శాఖ నిర్ల‌క్ష్యం - బాబు కేబినెట్‌ లోని ఓ ఇద్ద‌రు మంత్రుల కోట‌రీ క‌క్కుర్తి కార‌ణంగానే చోటుచేసుకుంద‌ని ప్ర‌చారం సాగుతోంది. అయితే స‌ద‌రు ఘ‌ట‌న‌కు కార‌కులైన మంత్రుల‌పై వేటు వేసే ద‌మ్మూ ధైర్యం సీఎంగా చంద్ర‌బాబుకు లేవ‌నే వాద‌న కూడా వినిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో అస‌లు ఈ ఘ‌ట‌న‌కు బాధ్యుల‌ను చేస్తూ ఎవ‌రిపై చ‌ర్య‌లు తీసుకోవాలో కూడా బాబుకు అర్థం కావ‌డం లేద‌ట‌. ఈ క్ర‌మంలోనే నిన్న‌టి స‌మీక్ష‌లో భాగంగా ప‌ర్యాట‌క శాఖ మంత్రి అఖిల‌ప్రియపై బాబు ఒంటికాలిపై లేచార‌ని ప్ర‌చారం జ‌రిగింది. గ‌తంలో అయితే ఈ ప్ర‌మాదానికి బాధ్య‌త వ‌హించి ప‌ర్యాట‌క శాఖ మంత్రి రాజీనామా చేసేవార‌ని కూడా ఆయ‌న అఖిల ముందే ఆగ్ర‌హం వ్య‌క్తం చేశార‌ట‌. మ‌రి ఈ మాట... త‌న‌ను రాజీనామా చేయ‌మ‌ని చెప్ప‌డ‌మా? లేక హెచ్చరిక చేయ‌డమా? అన్న విష‌యం అర్థం గాక అఖిల సైలెంట్‌ గానే నిల‌బ‌డిపోయార‌ట‌.

తెల్లారేస‌రికి ఈ వార్త దావాన‌లంలా వ్యాపించ‌డంతో పాటుగా అఖిల‌ప్రియ రాజీనామా చేయ‌డం ఖాయ‌మేన‌ని ప‌లు మీడియా సంస్థ‌ల్లో వార్త‌లు ప్ర‌సార‌మ‌య్యాయి. దీంతో న‌ష్ట నివార‌ణ చ‌ర్య‌ల‌కు దిగిన బాబు స‌ర్కారు... అస‌లు ఆ చ‌ర్య‌ల‌ను ఎలా ప్రారంభించాలో కూడా అర్థం కాని స్థితిలో ప‌డిపోయిందట‌. అయితే కాస్తంత ధైర్యం చేసిన టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి - బాబు కేబినెట్ లో కీల‌క మంత్రిగా ఉన్న నారా లోకేశ్ మీడియా ముందుకు వ‌చ్చేశారు. కాసేప‌టి క్రితం వెల‌గ‌పూడిలోని అసెంబ్లీలో లాబీల్లోకి వ‌చ్చేసిన లోకేశ్.. అక్క‌డి మీడియా ప్ర‌తినిధుల‌తో చిట్‌ చాట్ చేశారు. ఈ సంద‌ర్భంగా అఖిల‌ప్రియ మంత్రివ‌ర్గం నుంచి త‌ప్పిస్తార‌న్న వార్త‌ల‌ను ఆయ‌న సూటిగానే ఖండించేశారు. అస‌లు అఖిల‌ప్రియ‌ను రాజీనామా చేయించడం గానీ, ఆమెను కేబినెట్ నుంచి త‌ప్పించ‌డం గానీ జ‌ర‌గ‌బోవ‌ని లోకేశ్ తేల్చిచెప్పేశారు. అయినా ఈ వార్త‌ల‌ను మీడియానే సృష్టించిందంటూ... అఖిల‌పై చంద్ర‌బాబు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన మాట‌లో ఎలాంటి వాస్త‌వం కూడా లేద‌ని ఆయ‌న పేర్కొన్నారు.

వ‌దంతుల‌ను మీడియా సృష్టించి... వాటికి త‌మ‌ను స‌మాధానం చెప్పాలంటే ఎలాగంటూ లోకేశ్ ఎదురు ప్ర‌శ్న‌లు కూడా సంధించార‌ట‌. మంత్రి ప‌ద‌వి అఖిల‌కు కొత్తే అయినా కూడా ఆమె స‌మ‌ర్థ‌వంతంగా ప‌నిచేస్తున్నార‌ని, విశాఖ‌లో బెలూన్ ఫెస్టివ‌ల్‌, సోష‌ల్ మీడియా సమ్మిట్ వంటి కార్య‌క్ర‌మాల‌ను ఆమె మెరుగ్గానే నిర్వ‌హించార‌ని కితాబిచ్చారు. ప‌ర్యాట‌క రంగాన్ని పురోభివృద్ధి బాట‌లో న‌డిపించ‌డంలో అఖిల త‌న శ‌క్తివంచ‌న లేకుండా కృషి చేస్తున్నార‌ని కూడా లోకేశ్ వ్యాఖ్యానించారు. ఇంత బాగా ప‌నిచేస్తున్న అఖిల‌ను మంత్రివ‌ర్గం నుంచి ఎందుకు తొల‌గిస్తామ‌ని కూడా ఆయ‌న ప్ర‌శ్నించాట‌. మొత్తంగా చూస్తే.. నిన్న‌ సీఎం హోదాలో ఉన్న చంద్ర‌బాబు... అఖిల‌పై నిప్పులు చెరిగితే... నేడు తాజాగా చిన‌బాబు... అదే అఖిల‌ను ఆకాశానికెత్తేశార‌న్న మాట‌.