Begin typing your search above and press return to search.

ఏంది లోకేశ్.. ఈ చిన్న విష‌యం కూడా ఈసీ చెప్పాలా?

By:  Tupaki Desk   |   21 April 2019 5:00 AM GMT
ఏంది లోకేశ్.. ఈ చిన్న విష‌యం కూడా ఈసీ చెప్పాలా?
X
చేతిలో ఫోన్.. అందులో ట్విట్ట‌ర్ ఖాతా ఉంటే స‌రిపోతుందా? వెనుకా ముందు చూసుకోకుండా మ‌న‌సుకు తోచించి రాసేయ‌ట‌మేనా? అన్న ప్ర‌శ్న ఇప్పుడు ప‌లువురికి క‌లిగేలా వ్య‌వ‌హ‌రించారు ఏపీ మంత్రి లోకేశ్‌. తాజాగా ఆయ‌న చేసిన ట్వీట్ లోని వ్యాఖ్య‌ల‌పై ప‌లువురు విస్మ‌యాన్ని వ్య‌క్తం చేస్తున్నారు.

ఎన్నిక‌ల సంఘం ఆంక్ష‌ల‌న్నీ ఒక్క తెలుగుదేశం పార్టీకే వ‌ర్తిస్తాయా? అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రాష్ట్రంలో ఎన్నిక‌ల నియ‌మావ‌ళి పేరుతో ప్ర‌భుత్వ ప‌రంగా చేసే స‌మీక్ష‌ల‌పై ఈసీ ఆంక్ష‌లు విధించ‌టంపై ఆయ‌న ప్ర‌శ్నించిన తీరు ఆస‌క్తిక‌రంగా మారింది. ఎండ‌లు.. తాగునీటి స‌మ‌స్య‌పై సీఎం స‌మీక్ష నిర్వ‌హిస్తే ఈసీకి వ‌చ్చిన ఇబ్బంది ఏమిటి? స‌మీక్ష నిర్వ‌హించి సీఎం చంద్ర‌బాబు చ‌ర్య‌లు తీసుకోక‌పోతే వేస‌విలో ఏపీ ప్ర‌జ‌ల ప‌రిస్థితి ఏమిటి? ఈ అంశంపై ఎన్నిక‌ల సంఘం ఎందుకు ఆలోచించ‌టం లేదు? అంటూ త‌న సందేహాన్ని వ్య‌క్తం చేశారు.

లోకేశ్ అభ్యంత‌రం చ‌దివినంత‌నే.. నిజ‌మే క‌దా? అందులో త‌ప్పేముంది? ఈసీ ఓవ‌ర్ యాక్ష‌న్ చేస్తుంద‌న్న భావ‌న క‌ల‌గ‌టం ఖాయం. కానీ.. కాసింత లోతుల్లోకి వెళ్లినా.. మెద‌డులోకి త‌ర్కాన్ని తీసుకొస్తే.. చిన‌బాబు వారి సందేహాల్లోని డొల్ల‌త‌నం ఇట్టే అర్థ‌మ‌వుతుంది.

వేస‌వి అన్న‌ది ఇప్ప‌టికిప్పుడు వ‌చ్చి ప‌డిన కొత్త ఉత్పాతం కాదు. అందుకు ముఖ్య‌మంత్రి స‌మీక్ష జ‌రిగితే త‌ప్పించి.. ఏపీ ప్ర‌జ‌లకు మ‌నుగ‌డ లేద‌న్న‌ట్లుగా చిన‌బాబు మాట్లాడ‌టంలో అర్థం లేదు. ముఖ్య‌మంత్రి ఏపీ రాష్ట్ర ప్ర‌భుత్వ యంత్రాంగానికి నాయ‌కుడు మాత్ర‌మే అన్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు. ముఖ్య‌మంత్రి ఒక నెల రోజుల పాటు మీరు చూసుకోండి అని అధికారుల‌కు చెబితే.. చూసుకోలేనంత దారుణ‌మైన స్థితిలో రాష్ట్ర ప్ర‌భుత్వ యంత్రాంగం ఉంటుందా? అన్న‌ది ప్ర‌శ్న‌.

నైతిక‌త అన్న‌ది కంటికి క‌నిపించ‌కపోవ‌చ్చు. కానీ.. అధినేత వ్య‌వ‌హ‌రించే తీరుతో అదెలా ఉంటుందో అర్థ‌మవుతుంది. ప్ర‌స్తుతం ఏపీలో ఉన్న‌ది అప‌ద్ధ‌ర్మ ప్ర‌భుత్వం కాక‌పోవ‌చ్చు. సాంకేతికంగా చూస్తే.. ప్ర‌భుత్వ పాల‌న‌కు మ‌రింత గ‌డువు ఉండొచ్చు. కానీ.. రిటైర్మెంట్ ఉద్యోగి త‌న ప‌ద‌వీ కాలం ముగిసే నెల ముందు నుంచే కీల‌క‌మైన నిర్ణ‌యాలు తీసుకోవ‌టానికి ఇష్ట‌ప‌డ‌క‌పోవ‌టాన్ని చాలామంది విష‌యంలో చూస్తుంటాం. ఎందుకంటే.. ప‌ద‌వీకాలం చివ‌ర్లో తీసుకునే నిర్ణ‌యాలు కొత్త సందేహాల‌కు అవ‌కాశం ఇస్తుంది. అలాంట‌ప్పుడు వాటికి దూరంగా ఉంటే ఏమైంద‌న్న భావ‌న‌తో చాలామంది చేతులు క‌ట్టేసుకోవ‌టాన్ని మ‌ర్చిపోకూడ‌దు.

ఎన్నిక‌ల్లో కీల‌క‌ఘ‌ట్ట‌మైన పోలింగ్ ముగిసి.. ప్ర‌జ‌లు త‌మ తీర్పును ఈవీఎంల‌లో ఇచ్చేసిన త‌ర్వాత‌.. సాంకేతికంగా ఉన్న అడ్డంకి కార‌ణంగానే ఓట్ల లెక్కింపు కార్య‌క్ర‌మం చేప‌ట్ట‌లేదన్న‌ది మ‌ర్చిపోకూడ‌దు. దేశ‌వ్యాప్తంగా సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌ర‌గ‌టం కార‌ణంగా.. పోలింగ్ త‌ర్వాత ఓట్ల లెక్కింపున‌కు దాదాపు 50 రోజుల‌కు పైనే గ‌డువు రావ‌టానికి కార‌ణ‌మైంది. ఒక‌వేళ‌.. ఏపీ ఎన్నిక‌లు ఒక్క‌టే జ‌రిగితే.. ఈపాటికే ఫ‌లితాలు వెల్ల‌డ‌య్యేవి. ఇలాంటివేళ‌.. నిత్యం స‌మీక్ష‌ల పేరుతో హ‌డావుడి చేసే క‌న్నా.. కాసింత మౌనంగా ఉంటే ఏమైంది? కొత్త అనుమానాల‌కు అవ‌కాశం ఇవ్వ‌రాద‌న్న‌ట్లుగా ఈసీ వ్య‌వ‌హ‌రిస్తే.. ట్వీట్ల‌తో చెల‌రేగిపోతున్న చిన్న‌బాబు.. త‌మ పాల‌న చివ‌రికొచ్చేసింద‌న్న వాస్త‌వాన్ని గుర్తించ‌పోవ‌టం.. బేసిక్స్ విష‌యంలోనూ వీక్ గా ఉండ‌టం అయ్యో అనేలా చేస్తుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.