బాబు రాజకీయాలు ఎలాంటివో చెప్పిన ఉండవల్లి

Mon Dec 10 2018 11:12:37 GMT+0530 (IST)

ఏపీలో కాస్త డొక్క శుద్ది ఉన్న నేతల్ని వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. రాజకీయంగా ఎంత పలుకుబడి ఉన్నా.. మైకు చేతికి ఇచ్చి..కాస్త మాట్లాడరా నాయనా? అంటూ చాలు.. వారి డొల్లతనం ఇట్టే తెలిసిపోతుంది. అంతదాకా ఎందుకు.. ఊక దంపుడు మాటలు వద్దు.. విషయాల మీద మీ అభిప్రాయాలు చెప్పండన్న ప్రశ్నలు వేస్తే.. అప్పటివరకూ నాన్ స్టాప్ గా ఉదరగొట్టిన నేతలు సైతం మాటల కోసం వెతుక్కునే దుస్థితి. ఆంధ్రా ప్రాంతానికి చెందిన నేతల్లో ఈ విషయ దారిద్య్రం కొట్టొచ్చినట్లు కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి దోరణికి మినహాయింపుగా ఉండవల్లి లాంటోళ్లు అక్కడక్కడ కనిపిస్తుంటారు.ఏదైనా విషయం మీద నోరు విప్పాలంటే.. దానికి ముందు ఆ విషయం మీద అవగాహన తెచ్చుకోవటమే కాదు.. పట్టు తెచ్చుకున్న తర్వాతే మాట్లాడటం  ఉండవల్లికి అలవాటు. తాజాగా ఆయన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో జరిగిన సేవ్ ఆంధ్రప్రదేశ్ సదస్సులో ఉండవల్లితో పాటు.. ఉత్తరాంధ్ర మేధావులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఉండవల్లి.. ప్రస్తుత రాజకీయాలకు తన లాంటివాడు అస్సలు సెట్ కాదన్నారు.

ఇప్పుడు అందరూ సంపాదన కోసమే రాజకీయాల్లోకి వస్తున్నారని.. దేశంలో ఓటుకు వేలంపాట జరుగుతుందన్నారు. రూ.20 కోట్లు ఖర్చు పెడితే కానీ అసెంబ్లీలో అడుగు పెట్టలేని పరిస్థితులు వచ్చాయన్న ఆవేదనను వ్యక్తం చేశారు. రాజకీయ నేతలు పబ్లిసిటీ కోసం ఎంతలా పాకులాడుతారో చెప్పే క్రమంలో ఒక సీనియర్ అధికారి ఉదంతాన్ని ఉండవల్లి చెప్పుకొచ్చారు.

1996లో రెడ్డి సుబ్రమణ్యం అనే ఐఏఎస్ అధికారి తూర్పుగోదావరి జిల్లాకు కలెక్టర్ గా పని చేసేవారని.. అప్పట్లో తుపాను వస్తుందని రేడియో ద్వారా తెలిసి సీఎం బాబుకు చెప్పకుండా ముందుగా జిల్లాలో పర్యటించారన్నారు. ఆ సందర్భంగా వరదలో కొట్టుకుపోయిన ఒక గేదెను గ్రామస్తుల సాయంతో కాపాడారు. ఈ విషయాన్ని తెలిసిన చంద్రబాబు.. తనకు చెప్పకుండా.. తనకంటే ముందుగా వరదకు గురైన గ్రామానికి వెళ్లినందుకు ఆగ్రహంతో సస్పెండ్ చేశారన్నారు.

అందుకే పని చేస్తే తలనొప్పి వస్తుందన్న భావనతో.. భయంతో ఏపీ అధికారులు ఉన్నట్లు చెప్పారు. ఏపీ ప్రభుత్వంలో అత్యున్నత స్థానాల్లో పని చేసి రిటైర్ అయిన అధికారులు ఐవైఆర్ కృష్ణారావు.. అజయ్ కల్లాం లాంటివారు చెబుతున్న మాటలు వింటుంటే.. కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయన్నారు. ప్రచార ఆర్భాటం కోసమే బాబు గెస్ట్ హౌస్ లో నిద్ర పోలేదని.. హూదూద్ తుఫాను ఎపిసోడ్ ను గుర్తు చేసుకున్నారు.

విశాఖను వణికించిన హూధూద్ తుఫాను సందర్భంగా విశాఖ కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన వాహనంలో బాబు నిద్రించిన వైనం తెలిసిందే. తాను కష్టపడుతున్న భావన కలిగించేందుకే బాబు బస్సులో నిద్ర పోయారని తెలిసి ఆశ్చర్యానికి గురయ్యానని చెప్పారు. ఏపీలో భారీ అవినీతి చోటు చేసుకుంటోందన్న ఉండవల్లి.. ప్రభుత్వ ఆదరణ పథకాల కింద లక్ష రూపాయిల ఖర్చుతో వీడియోకాన్ వాషింగ్ మెషిన్లను కొనుగోలు చేస్తున్నారని.. బయట మార్కెట్లో దాని విలువ రూ.7500 మాత్రమేనని చెప్పారు.

స్కూళ్లల్లో మధ్యాహ్న భోజనం.. అన్న క్యాంటీన్లలో భోజనం పరిమాణంలో తేడా కొంచెమే అయినా.. వాటి ధరల్లో మాత్రం మూడు రెట్లు తేడా ఉందన్నారు. ఇవన్ని బహిరంగ రహస్యాలేనని చెప్పారు. కొందరు టీడీపీ మిత్రులు తనకు ఫోన్ చేసి.. ప్రస్తుత టీడీపీ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న అవినీతి తమ జీవితంలోనే చూడలేదని చెబుతున్నారన్నారు. ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టకుంటే గెలవలేని పరిస్థితి ఉందని.. అందుకోసం అవినీతి చేయక తప్పటం లేదని వాపోయినట్లు ఆయన వెల్లడించారు.