Begin typing your search above and press return to search.

తెలుగోళ్ల దృష్టి అంతా నంద్యాల‌పైనే!

By:  Tupaki Desk   |   19 Aug 2017 1:30 PM GMT
తెలుగోళ్ల దృష్టి అంతా నంద్యాల‌పైనే!
X
ఏదేనీ అంశంపై రోజుల త‌ర‌బ‌డి చ‌ర్చ దాదాపుగా అసాధ్య‌మే. అది ఎంత పెద్ద అంశ‌మైనా కూడా... ఆధునిక సాంకేతిక ప‌రిజ్ఞానం అందుబాటులోకి వ‌చ్చిన ఈ కాలంలో ఒక అంశానికి మించిన ప్రాధాన్యం ఇంకో అంశానికి కేవ‌లం సెక‌న్ల‌లో మారిపోతోంది. అక్క‌డ అది జ‌రిగిందా? అని నోరు వెళ్ల‌బెట్టేలోగానే... మ‌న‌ల‌ను మ‌రింత‌గా షాక్‌కు గురి చేసే ఘ‌ట‌న క‌నిపిస్తుంది. అయితే ఇప్పుడు ఈ త‌ర‌హా కామెంట్ల‌కు నంద్యాల బైపోల్స్ అతీత‌మ‌నే చెప్పాలి. ఎందుకంటే... ఉప ఎన్నిక‌కు నోటిఫికేష‌న్ రాక‌ముందు నుంచే అక్క‌డ ఎవ‌రు గెలుస్తార‌నే ప్ర‌శ్న అంద‌రి నోటా వినిపించింది. ఇక ఈ క్యూరియాసిటీని మరింత‌గా పెంచేస్తూ టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు సీఎం హోదాలో అక్క‌డ ఎన్నిక‌ల నోటిషికేష‌న్ కు కాస్తంత ముందుగానే రెండు ప‌ర్యాయాలు ప‌ర్య‌టించారు. ఆయ‌న కుమారుడు నారా లోకేశ్ కూడా అక్క‌డికి మంత్రి హోదాలో వ‌చ్చి వెళ్లారు.

మూడేళ్లుగా అక్క‌డ క‌నిపించ‌ని అభివృద్ధి రెండు నెల‌ల నుంచి ఒక్క‌సారిగా జెట్ స్పీడునందుకుంది. మొన్న‌టిదాకా రోడ్ల విస్త‌ర‌ణ‌లో భాగంగా కూల్చివేత‌లు జ‌రిగితే... ఇప్పుడు నిర్మాణ పనులు జోరందుకున్నాయి. ఉన్న‌ట్టుండి ఒకేసారి నంద్యాల నియోజ‌క‌వ‌ర్గానికి వేల కోట్ల రూపాయల అభివృద్ధి ప‌ట్టాలెక్కేసింది. మ‌రి ఈ ప‌నులు పూర్తి అవుతాయా? మ‌ధ్య‌లోనే ఆగిపోతాయా? అన్న విష‌యాన్ని ప‌క్క‌న‌బెడితే... గ‌డచిన వారానికి పైగా వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అక్క‌డ సుడిగాలి ప‌ర్య‌ట‌న చేస్తున్నారు. ఎన్నిక‌ల ప్ర‌చారానికి తుది గ‌డువు ముగిసే దాకా కూడా జ‌గ‌న్ నంద్యాల‌లోనే ఉండ‌నున్నారు. ఇక నేటి ఉద‌యం నంద్యాల‌లో ముచ్చ‌ట‌గా మూడో ప‌ర్యాయం కాలుమోపిన చంద్రబాబు రేపు కూడా అక్క‌డ ప్ర‌చారం చేస్తార‌ట‌. ఓ ప‌క్క జ‌గ‌న్‌... మ‌రో ప‌క్క చంద్ర‌బాబు ప్ర‌చారంతో నిజంగానే నంద్యాల బ‌రి విశ్వ‌వ్యాప్తంగా తెలుగు ప్ర‌జ‌ల‌ను ఇట్టే క‌ట్టిప‌డేసింద‌నే చెప్పాలి. ఏ ఇద్ద‌రు తెలుగు వాళ్లు క‌లిసినా... నంద్యాల బైపోల్స్ లో విజ‌యం ఎవ‌రిద‌న్న ప్ర‌శ్న వినిపించ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి నెల‌కొంది.

రాయ‌ల‌సీమ ముఖ‌ద్వారంగా పిలుచుకునే క‌ర్నూలు జిల్లాలోని ఓ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంగా ఉన్న నంద్యాల‌లో ఇప్పుడు న‌లు దిక్కులా మైకులు మారుమోగిపోతున్నాయి. మ‌రో రెండు రోజుల్లో ప్ర‌చారానికి తెర ప‌డ‌నున్న నేప‌థ్యంలో అటు టీడీపీతో పాటు ఇటు వైసీపీ కూడా స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డుతున్నాయి. ఈ ఎన్నిక‌లో గెలిస్తే... 2019 ఎన్నిక‌ల్లో విజ‌యం న‌ల్లేరు మీద న‌డ‌కేన‌న్న భావ‌న ఇరు పార్టీల్లో నెల‌కొంద‌న్న వాద‌న వినిపిస్తోంది. పోలింగ్ స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతున్న కొద్దీ అక్క‌డ అటు టీడీపీ - ఇటు వైసీపీ త‌మ‌దైన వ్యూహాల‌కు ప‌దును పెడుతున్నాయి. ఇప్పుడు అక్క‌డ ఎక్క‌డ చూసినా ప్ర‌చారానికి త‌ర‌లివ‌చ్చిన ఆయా జిల్లాల నేత‌లు - ఆయా పార్టీల కార్య‌క‌ర్త‌లే క‌నిపిస్తున్నారు. చేతిలో ఉన్న అధికారాన్ని వినియోగించి నంద్యాల ఉప ఎన్నిక‌ను ఎలాగైనా గెల‌వాల్సిందేన‌ని టీడీపీ య‌త్నిస్తోంద‌న్న వాద‌న కూడా ఇటీవ‌లి కాలంలో మ‌రింత బ‌లంగా వినిపిస్తోంది. ఇప్ప‌టికే ఓ న‌లుగురు మంత్రులు అక్క‌డ తిష్ట వేసి త‌మ మంత్రాంగాన్ని న‌డుపుతున్నారు. అదే క్ర‌మంలో స్వ‌యంగా తానే రంగంలోకి దిగేసిన జ‌గ‌న్‌... కూడా మంత్రుల‌కు దీటుగానే బ‌దులిస్తూ అవ‌కాశాల‌ను త‌న‌కు అనుకూలంగా మ‌ల‌చుకునే ప‌నిలో వేగం పెంచేశారు. వెర‌సి అక్క‌డి విజ‌యావ‌కాశాలు తీవ్ర ఉత్కంఠ‌ను రేపుతున్నాయి.

అయినా నంద్యాల ఎన్నిక‌పై ఇప్పుడే ఇంత‌గా ఆస‌క్తి రేకెత్తిందా? అంటే... గ‌తంలోనూ ఓ సారి ఇక్క‌డి ఎన్నిక దేశ‌వ్యాప్తంగా ఆస‌క్తి రేకెత్తించింద‌న్న విష‌యాన్ని మ‌రిచిపోలేం. ఎందుకంటే... 1996లో జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో మాజీ ప్ర‌ధాని పీవీ న‌ర‌సింహారావు నంద్యాల నుంచే బ‌రిలోకి దిగారు. నంద్యాల‌తో పాటు ఒడిశాలోని బ‌రంపురం నుంచి కూడా పోటీ చేసిన పీవీ... రెండు చోట్లా విజ‌యం సాధించిన త‌ర్వాత నంద్యాల పార్ల‌మెంటు స్థానానికి రాజీనామా చేశారు. ఆ త‌ర్వాత జ‌రిగిన ఎన్నిక‌ల్లో టీడీపీ అభ్యర్థిగా బ‌రిలోకి దిగిన దివంగ‌త నేత భూమా నాగిరెడ్డి ఎంపీగా విజయం సాధించారు. నాడు పీవీ పోటీ చేసిన స‌మ‌యంలో కాంగ్రెస్ త‌ర‌ఫున ఆయ‌న బ‌రిలోకి దిగ‌గా... ఆయ‌న‌కు ప్ర‌త్య‌ర్థిగా అప్పుడ‌ప్పుడే రాజకీయాల్లోకి వ‌చ్చిన భూమా నాగిరెడ్డి టీడీపీ అభ్యర్థిగా నిలిచారు. అయితే టీడీపీ అభ్య‌ర్థిపై పీవీ 5 ల‌క్ష‌ల‌కు పైగా మెజారిటీతో భారీ విజ‌యం సాధించారు. ఇప్ప‌టికీ ఆ ఎన్నిక ఓ రికార్డేన‌ని చెప్పాలి. మ‌రి ఇప్పుడు జ‌రుగుతున్న ఉప ఉన్నిక‌లో 1996లో న‌మోదైన రికార్డు ఏమైనా బ‌ద్ద‌ల‌వనుందా? అంటే... అంత సీనే లేదనే చెప్పాలి. ఎందుకంటే... నాడు ఆస‌క్తి రేకెత్తించింది లోక్ స‌భ ఎన్నిక‌లు కాగా.. ఇప్పుడు అసెంబ్లీ స్థానానికి జ‌రుగుతున్న ఎన్నిక‌లు కాబ‌ట్టి.

నాడు పీవీకి వ‌చ్చిన మెజారిటీలో సగం ఓట్లు మాత్ర‌మే ఉండే... ఇప్ప‌టి ఉప ఎన్నిక‌లో ఏ పార్టీ గెలిచినా కూడా అతి త‌క్కువ మార్జిన్‌ తోనేన‌న్న మాట కూడా వినిపిస్తోంది. మ‌రి ఈ మాత్రం దానికే నంద్యాల ఫీవ‌ర్ విశ్వవ్యాప్తం కావ‌డానికి గ‌ల కార‌ణం ఏమిట‌న్న విష‌యానికి వ‌స్తే... ఈ ఎన్నిక‌లో విజ‌యం సాధించే పార్టీ 2019లో జ‌రిగే ఎన్నిక‌ల్లో ఘ‌న విజ‌యం సాధిస్తుంద‌న్న భావ‌న ప్ర‌జ‌ల్లో ఉంది. అంతే కాకుండా... ఓ నాలుగేళ్ల క్రితం పుట్టిన వైసీపీ... న‌ల‌భై ఏళ్ల ప్ర‌స్థాన‌మున్న టీడీపీతో హోరాహోరీగా పోరాడుతోంది. నిన్న‌గాక మొన్న వ‌చ్చిన పార్టీని చూసి సుదీర్ఘ చరిత్ర ఉన్న టీడీపీ వ‌ణికిపోతోంద‌న్న వాద‌న కూడా వినిపిస్తోంది. ఇదే ప్ర‌పంచంలోని అన్ని దేశాల్లో ఉన్న తెలుగు వాళ్ల‌ను నంద్యాల బ‌రిపై దృష్టి సారించేలా చేసింద‌ని తెలుస్తోంది. అంతేకాకుండా... రోజురోజుకు మారిపోతున్న అక్క‌డి రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు కూడా ఈ ఆస‌క్తికి కార‌ణంగా క‌నిపిస్తున్నాయి. ఇక ఇక్క‌డ ఇంకో అంశాన్ని కూడా ప్ర‌స్తావించుకోవాల్సి ఉంది. మొన్న‌టి నంద్యాల బ‌హిరంగ స‌భ‌లో మాట్లాడిన జ‌గ‌న్... టీడీపీకి భారీ స‌వాలే విసిరారు.

ప్ర‌స్తుతం తెలుగు నేల వ్యాప్తంగా ఫిరాయింపు రాజ‌కీయాల‌పై విప‌క్షాలు గ‌గ్గోలు పెడుతున్న వేళ‌... త‌న పార్టీలోకి వ‌చ్చిన టీడీపీ ఎమ్మెల్సీ శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి చేత జ‌గ‌న్ ప్ర‌జ‌ల స‌మ‌క్షంలోనే రాజీనామా చేయించారు. అదే స‌మ‌యంలో దమ్ముంటే... త‌న పార్టీ టికెట్‌పై ఎమ్మెల్యేలుగా గెలిచి, టీడీపీలో చేరిన వారితో రాజీనామాలు చేయించాల‌ని కూడా ఆయ‌న చంద్ర‌బాబుకు పెద్ద స‌వాలే విసిరారు. ఈ క్ర‌మంలో కొన్నాళ్ల పాటు కిక్కురుమ‌న‌ని టీడీపీ.. జ‌గ‌న్ నోట నుంచి వ‌చ్చిన కాస్తంత తీవ్రంగా అనిపించే కొన్ని కామెంట్ల‌ను ప‌ట్టుకుని నానా రాద్దాంతం చేసేసింద‌న్న వాద‌న కూడా లేక‌పోలేదు. వెర‌సి ఇరు పార్టీలు వ్య‌వ‌హ‌రించిన తీరుతో తెలుగు నేల‌లోని వారినే కాకుండా... విదేశాల్లోనే తెలుగు ప్ర‌జ‌లకు కూడా ఈ ఎన్నిక‌పై ఆస‌క్తి రేకెత్తించేలా చేశాయ‌న్న వాద‌న వినిపిస్తోంది. మ‌రో మూడు రోజుల పాటు ప్ర‌చారం జ‌రగ‌నుండ‌గా... ఈ మూడు రోజులు, ఆ త‌ర్వాత పోలింగ్‌, చివ‌రాఖ‌రుగా కౌంటింగ్ వ‌ర‌కు కూడా ఈ ఉత్కంఠ త‌ప్పేలా లేద‌ని చెప్పిక త‌ప్ప‌దు.