నాందేడ్ తీర్పుతో మోడీ బ్యాచ్.. ఓవైసీలకు షాకే

Fri Oct 13 2017 11:24:24 GMT+0530 (IST)

స్థానిక ఎన్నికల్లో అధికారపక్షం హవా ఎంతలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వాస్తవానికి ఉప ఎన్నికల్లోనూ.. స్థానిక సంస్థలకు జరిగే ఎన్నికల్లోనూ అధికారపక్షానికి  ఎడ్జ్ ఉంటుంది. కానీ.. అందుకు భిన్నమైన తీర్పును ఇచ్చారు మహారాష్ట్రలోని నాందేడ్ పట్టణ ప్రజానీకం.నాందేడ్ - వాఘాలా మున్సిపల్ కార్పొరేషన్ కు ఇటీవల ఎన్నికలు జరిగాయి. తాజాగా వాటి ఫలితాలు వెలువడ్డాయి. అయితే.. ఈ ఫలితాలు షాకింగ్ గా ఉండటం విశేషం. మొత్తం 54 స్థానాలకు గురువారం ఫలితాలు వెల్లడించగా.. అందులో 49 స్థానాల్ని కాంగ్రెస్ కైవసం చేసుకోగా.. అధికార బీజేపీ కేవలం మూడు స్థానాల్ని మాత్రమే సొంతం చేసుకోగలిగింది. ఇక.. మజ్లిస్ అయితే తన ఉనికినే కోల్పోవటం గమనార్హం.

మోడీ ప్రభ వెలిగిపోతోందని.. ఆయన ఇమేజ్ తో బీజేపీ అంతకంతకూ బలోపేతం అవుతుందంటూ వాదనలు వినిపిస్తున్న వేళ.. అందుకు భిన్నంగా నాందేడ్ ఫలితాలు వెలువడటం సంచలనంగా మారింది. అధికారపక్షంగా ఉన్న రాష్ట్రంలో ఒక మున్సిపల్ కార్పొరేషన్ లో ఇంత దారుణమైన పరాజయం బీజేపీ వర్గాలకు షాకింగ్ గా మారిందని చెప్పక తప్పదు.

భవిష్యత్తు మీద నిరాశ నిస్పృహలతో ఉన్న కాంగ్రెస్ వర్గాలకు మాత్రం తాజా ఫలితాలు కొండంత శక్తిని ఇవ్వటమే కాదు.. రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తే ఫలితాలు ఎలా ఉంటాయన్న దానిపై క్లారిటీ వచ్చిందని చెప్పాలి. ఇదిలా ఉంటే.. గత ఎన్నికల్లో అసదుద్దీన్ ఓవైసీ అధినేతగా ఉన్న మజ్లిస్‌కు 11 మంది కార్పొరేటర్లు ఉండేవారు.

తాజా ఎన్నికల్లో ఒక్కరంటే ఒక్క కార్పొరేటర్ కూడా గెలవకపోవటం గమనార్హం. తాజా ఎన్నికల్లో మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అశోక్ చవాన్ విసృతంగా పర్యటించారు. అధికారపార్టీ తీరును తీవ్రంగా విమర్శించారు. ఆయన కష్టానికి ఫలితం అన్నట్లుగా కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని సాధించటం ఆయన్ను విపరీతమైన సంతోషానికి గురి చేసింది. నాందేడ్ ఫలితం మోడీ బ్యాచ్ కు భారీ షాక్ గా చెప్పాలి. తమను తాము ఆత్మశోధన చేసుకోవటానికి నాందేడ్ ఎన్నిక అవకాశం ఇచ్చిందని చెప్పకతప్పదు.