సుహాసిని ఓడింది...ఎన్టీఆర్ గెలిచాడు

Tue Dec 11 2018 21:41:00 GMT+0530 (IST)

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు - ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు ఊహించని షాక్ తగిలింది. కూకట్ పల్లిలో పరాభవం ఎదురైంది. నందమూరి సుహాసిని ఓటమి పాలయ్యారు. మహాకూటమి తరపున కూకట్ పల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సుహాసిని పోటీ చేశారు. టీఆర్ ఎస్ అభ్యర్థి మాధవరం కృష్ణారావు విజయం సాధించారు. ఆమెకు మద్దతుగా ఏపీ సీఎం చంద్రబాబు - హీరో బాలకృష్ణ ప్రచారం చేశారు. అయినా ఫలితం లేకపోయింది. సుహాసినికి ఓటమి తప్పలేదు. అయితే ఈ మొత్తం ఎపిసోడ్ లో తెలివిగా వ్యవహరించింది జూనియర్ ఎన్టీఆర్ అని అంటున్నారు.ఏ మాత్రం రాజకీయ అనుభవం లేని సుహాసిని చంద్రబాబు ప్రకటనతో రాత్రికి రాత్రే ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఈ నేపథ్యంలో ఆమెను ఏమాత్రం అనుభవం లేదనీ..ఆమె మీడియా ముందు సరిగా మాట్లాడలేకపోతోందని.. తెలుగు రాదేమో అంటూ.. సోషల్ మీడియాలో విమర్శలు మొదలయ్యాయి. ఇదే సమయంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా ప్రచారంలో పాల్గొన్నారు. అయితే సుహాసిని సోదరులైన జూ.ఎన్టీఆర్ - కళ్యాణ్ రామ్ లు ప్రచారం చేస్తారా? లేదా అనే దానిపై సందిగ్దం ఏర్పడింది. తన సోదరులిద్దరూ ప్రచారం చేస్తారని సుహాసిని భావించారు. అయితే ఆమె పోటీకి మద్దతిచ్చిన ఎన్టీఆర్ ప్రచారానికి మాత్రం వెళ్లకూడదని నిర్ణయించుకున్నారు. సుహాసినికి మద్దతుగా ప్రకటన విడుదల చేసిన ఎన్టీఆర్.. తెలంగాణ రాజకీయాల్లో అంతకంటే ఎక్కువ జోక్యం చేసుకోకూడదని నిర్ణయం తీసుకున్నారని సమాచారం.

అయితే ఈ ఎపిసోడ్ లో ఎన్టీఆర్ తెలివిగా వ్యవహరించారంటున్నారు. హఠాత్తుగా తమ సోదరిని తెరమీదకు తీసుకురావడం వెనుక రాజకీయ ఎత్తుగడే ఉందనేది ఎన్టీఆర్ - కళ్యాణ్ రామ్ గ్రహించారని అంటున్నారు. ఒకవేళ నందమూరి కుటుంబానికి న్యాయం చేయాలని భావిస్తే...తన తనయుడికి ఇచ్చినట్లే ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవి లేదా నామినేటెడ్ పదవి ఇవ్వచ్చనీ..కానీ అలా చేయకపోగా...నేరుగా బరిలో దింపడం వెనుక లెక్కలు వేరేనని రాజకీయ విశ్లేషకు పేర్కొన్నారు. అదే నిజమైంది. ఎందుకంటే..ఫలితాల సరళిని గమనిస్తే తొలి నుంచి టీఆర్ ఎస్ అభ్యర్థి కృష్ణారావు ముందంజలో ఉన్నారు. అతి తక్కువ పోలింగ్ ఈ నియోజకవర్గంలో ఫలితం విషయంలో ఉత్కంఠ నెలకొన్నప్పటికీ సుహాసిని ఓటమి స్పష్టమైన వెనుకంజ వేయడం దీనికి తార్కాణంగా చెప్తున్నారు.