Begin typing your search above and press return to search.

బుల్లెట్ ఓకే బాల‌య్య‌.. హెల్మెట్ ఏది?

By:  Tupaki Desk   |   23 Jun 2017 4:47 PM GMT
బుల్లెట్ ఓకే బాల‌య్య‌.. హెల్మెట్ ఏది?
X
నెల‌ల త‌ర్వాత త‌న నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌ట‌న పెట్టుకున్నారు న‌టుడు.. హిందూపురం ఎమ్మెల్యే.. ఏపీ సీఎం చంద్ర‌బాబు వియ్యంకుడు నంద‌మూరి బాల‌కృష్ణ‌. ఆయ‌న లాంటి నేత త‌న నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌ట‌న అంటే మంత్రుల ద‌గ్గ‌ర నుంచి అంద‌రూ అలెర్ట్ అయ్యారు. ఆయ‌న చేప‌ట్టే సంక్షేమ కార్య‌క్ర‌మంలో పాలు పంచుకోవ‌టానికి ఆస‌క్తిని ప్ర‌ద‌ర్శించారు.

కొన్ని నెల‌లుగా నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించ‌క విమ‌ర్శ‌లు ఎదుర్కొనటంతో పాటు.. త‌మ ఎమ్మెల్యే క‌నిపించ‌టం లేదంటూ పోలీస్ స్టేష‌న్లో ఫిర్యాదు ఇచ్చిన వైనాన్ని మ‌ర్చిపోయారో ఏమో కానీ.. మంత్రి ప‌రిటాల సునీత మాట్లాడుతూ.. హిందూపురం ఎమ్మెల్యేగా బాల‌కృష్ణ బాధ్య‌త‌లు స్వీకరించిన త‌ర్వాత నియోజ‌క‌వ‌ర్గంలో అనేక సంక్షేమ కార్య‌క్ర‌మాల్ని చేప‌ట్టిన‌ట్లుగా పేర్కొన్నారు.

నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌ట‌న‌లో భాగంగా.. అభిమానుల్ని.. కార్య‌క‌ర్త‌ల్ని ఉత్సాహ ప‌రిచేందుకు బాల‌కృష్ణ బుల్లెట్ న‌డిపారు. అభిమానుల కేరింత‌ల న‌డుమ జోరుగా బుల్లెట్ న‌డిపిన ఆయ‌న‌.. హెల్మెట్ పెట్టుకోవాల‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోయిన‌ట్లున్నారు. ద్విచ‌క్ర‌వాహ‌నం న‌డిపేట‌ప్పుడు హెల్మెట్ పెట్టుకోవాల‌న్న‌ది ఒక నిబంధ‌న అయితే.. ఇటీవ‌ల కాలంలో రోడ్డు ప్ర‌మాదాలు చోటు చేసుకొని హెల్మెట్ ధ‌రించ‌ని కార‌ణంగా ప‌లువురు ప్రాణాలు కోల్పోతున్న సంగ‌తి తెలిసిందే.

ఇలాంటివ‌న్నీ బాల‌య్య‌కు గుర్తున్నాయో లేదో కానీ.. ఆయ‌న మాత్రం హెల్మెట్ పెట్టుకోలేదు. ప్ర‌ముఖులు.. అందునా స‌మాజాన్ని ప్ర‌భావితం చేసే వారు నిబంధ‌న‌ల్ని తూచా త‌ప్ప‌కుండా పాటించాల్సిన అవ‌స‌రం ఉంది. బుల్లెట్ మీద దూసుకెళ్లిన బాల‌య్య జోరు చూస్తే.. ఇలాంటివేమీ ఆయ‌న ఇవేమీ గుర్తున్న‌ట్లుగా కనిపించ‌లేద‌న్న విమ‌ర్శ వినిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/