టీడీపీకి రాజీనామా.. కాంగ్రెస్ లో చేరిక!

Fri Mar 15 2019 10:45:17 GMT+0530 (IST)

తెలుగుదేశం పార్టీ సీనియర్ లీడర్.. ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు  అత్యంత సన్నిహితుడిగా పేరున్న నామా నాగేశ్వరరావు ఆ పార్టీని వీడటం ఖాయమైనట్టుగా సమాచారం. బాబుతో నామా చివరి సమావేశం కూడా జరిగిపోయిందని.. ఆయన తెలుగుదేశానికి రాజీనామా చేయనున్నారని తెలుస్తోంది. టీడీపీని వీడి నామా కాంగ్రెస్ పార్టీలోకి చేరబోతూ ఉండటం గమనార్హం!అంతే కాదు..నామాకు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీ టికెట్ కూడా ఖరారు అయ్యిందట. ఖమ్మం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున నామా నాగేశ్వరరావు ఎంపీగా పోటీ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఆ మేరకు టికెట్ ఖరారు కావడంతో నామా తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయనున్నారని సమాచారం.

ఇప్పటికే చంద్రబాబుకు ఈ విషయాలను విశదీకరించడం కూడా జరిగిందని తెలుస్తోంది. అమరావతికి ఇటీవలే వెళ్లిన నామా బాబుతో సమావేశం అయ్యారట. ఇక అనంతరం తెలుగుదేశం పార్టీ తెలంగాణ పొలిట్ బ్యూరో సమావేశం జరిగినా దానికి నామా గైర్హాజరయ్యారు.

కాంగ్రెస్ టీడీపీల మధ్యన ఇప్పుడు సన్నిహిత సంబంధాలే ఉన్నాయి. ఏపీలో చాలా మంది కాంగ్రెస్ నేతలు తెలుగుదేశం తీర్థం పుచ్చుకోవడాన్ని చూస్తున్నాం.  ఇదే సమయంలో తెలంగాణలో టీడీపీకి భవితవ్యం ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యంలో టీడీపీలోని సీనియర్లు కాంగ్రెస్ దారిలో పయనిస్తున్నారని స్పష్టం అవుతోంది. ఇలా కాంగ్రెస్ టీడీపీలు నేతలను ఇచ్చిపుచ్చుకుంటున్నాయనే టాక్ కూడా వినిపిస్తోంది.