Begin typing your search above and press return to search.

టీటీడీపీ ప‌గ్గాలు ఆయ‌న చేతికేన‌ట‌!

By:  Tupaki Desk   |   24 Jan 2019 6:10 AM GMT
టీటీడీపీ ప‌గ్గాలు ఆయ‌న చేతికేన‌ట‌!
X
ఉమ్మ‌డి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి తెలంగాణ కంచుకోట‌. గ‌డ్డు ప‌రిస్థితుల్లోనూ పార్టీ ఆద‌రించిన ఘ‌నత తెలంగాణ ప్ర‌జ‌ల‌దే. కాల మ‌హిమ కానీ.. చంద్ర‌బాబు చేసుకున్న స్వ‌యంకృతం కానీ ఇప్పుడదే తెలంగాణ‌లో తెలుగుదేశం పార్టీ ఉనికి కోసం పోరాడాల్సిన దుస్థితి నెల‌కొంది.

రెండు క‌ళ్ల సిద్ధాంతంతో తెలంగాణ ఏర్పాటు కోసం చంద్ర‌బాబు క‌న్నింగ్ వ్యూహం బెడిసి కొట్టి చివ‌ర‌కు ఆయ‌న్నే దెబ్బే తీసే ప‌రిస్థితి. తెలంగాణ‌కు అనుకూలంగా లేఖ ఇస్తే.. ఆ పేరు ప్ర‌ఖ్యాతుల‌న్ని త‌న అకౌంట్లో ప‌డి.. తెలంగాణ ఏర్పాటులో త‌న‌దే కీల‌క‌మ‌న్న భావ‌న తెలంగాణ ప్ర‌జ‌ల‌కు క‌లుగుతుంద‌ని భావించిన చంద్ర‌బాబుకు షాకిస్తూ.. ఆ మైలేజీ మొత్తాన్ని త‌న ఖాతాలో వేసుకున్నారు కేసీఆర్‌.

తెలంగాణ ఏర్పాటుతో తెలుగుదేశం పార్టీ భ‌విష్య‌త్తు ప్ర‌శ్నార్థ‌క‌మైంది. టీడీపీ ఆంధ్రా పార్టీగా కేసీఆర్ వేసిన ముద్ర‌కు తెలంగాణ ప్ర‌జ‌లు పాజిటివ్ గా రియాక్ట్ కావ‌టంతో స‌మీక‌ర‌ణాలు మొత్తంగా మారిపోయాయి. దీంతో.. తెలంగాణ‌కు చెందిన బ‌ల‌మైన టీడీపీ నేత‌లంతా టీఆర్ ఎస్ గూటికి వెళ్లిపోయారు. ఒక‌ప్పుడు బ‌ల‌మైన నేత‌ల‌తో క‌ళ‌క‌ళ‌లాడిన టీడీపీ ఇప్పుడు క‌ళావిహీన‌మైంది.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంత‌రం తెలంగాణ రాష్ట్ర పార్టీ బాద్య‌త‌ల్ని ఎల్ ర‌మ‌ణ‌కు అప్ప‌జెప్పారు. కీల‌క‌మైన జీహెచ్ ఎంసీ ఎన్నిక‌ల్లోనూ.. ఇటీవ‌ల జ‌రిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లోనూ ఆశించినంతగా ర‌మ‌ణ ప‌ని తీరు లేక‌పోవ‌టం.. ఫ‌లితాల్ని ప్ర‌భావితం చేయ‌టంలో ఆయ‌న ఘోరంగా ఫెయిల్ కావ‌టంపై చంద్ర‌బాబు అసంతృప్తితో ఉన్న‌ట్లుగా చెబుతున్నారు. జ‌రిగిన న‌ష్టం జ‌రిగిపోయినా.. లోక్ స‌భ ఎన్నిక‌ల్లో పార్టీ ఇమేజ్ ను పెంచుకోవాల‌న్న ఆలోచ‌న‌లో చంద్ర‌బాబు ఉన్న‌ట్లు చెబుతున్నారు.

తెలంగాణ‌లో పార్టీని బ‌లోపేతంచేయాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్న చంద్ర‌బాబు ముందు రాష్ట్ర పార్టీ అధ్య‌క్షుడ్ని మార్చాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లుగా తెలుస్తోంది. ర‌మ‌ణ‌ను ప‌క్క‌న పెట్టి.. ఆయ‌న స్థానంలో ఖ‌మ్మం జిల్లా టీడీపీ సీనియ‌ర్ నేత‌.. మాజీ రాజ్య‌స‌భ స‌భ్యుడు.. బాబుకు అత్యంత స‌న్నిహితుడైన నామా నాగేశ్వ‌ర‌రావుకు అప్ప‌గించాల‌ని బావిస్తున్న‌ట్లుగా చెబుతున్నారు. అదే జ‌రిగితే పార్టీలో కొత్త ఉత్సాహం వ‌స్తుంద‌న్న ఆశ‌తో బాబు ఉన్నారు. మ‌రి.. టీటీడీపీ ప‌గ్గాలు అందుకునే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్న నామా పార్టీకి ఎలాంటి జ‌వ‌స‌త్వాలు తెస్తారో చూడాలి.