Begin typing your search above and press return to search.

సీట్ల పెంపుపై కేంద్రానికి నల్సార్ నోట్

By:  Tupaki Desk   |   27 March 2017 5:29 AM GMT
సీట్ల పెంపుపై కేంద్రానికి నల్సార్ నోట్
X
రాష్ట్ర విభజన సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల్నిపెంచుకునేందుకు వీలు గురించి విభజన చట్టంలోని సెక్షన్ 26 చెబుతోంది. విభజన చట్టంలో ప్రస్తావించిన సీట్ల పెంపు మాటను నేరుగా చెప్పేసినా బాగుండేది. కానీ.. దానికో పీటముడి వేస్తూ.. రాజ్యాంగంలోని అధికరణ 170(3) కింద అంటూ మెలిక పెట్టటంతోనే అసలు ఇబ్బంది అంతా. దీంతో.. సీట్ల పెంపును నేరుగా చేయించుకోలేని ఇబ్బంది. నియోజకవర్గాల్ని పెంచుకోవాలంటే తప్పనిసరిగా కేంద్రం మీద ఆధారపడాల్సిందే. 2019 ఎన్నికల నాటికి సీట్ల పెంపునకు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎన్నో ఆశల్ని పెట్టుకున్న వైనం తెలిసిందే. దీనిపై కేంద్రమంత్రులు ఒకరు.. సీట్ల పెంపు ప్రక్రియ లాంటిదేమీ లేదని చెబితే.. వెంకయ్య.. రాజ్ నాథ్ లాంటోళ్లు మాత్రం ఈ ప్రక్రియపై కసరత్తు జరుగుతోందని చెప్పటం తెలిసిందే.

ఇదిలా ఉంటే.. విభజన చట్టంలోని సెక్షన్ 26 ప్రకారం సీట్లు పెంచటానికి వీలు కాదంటూ అటార్నీ జనరల్ గతంలో కేంద్ర హోంశాఖకు చెప్పటం తెలిసిందే. అయితే.. ఏజీ వాదనతో విభేదిస్తూ.. నల్సార్ విశ్వవిద్యాలయానికి చెందిన రాజ్యాంగ నిపుణులు తమ అభిప్రాయాల్నివెల్లడిస్తూ.. సీట్ల పెంపు ప్రక్రియ ఎలా సాధ్యమన్న విషయాన్ని తెలియజేస్తూ.. ఒక నోట్ ఇచ్చారు. దీని ప్రకారం.. రాజ్యాంగ పరంగా ఎలాంటి మార్పులు చేయకుండానే అసెంబ్లీ సీట్ల పెంపు సాధ్యమన్న విషయాన్ని తెలియజేస్తూ.. నోట్ ను తయారు చేశారు. విభజన చట్టంలో పేర్కొన్న ప్రకారం..తెలంగాణలో 119 అసెంబ్లీస్థానాల నుంచి..153కు.. ఏపీలో 175 నుంచి 225 సీట్లు పెంచుకునే వీలుంది. అయితే.. అందుకు అడ్డుగా ఉందని చెబుతున్న అంశాలపై నల్సార్ నోట్ ఏం చెబుతోందన్న విషయాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.

సీట్ల పెంపునకు అడ్డుగా ఉన్న ‘‘అధికరణ 170(3) కింద ఉన్ననిబంధనలకు లోబడి’’ సీట్లు పెంచాలని చెప్పారు. మరి.. ఈ అధికరణ ఏం చెబుతోందన్న విషయాన్ని చూస్తే.. ఆర్టికల్ 2, 3 కింద ఏం చట్టం చేసినా అందులో పొందుపర్చిన నిబంధనలకు అనుగుణంగా రాజ్యాంగంలోని మొదటి.. నాలుగో షెడ్యూల్ లో సవరణలు చేయాల్సి ఉంటుంది. అధికరణ 2, 3 కింద యూనియన్ ఆఫ్ ఇండియా భూభాగంలో మార్పులు చేసే అధికారాన్నిఅధికరణ 4 పార్లమెంటుకు ఇస్తోంది. దీని కారణంగా అధికరణ 2, 3 కింద పార్లమెంటు ఏదైనా చట్టాన్ని తీసుకొస్తే దాన్నిరాజ్యాంగ సవరణా పరిగణించాల్సిన అవసరం లేదు. మంగళ్ సింగ్ వర్సస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం.. అధికరణ 4 కింద చట్టాలు చేసే అధికారం పార్లమెంటుకు ఉంటుంది.

అధికరణ 2, 3 కింద చేసే ఏ సవరణకైనా ఆర్టికల్ 368 కింద ఉన్ననిబంధనల నుంచి మినహాయింపు ఉంటుందని ఆర్టికల్ 4 చెబుతోంది. అందువల్ల ఈ రెండు నిబంధనల కింద చట్టాలు చేసే సమయంలో ఆర్టికల్ 368 కింద ఉన్నరూల్స్ ను అనుసరించాల్సిన అవసరం లేదని హోంశాఖకు సమర్పించిన నల్సార్ నోట్ స్పష్టం చేస్తోంది. రాజ్యాంగంలోని అధికరణ 170 (3)ని సవరించకుండా ఏపీ విభజనచట్టం సెక్షన్ 26 ప్రకారం అసెంబ్లీ సీట్లు పెంచటం సాధ్యంకాదని ఆటార్నీ జనరల్ ముఖుల్ రోహత్గీ గత ఏడాది ఇచ్చిన అభిప్రాయాన్నిరాజ్యాంగ నిపుణులు తోసిపుచ్చుతున్నారు. ఈ సందర్భంగా ప్రస్తావించిన ఒక కేసు తీర్పు సరి కాదని స్పష్టం చేస్తున్నారు. నల్సార్ నోట్ పై కేంద్ర హోం శాఖ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/