Begin typing your search above and press return to search.

అప్పుడే ప్లాన్‌..బీహార్ టీం...ప్ర‌ణ‌య్ హ‌త్య నిజాలివి

By:  Tupaki Desk   |   18 Sep 2018 3:14 PM GMT
అప్పుడే ప్లాన్‌..బీహార్ టీం...ప్ర‌ణ‌య్ హ‌త్య నిజాలివి
X
తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించి ప్రణయ్ హత్య కేసులో నిజానిజాలు వెలుగులోకి వ‌చ్చాయి. ప్రణయ్ హత్య కేసు నిందితులను ఇవాళ మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. ఈ కేసులో ఏ1 మారుతీరావు - ఏ2 సుభాష్‌ శర్మ - ఏ3 అస్గర్‌ అలీ - ఏ4 మహ్మద్‌ బారీ - ఏ5 అబ్దుల్‌ కరీం - ఏ6 మారుతీరావు సోదరుడు శ్రవణ్‌ ఏ7 మారుతీ రావు డ్రైవర్‌ శివకుమార్‌లలో ఏ2 మినహా మిగతావారిని మీడియా ముందు ప్రవేశపెట్టిన అనంత‌రం ఎస్పీ రంగనాథ్ వెల్లడించారు. ``ప్రణయ్ హత్య కేసులో ఏడుగురిని అరెస్ట్ చేశాం. ప్రణయ్‌ను హత్యచేసింది సుభాష్ శర్మ. అతన్ని బీహార్‌లో అరెస్ట్ చేశాం. జూన్ నుంచి ప్రణయ్ హత్యకు కుట్ర జరిగింది. అస్గర్ అలీ సూచనల ప్రకారం ప్రణయ్ హత్యకు కుట్ర జరిగిందని ఎస్పీ రంగనాథ్ తెలిపారు. 2011 నుంచే కరీం - బారీతో మారుతీరావుకు పరిచయం ఉంది. మారుతీరావు తరపున కరీం - బారీతో ఒప్పందం చేసుకున్నాడు.ప్రణయ్ హత్యకు కోటి రూపాయలతో ఒప్పందం కుదుర్చుకున్నాడు`` అని వెల్ల‌డించారు.

ప్రణయ్ 10వ తరగతి, అమృత 9వ తరగతి ఉన్నప్పటి నుంచి ప్రేమించుకుంటున్నారని ఎస్పీ రంగ‌నాథ్‌ తెలిపారు. హైదరాబాదులో ఇద్దరు ఇంజినీరింగ్ చేశారని తెలిపారు. ప్రేమ వ్యవహారంలో ప్రణయ్, అమృతలు ఇంజినీరింగ్ మధ్యలోనే ఆపేశారని చెప్పారు. సెప్టెంబర్ మొదటివారంలోనూ అమృతను కిడ్నాప్ చేసి ప్రణయ్‌ను చంపాలని ప్రయత్నం చేశారని ఎస్పీ రంగనాథ్ తెలిపారు. ``ప్రణయ్ హత్య కోసం ఒక స్కూటీ వాహనం, మూడు సిమ్‌కార్డులు కొన్నారు. హత్య కోసం అస్గర్ అలీ మూడు ఆయుధాలు కొనుగోలు చేశాడు. మరో పక్క అమృతను అబార్షన్ చేయించుకోవాలని తండ్రి మారుతీరావు ఒత్తిడి చేశారు. డాక్టర్ జ్యోతితో అమృత తండ్రి మారుతీరావు ఈ విషయమై మాట్లాడారు. ఆగస్టు 9 నుంచి ప్రణయ్ హత్యకు ప్లాన్ మొదలైంది. ఆగస్టు 14నే బ్యూటీ పార్లర్ దగ్గర ప్రణయ్ హత్యకు కుట్ర జరిగింది. ప్రణయ్, అమృత రిసెప్షన్ తరువాత హత్యకు కుట్ర జరిగింది` అని వెల్లడించారు. ``హత్య జరిగిన ప్రాంతానికి కొద్ది దూరంలో అస్గర్ అలీ కూడా ఉన్నాడు. ప్రణయ్ హత్య జరిగిన తీరును బారీ మారుతీరావుకు చేరవేశాడు. హత్య తర్వాత సుభాష్ శర్మ నల్గొండ నుంచి బెంగళూరుకు, బెంగళూరు నుంచి పాట్నాకు పరారయ్యాడు. రేపటిలోగా హంతకుడు సుభాష్‌శర్మను నల్లగొండకు తీసుకొస్తమని చెప్పారు. హత్య - ఎస్సీ - ఎస్టీ అట్రాసిటీ కింద నిందితులపై కేసు నమోదు చేశాం. ఈ కేసులో ఐదుగురు ప్రధాన నిందితులున్నారు. మరో ఇద్దరికి బెయిల్ వచ్చే అవకాశాలున్నాయని ఎస్పీ రంగనాథ్ తెలిపారు.

మారుతీరావు మొదటి నుంచి మోసకారి అని ఎస్పీ రంగనాథ్ తెలిపారు. మారుతీ రావు తొలుత కష్టాన్ని, ఆ తర్వాత మోసాన్ని నమ్ముకొని ఎదిగాడని చెప్పారు. మారుతీ రావు స్థిరాస్తి వ్యాపారాలపై వస్తున్న ఆరోపణల మీద విచారణ జరిపిస్తామని తెలిపారు. ప్రణయ్ హత్య కేసుకు సంబంధించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేశామని, ఏ కాల్‌డేటా పరిశీలించినా నేతల ప్రమేయం లేదని తేలిందని చెప్పారు. ప్రణయ్ హత్య కేసు వ్యక్తిగత కోణంలో జరిగిందేనని ఎస్పీ రంగ‌నాథ్ వివ‌రించారు.

ఏ1 నిందితుడు సుభాష్‌ శర్మ బిహార్‌లోని సమస్తిపూర్‌ జిల్లాకు చెందిన వ్యక్తి. గతంలోచోరీ కేసులో నిందితుడైన సుభాష్‌కు మహమ్మద్‌ బారికి రాజమండ్రి సెంట్రల్‌ జైలులో పరిచమయ్యాడు. సుభాష్‌ శర్మ మిర్యాలగూడలో ఆసుపత్రి వద్ద కత్తితో ప్రణయ్‌ను నరికాడు. అస్గర్‌ అలీ స్పాట్‌లో ఉండి డైరెక్షన్‌ ఇచ్చాడు. అస్గర్‌ ఆలీ వివేక్‌ పాండ్యా హత్యకేసులో నిందితుడు. ఏ4 మహ్మద్‌ బారీ హైదరాబాద్‌ మలక్‌పేటలో ఉంటాడు. అస్గర్‌ అలీ - బారీ మిత్రులు. ఏ5 అబ్దుల్‌ కరీం మిర్యాలగూడలో ట్రాన్స్‌పోర్టు ఆపరేటర్‌. ఏ6 మారుతీరావు సోదరుడు శ్రవణ్‌, ఏ7 శివ (మారుతీరావు డ్రైవర్‌).