Begin typing your search above and press return to search.

బీజేపీకి షాకిచ్చి కాంగ్రెస్ గూటికి ఫైర్ బ్రాండ్‌

By:  Tupaki Desk   |   21 Feb 2018 7:03 AM GMT
బీజేపీకి షాకిచ్చి కాంగ్రెస్ గూటికి ఫైర్ బ్రాండ్‌
X
దేశ వ్యాప్తంగా రాజ‌కీయం అంత‌కంత‌కూ వేడెక్కుతోంది. ఇందుకు త‌గిన‌ట్లు రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజ‌కీయ వాతావ‌ర‌ణంలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్లే జ‌రిగితే.. ఈ డిసెంబ‌రు నాటికే సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌రిగే వీలుంద‌న్న వాద‌న‌లు వినిపిస్తున్న వేళ‌.. వ‌ల‌స‌ల కార్య‌క్ర‌మం మ‌ళ్లీ షురూ అయ్యింది.

గ‌తానికి భిన్నంగా ఇటీవ‌ల కాలంలో చోటు చేసుకున్న కొత్త ప‌రిణామం ఏమిటంటే.. ఎన్నిక‌లు ముగిసిన వెంట‌నే అధికార పార్టీ గూటికి విప‌క్ష నేత‌లు జంప్ కావటంగా చెప్పాలి. మెజార్టీ ప్ర‌జాప్ర‌తినిధులు ఉన్న‌ప్ప‌టికీ.. విప‌క్షాల్ని అంత‌కంత‌కూ ఉక్కిరిబిక్కిరి చేయ‌టం.. కోలుకోలేని రీతిలో దెబ్బ తీయాల‌నుకోవ‌టం ఈ మ‌ధ్య‌న ఎక్కువైంది.

ఇందులో భాగంగానే ఇప్పుడు స‌రికొత్త మార్పులు చేర్పులు షురూ అయ్యాయి.గ‌డిచిన కొంత‌కాలంగా బీజేపీలో ఉన్నా.. ఆ పార్టీ సంస్కృతితో మ‌మేకం కాలేక‌పోతున్న నేత‌ల్లో తెలంగాణ ఫైర్ బ్రాండ్ నాగం జ‌నార్ద‌న్ రెడ్డి ఒక‌రు. బీజేపీలో మొద‌ట్నించి ఉన్న వారు త‌ప్పించి.. కొత్త‌గా చేరిన వారికి స‌రైన గుర్తింపు లేక‌పోవ‌టం.. వారిని అధినాయ‌క‌త్వం విశ్వాసంలో తీసుకోక‌పోవ‌టం మొద‌ట్నించి ఉన్న‌దే.

సంఘ్ బ్యాక్ గ్రౌండ్ లేక‌పోవ‌టాన్ని ఒక లోపంగా చూపిస్తూ.. కీల‌క బాధ్య‌త‌లు ఇవ్వని నేప‌థ్యంలో.. ఆ పార్టీలో ఉంటే త‌మ రాజ‌కీయ భ‌విష్య‌త్తు ప్ర‌మాదంలో ప‌డిన‌ట్లేన‌న్న భావ‌న ప‌లువురిలో క‌నిపిస్తోంది. అదును చూసి పార్టీ మారాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్న నేత‌లు ఇప్పుడు స‌రైన అవ‌కాశం కోసం చూస్తున్నారు. అలాంటి వారిలో నాగం ఒక‌రు. తాజాగా ఆయ‌న కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ట్లుగా తెలుస్తోంది. రెండు రోజుల క్రితం టీ పీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్ కుమార్ రెడ్డితో క‌లిసి పార్టీ అధినేత రాహుల్ గాంధీతో భేటీ అయిన‌ట్లుగా స‌మాచారం.

ఈ సంద‌ర్భంగా కాంగ్రెస్ పార్టీ తీర్థం తీసుకున్న‌ట్లుగా తెలుస్తోంది. అయితే.. అధికారికంగా ఈ వార్త ధ్రువీక‌ర‌ణ కావాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. బీజేపీ నేత‌లు మాత్రం నాగంకు పార్టీలో బోలెడంత ప్రాధాన్య‌త ఇచ్చిన‌ట్లుగా చెబుతున్నారు. ఉస్మానియా మెడిక‌ల్ కాలేజీ నుంచి వైద్య‌విద్య‌లో ప‌ట్టా తీసుకున్న నాగంకు మంచి వ‌క్త‌గా పేరుంది.

ఫైర్ బ్రాండ్ మాదిరి ప్ర‌త్య‌ర్థి పార్టీల‌పై దునుమాడే నాగం.. గ‌తంలో కాంగ్రెస్ నేత‌ల‌పై తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తిన చ‌రిత్ర ఉంది. అలాంటి ఆయ‌న తాజాగా బీజేపీని వ‌దిలి.. కాంగ్రెస్ కండువా క‌ప్పుకునేందుకు రెఢీ అయిపోయార‌న్న వాద‌న ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.