Begin typing your search above and press return to search.

ఫైన్ కట్టే కన్నా.. ట్రక్కు వదిలేయటమే బెటరేమో?

By:  Tupaki Desk   |   15 Sep 2019 5:30 AM GMT
ఫైన్ కట్టే కన్నా.. ట్రక్కు వదిలేయటమే బెటరేమో?
X
రికార్డుల్ని బ్రేక్ చేయటం అంత తేలికైన విషయం కాదు. కానీ.. అందుకు భిన్నంగా కొన్ని రాష్ట్రాల్లో కొత్తగా అమల్లోకి తెచ్చిన వాహన చట్టం పుణ్యమా అని రోజురోజుకీ రికార్డులు మారిపోతున్నాయి. ఒకరికి మించి మరొకరు అన్నట్లుగా వివిధ రాష్ట్రాల్లోని అధికారులు వాహనాలకు విధిస్తున్న జరిమానాలు దేశ వ్యాప్తంగా వార్తలుగా మారుతున్నాయి. ఇప్పుడు ఆ కోవకే వస్తుంది ఒడిశాకు చెందిన ఒక ట్రక్కు ఫైన్ వ్యవహారం.

ఒడిశాలోని సంభల్ పూర్ కు చెందిన ఒక వాహనానికి అధికారులు వేసిన జరిమానా లెక్క చూసి అవాక్కు అవ్వటమే కాదు.. షాక్ కు గురి అవుతున్నారు. నాగాలాండ్ కు చెందిన ఒక ట్రక్కును ఒడిశా అధికారులు తనిఖీల నిమిత్తం ఆపారు. ఈ సందర్భంగా వారు కొత్త విషయాల్ని బయటపెట్టారు.

ఎన్ ఎల్ 08 డి7079 నెంబరున్న ఈ వాహనాన్ని గడిచిన ఐదేళ్లుగా రోడ్ ట్యాక్స్ కట్టని విసయాన్ని గుర్తించారు. అంతేకాదు.. వాయు.. శబ్ద కాలుష్యంతో పాటు.. సరుకుల రవాణాకు ఉపయోగించాల్సిన వాహనంలో ప్రయాణికుల్ని ఎక్కించటంతో పాటు.. మొత్తం ఏడు రూల్స్ ను బ్రేక్ చేసినట్లు గుర్తించారు.

మొత్తంగా సదరు లారీపైన రూ.6.53 లక్షల జరిమానాను విధిస్తూ సంభల్ పూర్ రీజనల్ ట్రాన్స్ పోర్ట్ అధికారి చలానా రాశారు. దీంతో దేశంలో ఒక వాహనంపై భారీ జరిమానా రికార్డును నాగాలాండ్ ట్రక్కు సొంతం చేసుకుంది. రానున్న రోజుల్లో ఈ ఫైన్ల పరంపర ఏ స్థాయికి వెళుతుందో చూడాలి.