టిక్కెట్ నాగబాబుకి - పంచ్ లోకేష్ కి

Wed Mar 20 2019 14:15:26 GMT+0530 (IST)

నాగబాబు శ్రమ ఫలించింది. అనధికారికంగా ఆయన జనసేన తరఫున ఒక యూట్యూబ్ ఛానెల్ పెట్టి వైసీపీ - టీడీపీలను గట్టిగా వేసుకుంటున్నారు. అన్న శ్రమను గుర్తించిన పవన్ ఆయనను ఎంపీ అభ్యర్థిగా ఎంపిక చేశారు. నరసాపురం ఎంపీ టిక్కెట్ ను ఆయనకు ఇచ్చారు.మరోవైపు నాగబాబు చేరికను కూడా జనసేన టీడీపీపై దాడికి ఉపయోగించుకుంది. సాధారణంగా జనసేన వైసీపీపై కేవలం విమర్శలే చేస్తుంది. కానీ అరుదుగా అయినా ఛాన్సు దొరికినపుడల్లా టీడీపీ నోరు పెగలని పంచులు వేస్తోంది. తాజాగా నరసాపురం పార్లమెంటు అభ్యర్థి గా జనసేన నాగబాబుని దింపిన నేపథ్యంలో లోకేష్ పై భారీ పంచ్ వేసింది. ఆయనకు టిక్కెట్ ఇస్తూ అధికారికంగా ప్రకటన విడుదల చేస్తూనే ఆ పార్టీ సోషల్ మీడియాలో లోకేష్ ని పరోక్షంగా ప్రస్తావిస్తూ *నాగబాబు గారిని సొంత అన్నయ్య అని చెప్పి దొంగ మార్గంలో పార్టీలో చేర్చుకోవట్లేదు. రాజ మార్గంలో ఎన్నికల్లో నిలబెడుతున్నాం. ప్రజా తీర్పుని గౌరవిస్తాం* అంటూ పవన్ పంచ్ వేశారు. అంటే లోకేష్ ని ప్రత్యక్ష ఎన్నికల్లో నిలబెట్టకుండా మంత్రి చేశారు... కానీ నా అన్నను కూడా నేను గెలిస్తేనే పదవులు ఇస్తా అని అర్థమయ్యేలా పార్టీ వ్యాఖ్యలున్నాయి.

బుధవారం విజయవాడలోని జనసేన కార్యాలయంలో పవన్ కళ్యాణ్ సమక్షంలో నాగబాబు ఆ పార్టీలో చేరగా అన్నయ్య నాగబాబుకు పార్టీ కండువా వేసి ‘తమ్ముడు’ పవన్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం నాగబాబు మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. పవన్ తనకు తమ్ముడు కావొచ్చుగానీ కానీ పార్టీ పరంగా అందరు కార్యకర్తల్లాగే తనకు కూడా నాయకుడేనని వ్యాఖ్యానించారు. పార్టీ కోసం ఏ పని చేయడానికి సిద్ధమని చెప్పారు.

‘పార్టీ కార్యాలయంలో తుడవాల్సిన పని చేయాల్సి వచ్చినా చేయడానికి సిద్ధమే.. కానీ తమ్ముడు నాకు ఈ రోజు మంచి గౌరవం ఇచ్చాడు. దాన్ని చేతల్లో చేసి చూపెడతా’ అని నాగబాబు అన్నారు. అయితే నాగబాబు తమ్ముడి కోసం ఇప్పటినుంచే కాదే ఆల్రెడీ ఎప్పట్నుంచో కష్టపడుతున్నాడు. నిజం చెప్పాలంటే... పీఆర్పీ పెట్టినపుడు చిరంజీవికి కూడా ఈస్థాయిలో నాగబాబు ఉపయోగపడలేదు.