Begin typing your search above and press return to search.

మ‌నోహ‌ర్ రాజ‌కీయం.. అర్థం కావ‌డం లేదే!

By:  Tupaki Desk   |   23 Jun 2018 1:21 PM GMT
మ‌నోహ‌ర్ రాజ‌కీయం.. అర్థం కావ‌డం లేదే!
X
ఏపీలో ప్ర‌స్తుత రాజ‌కీయ ప‌రిస్థితులు కొంద‌రు మాజీల‌కు అవ‌కాశాలను సృష్టిస్తోంది. దేశ చ‌రిత్ర‌లోనే ఒక అతిపెద్ద రాజ‌కీయ ప్ర‌కంప‌న‌గా రాష్ట్ర విభ‌జ‌న‌ను పేర్కొన‌వ‌చ్చు. చాలా పార్టీలు చాలా త‌ప్పులు చేశాయి గాని కాంగ్రెస్ చేసిన విభ‌జ‌న నిర్ణ‌యం ఆ పార్టీని మాత్ర‌మే కాదు, ఆ పార్టీ నేత‌ల‌కు కూడా భ‌విష్య‌త్తు లేకుండా చేసింది. కొంద‌రు రాజ‌కీయాల నుంచి అయిష్టంగానే త‌ప్పుకునే ప‌రిస్థితి. ఎన్న‌డూ ఓడిపోని వారు కూడా డిపాజిట్లు కోల్పోయిన అరుదైన సంద‌ర్భ‌మ‌ది. క‌ట్ చేస్తే నాలుగేళ్లు గ‌డిచిపోయాయి.

మ‌ళ్లీ ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్నాయి. జ‌నం మ‌తిమ‌రుపు మీద త‌మ భ‌విష్య‌త్తు నిర్మించుకోవ‌డానికి రాజ‌కీయాలకు దూరంగా ఉన్న మాజీలు సిద్ధ‌మ‌వుతున్నారు. తాజాగా గ‌త టెర్ములో స్పీక‌ర్‌ గా చేసిన నాదెండ్ల మ‌నోహ‌ర్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. హైదరాబాదులో జరిగిన ఈ సమావేశంలో వారిద్దరూ దాదాపు అరగంట సేపు చర్చలు జరిపారు. సాధార‌ణంగా అయితే ఇది అంత సంచ‌ల‌నం కాక‌పోవ‌చ్చు గాని కేవ‌లం నాలుగు రోజుల క్రిత‌మే కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీని ఇత‌ర నేత‌ల‌తో క‌లిసిన నాదెండ్ల ఇపుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను క‌ల‌వ‌డంతో ఇది సంచ‌ల‌నం అయ్యింది.

మ‌నోహ‌ర్ తో పాటు మ‌రికొంద‌రు జ‌న‌సేన‌ - కాంగ్రెస్‌ - వైసీపీ వైపు చూస్తున్నారు. కొంద‌రు ఈ మ‌ధ్య క్రియాశీలంగా మారే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

మ‌నోహ‌ర్ -పవన్ భేటీలో అనేక అంశాలు చ‌ర్చ‌కు వ‌చ్చాయ‌ని చెబుతున్నారు. మ‌నోహ‌ర్ అధిక విద్యావంతుడు కావ‌డం వ‌ల్ల ప‌వ‌న్ ఆయ‌న వైపు చూస్తున్నాడ‌ని అంటున్నారు. ఈ భేటీ నేపథ్యంలో నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నా ఎటువంటి అధికారిక ప్ర‌క‌ట‌నా వెలువ‌డ‌లేదు.