Begin typing your search above and press return to search.

బాబు దావోస్‌...ఉత్త బోగ‌స్ అంట‌

By:  Tupaki Desk   |   23 Jan 2017 7:46 AM GMT
బాబు దావోస్‌...ఉత్త బోగ‌స్ అంట‌
X
ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు దావోస్ ప‌ర్య‌ట‌నపై అనేక సందేహాలు క‌లుగుతున్నాయ‌ని పీసీసీ ఉపాధ్యక్షుడు, మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి పెట్టుబడులు రావాలని, లక్షలాది మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కలగాలని ఎదురుచూస్తున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం దీనికి తీసుకుంటున్న చర్యలతో పాటు దావోస్ పర్యటనలపై కలిగిన లాభనష్టాలను వివరిస్తూ శ్వేత‌పత్రాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాసిన మనోహర్ ప్రస్తుత ప్రభుత్వంలో సీఎంగానే కాకుండా పరిశ్రమల శాఖనూ చూస్తున్న చంద్రబాబు వరుసగా మూడుసార్లు దావోస్ పర్యటన చేసి అనేక మంది వ్యాపార దిగ్గజాలను కలిశారని, రాష్ట్రానికి ఎంత మేలు చేశారో శ్వేత‌పత్రంలో వివరించాలన్నారు.

2015లో జరిగిన దావోస్ పర్యటనలో మైక్రోసాఫ్ట్ వ్య‌వ‌స్థాప‌కుడు బిల్‌గేట్స్, ఆ సంస్థ సీఈఓ సత్య నాదెళ్లను కలిసి మైక్రోసాఫ్ట్ అభివృద్ధి సెంటర్ ఏర్పాటు చేస్తారని ప్ర‌క‌టించార‌ని నాదెండ్ల మ‌నోహ‌ర్‌ గుర్తు చేశారు. ప్ర‌ఖ్యాత సంస్థ‌లైన‌ పెప్సీ, వాల్‌మార్ట్, విప్రో, హీరో మోటార్స్ కార్పొరేషన్ లాంటి సంస్థలు త్వరలో రాష్ట్రానికి భారీ పెట్టుబడులతో పరిశ్రమలను స్థాపించేందుకు వస్తారంటూ ప్రజలకు నమ్మకం కలిగించారని నాదెండ్ల మ‌నోహ‌ర్ గుర్తు చేశారు. కానీ ఇప్పటివరకూ కనీసం ఒక్క పరిశ్రమ కూడా ఏర్పాటు కాకపోవడంతో ఈ ప్ర‌క‌ట‌న‌ల‌న్నీ బోగ‌స్ అనే భావ‌న క‌లుగుతోంద‌ని వ్యాఖ్యానించారు. అందుకే శ్వేత‌ప‌త్రం రూపంలో పెట్టుబ‌డులను స్పష్టం చేయాలని మ‌నోహ‌ర్ డిమాండ్ చేశారు. లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వస్తాయని, మన జీవితాలు మారిపోతాయంటూ నిరుద్యోగులు కలలు కంటున్న తరుణంలో చంద్రబాబు పరిపాలన తీరు మాయని మచ్చగా మిగిలిపోతోందన్నారు. టీడీపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే ఆయా అంశాలపై శ్వేత‌పత్రం విడుదల చేయాలని మనోహర్ డిమాండ్ చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/