Begin typing your search above and press return to search.

నిమ్మకూరు ఎన్టీఆర్ ఇల్లు పట్టదెందుకు?

By:  Tupaki Desk   |   4 Oct 2015 9:52 AM GMT
నిమ్మకూరు ఎన్టీఆర్ ఇల్లు పట్టదెందుకు?
X
ఒక రాష్ట్రంలో అధికారపార్టీగా.. మరో రాష్ట్రంలో అధికారం కోసం కిందామీదా పడుతూ.. జాతీయస్థాయిలో పార్టీని పలు రాష్ట్రాల్లో పరిచయం చేయాలని తపిస్తున్నారు ఏపీ ముఖ్యమంత్రి.. తెలుగుదేశం పార్టీ కేంద్ర కమిటీ అధ్యక్షులు చంద్రబాబు. పార్టీ సమావేశాల్లో ప్రతిసారీ.. పార్టీ వ్యవస్థాపకులు.. తన మామ అయిన ఎన్టీఆర్ ను విపరీతంగా పొగిడేస్తుంటారు.

చంద్రబాబుతో పాటు.. ఎన్టీఆర్ కటుంబ సభ్యులు మొత్తం.. పెద్దాయన పేరు చెప్పేసుకొని ఇప్పటికి బతికేసే పరిస్థితి. ఎన్టీఆర్ మీద తమకెంతో ప్రేమాభిమానాలు ఉన్నాయని.. గౌరవ మర్యాదలు ఉన్నట్లు చెప్పే వారు.. వాస్తవంలోనూ అలాంటి అభిమానాన్నే ప్రదర్శిస్తున్నారా? అన్నది ఒక ప్రశ్న. ఎందుకంటే.. ఎన్టీఆర్ సొంతూరు అయిన కృష్ణా జిల్లా నిమ్మకూరులో ఆయన నివసించిన ఇంటి దుస్థితి చూస్తే.. ఈ ప్రశ్న మదిలో మెదలక మానదు.

తెలుగు జాతి మొత్తాన్ని ఏకం చేయటమే కాదు.. తాను ప్రారంభించిన తెలుగుదేశం పార్టీతో.. దశాబ్దాల తరబడి అధికారం ఉండేలా చేయటంలో ఆయన ఇమేజ్ ఎంతో సాయం చేసిందని చెప్పొచ్చు. అలాంటప్పుడు. ఎన్టీఆర్ నివసించిన ఇల్లు పాడుబడినట్లుగా ఉంటే ఎందుకు పట్టనట్లుగా ఉండిపోయారన్నది ఒక ప్రశ్న.

పాతికేళ్ల కిందట ఎన్టీఆర్ ఒకప్పుడున్న ఇంటిని కొద్దిభాగం రిపేరు చేసినా.. ఇప్పుడది పాడుపడిన ఇల్లుగా ఉండిపోయింది. ఇప్పటికి నిమ్మకూరు పేరు తలిచే వారంతా.. ఆ ఊరికి వెళితే మాత్రం బంధువుల ఇళ్లల్లో ఉంటారే తప్పించి.. తమ కుటుంబానికి పెద్ద అయిన ఎన్టీఆర్ నివసించిన ఇంటిని అందంగా ఎందుకు తయారు చేయించలేకపోతున్నారు? ఆ ఇంట్లో ఉండటం కుదరకపోతే.. కనీసం ఎన్టీఆర్ కు సంబంధించిన వస్తువులతో మ్యూజియం ఏర్పాటు చేసినా బాగుంటుంది కదా. మరి.. ఇలాంటి ఆలోచనలు ఎందుకు చేయనట్లు? మహానుభావుడిగా మాటలతో కీర్తించే బాబు అండ్ కో.. చేతల్లో కూడా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయేలా స్మారకం ఏర్పాట్లు ఎందుకు చేయరన్నది పెద్ద ప్రశ్నగా చెప్పొచ్చు.