దోవల్ పాక్ పెద్దలతో రహస్య భేటీ నిజమేనట

Fri Jan 12 2018 16:50:17 GMT+0530 (IST)

ఇరుగుపొరుగున ఉన్న భారత్-పాకిస్తాన్ మధ్య ఒకరకంగా ఉద్రిక్త వాతావరణ నెలకొన్న నేపథ్యంలో ఓ రహస్య భేటీ వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. గత ఏడాది చివరిలో  కుల్ భూషణ్ జాదవ్ తో కుటుంబసభ్యుల సమావేశం తర్వాత పాకిస్థాన్ తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఆ ఘటన జరిగిన రెండురోజులకు.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నమ్మినబంటుగా ఉండే భారత భద్రత సలహాదారు అజిత్ దోవల్ ఓ రహస్య సమావేశంలో పాల్గొన్నారు. అది కూడా పాక్ అధికారులతో కావడం విశేసం. అయితే ఈ విషయాన్నిపాక్ బయటపెట్టడం మరింత ఆసక్తికరం. దీనిపై కలకలం రేగిన నేపథ్యంలో....భారత్ - పాకిస్థాన్ భద్రత సలహాదారుల మధ్య చర్చలు జరిగాయని 15 రోజుల తరువాత విదేశాంగ శాఖ ధృవీకరించింది.డిసెంబర్ 27న థాయ్ లాండ్ లో పాక్ భద్రత సలహాదారు లెఫ్ట్ నెంట్ జనరల్ నాజర్ ఖాన్ జంజువా - అజిత్ దోవల్ భేటీ జరిగినట్లు పాకిస్థాన్ కు చెందిన డాన్ పత్రిక వెల్లడించింది. `భారత్ - పాకిస్థాన్ దేశాల జాతీయ భద్రత సలహాదారుల సమావేశం చాలా బాగా జరిగింది. ఈ భేటీ ఉపయోగకరం కూడా. దోవల్ చాలా స్నేహపూర్వకంగా మాట్లాడారు` అని పాక్ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించినట్లు ఆ పత్రిక పేర్కొన్నది. అయితే ఈ భేటీపై భారత్ రెండువారాల తర్వాత స్పందించింది. భారత్ - పాక్ జాతీయభద్రతా సలహాదారులు అజిత్ దోవల్ - లెఫ్టినెంట్ జనరల్ నాజర్ ఖాన్ జంజువాలా మధ్య థాయ్ లాండ్ లో చర్చలు జరిగాయని విదేశాంగ ప్రతినిధి రవీశ్ కుమార్ తెలిపారు. ఉగ్రవాద నిర్మూలన - సీమాంతర ఉగ్రవాదంపై వారు చర్చలు జరిపారని చెప్పారు. ఓ వైపు ఉగ్రవాద చర్యలకు పాల్పడుతూ - మరోవైపు చర్చలు జరుపడం సాధ్యం కాదని - సీమాంతర ఉగ్రవాదాన్ని నిరోధించాలని భారత్ తేల్చి చెప్పిందని ఆయన తెలిపారు. భారత్-పాక్ ల మధ్య వివిధ స్థాయిల్లో చర్చలు జరుగుతూనే ఉన్నాయన్నారు.అందులో భాగమే ఇదని తెలిపారు.

కాగా కుల్ భూషణ్ జాదవ్ ఘటనకూ ఈ భేటీకి ఎలాంటి సంబంధం లేదని ముందుగా నిర్ణయించుకున్న మేరకే సమావేశం జరిగిందని పాక్ అధికారులు చెప్పారు. ఇరుదేశాల భద్రతా సలహాదారులు మూడోదేశంలో భేటీ కావడం ఇది మొదటిసారి కాదు. 2015 డిసెంబర్ లో భద్రతాసలహాదారులు - విదేశాంగశాఖ కార్యదర్శులు బ్యాంకాక్ లో సమావేశమయ్యారు. అయితే ఆనాటి సమావేశ వివరాలను ఇరుదేశాల ప్రభుత్వాలే బయటకు వెల్లడించాయి. కానీ తాజా భేటీ వివరాలను మాత్రం భారత్ ఆలస్యంగా వెల్లడించింది.