Begin typing your search above and press return to search.

ఎన్‌ ఆర్‌ ఐ భర్తలూ.. బహుపరాక్‌!

By:  Tupaki Desk   |   14 Jun 2018 4:31 PM GMT
ఎన్‌ ఆర్‌ ఐ భర్తలూ.. బహుపరాక్‌!
X
ఎన్‌ ఆర్‌ ఐ భర్తల ఆగడాలకు ఇక కాలం చెల్ల‌నుంది. దుర్భుద్ధితో వ్య‌వ‌హ‌రించే వారికి అర‌దండాలు ప‌డ‌టం ఖాయం. లక్షల్లో కట్నం తీసుకుని - కొద్దిరోజుల్లో వస్తానంటూ నవ వధువుని మభ్యపెట్టి విదేశాలకు చెక్కేసి ముఖం చాటేసే ఎన్‌ఆర్‌ఐ పెళ్లికొడుకుల తాటతీసే కొత్త చట్టాలు త్వరలో అమల్లోకి రానున్నాయి. కుటుంబ వివాదాల్లో చిక్కుకుని కోర్టు నోటీసుల‌ను బేఖాతరు చేస్తూ - న్యాయస్థానాలకు హాజరుకాని ఎన్‌ ఆర్‌ ఐ భర్తలపై కేంద్రం కొరడా ఝుళిపించనుంది. నిందితుడికి చెందిన ఉమ్మడి ఆస్తిలో అతడి వాటాను జప్తు చేయడంతోపాటు - అతడి పాస్‌ పోర్టును కూడా రద్దుచేయాలని కేంద్రం యోచిస్తోంది. ఇందుకోసం చట్టసవరణలు చేయనుంది.

విదేశాల్లో ఉద్యోగం - ఉపాధి - వ్యాపారాలు చేస్తున్నామ‌ని పేర్కొంటూ తమ ఆకర్షణీయమైన జీవనశైలిని ఎరగావేసి అమ్మాయిలను పెళ్లిచేసుకొని ఆ తర్వాత ఎన్‌ ఆర్‌ ఐ యువకులు ముఖం చాటేస్తున్న సంఘటనలు ఇటీవల ఎక్కువయ్యాయి. ముఖ్యంగా పంజాబ్‌ లో ఎన్‌ ఆర్‌ ఐ భర్తల ఆగడాలకు హద్దులేకుండా పోయింది. దీంతో బాధిత మహిళలకు సత్వర న్యాయం చేకూర్చేందుకు ముఖం చాటేసే ఎన్‌ ఆర్‌ ఐ భర్తలపై కఠిన చర్యల్ని తీసుకోవాలని రాజ్‌ నాథ్‌ సింగ్‌ - సుష్మాస్వరాజ్‌ - మేనకాగాంధీ - రవిశంకర్‌ ప్రసాద్‌ లతో కూడిన కేంద్ర మంత్రుల బృందం సిఫార్సుచేసింది. ఈ మేరకు బుధవారం మంత్రుల బృందం పలు కీలక అంశాలపై చర్చలు జరిపింది. అనంతరం ఈ వివరాల్ని మీడియాకు వెల్లడించారు. ఎన్‌ ఆర్‌ ఐ భర్తలకు చెక్‌ పెట్టడంలో భాగంగా విదేశీ వ్యవహారాల శాఖ ప్రత్యేకంగా ఒక వెబ్‌ సైట్‌ ను ఏర్పాటుచేస్తుంది. విదేశాల్లో ఉంటూ కోర్టు సమన్లకు సమాధానమివ్వని ఎన్‌ ఆర్‌ ఐ భర్తల కోర్టు సమన్లను ఇందులో ఉంచుతారు. ఒక్కసారి ఈ వెబ్‌ సైట్‌ లో నోటీసులను ఉంచితే సదరు ఎన్‌ ఆర్‌ ఐ భర్తలకు సమన్లు అందినట్టుగానే ప్రభుత్వం పరిగణిస్తుంది. వీటికి సమాధానం ఇవ్వనివారిపై చర్యల్ని ప్రారంభిస్తుంది. సమన్లను పట్టించుకోని వారి పాస్‌ పోర్టులను ప్రభుత్వం రద్దుచేస్తుంది.

ఇదిలాఉండ‌గా....దేశంలో జరిగే అన్ని ఎన్‌ ఆర్‌ ఐ వివాహాలను పెళ్లయిన ఏడు రోజుల్లోగా నమోదు(రిజిస్టర్‌) చేయాలని - లేదంటే పాస్‌ పోర్టు - వీసాలను జారీచేసే ప్రసక్తేలేదని కేంద్ర మహిళా - శిశుసంక్షేమశాఖ మంత్రి మేనకాగాంధీ స్పష్టంచేశారు. తొలుత రిజిస్ట్రేషన్‌ గడువును 48 గంటల వరకే విధించగా - మంత్రుల బృందం సూచనతో దీన్ని ఏడు రోజులకు పెంచారు. ఎన్‌ ఆర్‌ ఐ భర్తల ఆగడాల్ని అరికట్టేందుకు క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌(సీఆర్‌ పీసీ) - వివాహ నమోదు చట్టం - పాస్‌ పోర్టు చట్టానికి సవరణలు చేయాలని కేంద్రం భావిస్తోంది.