Begin typing your search above and press return to search.

ఏపీలో బాబు చెప్పిందే.. టీ డీజీపీ చెప్పారే

By:  Tupaki Desk   |   22 Feb 2017 4:39 AM GMT
ఏపీలో బాబు చెప్పిందే.. టీ డీజీపీ చెప్పారే
X
కేవలం రోజులు మాత్రమే తేడా. కచ్చితంగా చెప్పాలంటే నెల రోజులకు నాలుగు రోజులు తక్కువంతే. ఒకే సీన్. ఒకేలాంటి భావోద్వేగం. ఒకేలాంటి రియాక్షన్. రెండు తెలుగు రాష్ట్రాల్లో చోటు చేసుకున్న పరిణామాలు చూసినప్పుడు పేరుకు తగ్గట్లే.. ఇద్దరు చంద్రుళ్ల కొన్ని అంశాల విషయంలో ఒకేలా వ్యవహరిస్తారని ఇప్పుడు తేలిపోయింది. ప్రత్యేక హోదా మీద నిరసన జనవరి 26న విశాఖలోని ఆర్కే బీచ్ దగ్గర శాంతియుత ప్రదర్శన చేపట్టాలని.. మౌనదీక్ష నిర్వహించాలని భావించారు. ఇందుకు తగ్గట్లే సోషల్ మీడియాలో భారీ ఎత్తున ప్రచారం సాగింది.

ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయానికి తగ్గట్లుగా హోదా ఇష్యూను క్రమపద్ధతిలో కట్ చేస్తున్న ఏపీ సర్కారు.. ఉద్యమ రూపంలో ముంచుకొస్తున్న ఉపద్రవాన్ని మొదట్లోనే కట్ చేసేందుకు వీలుగా.. ఎన్ని రకాలుగా అణిచేయాలో అన్ని పద్ధతుల్నివినియోగించారని చెప్పాలి. చివరకు కాలేజీ విద్యార్థులకు.. యాజమాన్యాల నుంచి విద్యార్థుల తల్లిదండ్రులకు స్వయంగా లేఖలు రాయించటమే కాదు..విద్యార్థులు ఉద్యమాల పేరుతో నిరసనలకు దిగి కెరీర్ చెడగొట్టుకోవద్దంటూ ఏపీ సీఎం స్వయంగా చెప్పటం తెలిసిందే.

హోదా విషయంలోనూ.. విశాఖ మౌనదీక్ష అంశంలోనూ ఏపీ సర్కారు అనుసరించిన వైఖరి ప్రజల్లో తీవ్ర అసంతృప్తిని మిగిల్చింది. ప్రతి విషయానికి గమ్ముగా ఉండే ఏపీ ప్రజలు.. బాబు నిర్ణయాన్ని.. విశాఖ మౌనదీక్ష సందర్భంగా ఏం చేశారన్నది భద్రంగా తమ గుండెల్లో రిజిష్టర్ చేసుకున్నారు ఆంధ్రోళ్లు. తాజాగా నిరుద్యోగ నిరసన ర్యాలీని అడ్డుకునే విషయంలోనూ కేసీఆర్ సర్కారు ఇదే విధానాన్ని అమలు చేయటం గమనార్హం.

హోదాపై ఆర్కే బీచ్ ఆందోళన ముందు రోజున విశాఖకు వచ్చే వాహనాల్ని తనిఖీ చేయటం.. అనుమానం ఉన్న వారిని ముందస్తుగా అదుపులోకి తీసుకోవటం లాంటివి తెలంగాణలోనూ చోటు చేసుకోవటం గమనార్హం. అంతేకాదు.. నిరసన ర్యాలీకి ప్రభుత్వ అనుమతి లేదని.. పిల్లల్ని పంపొద్దంటూ తెలంగాణ డీజీపీ స్పష్టం చేశారు.

అంతేనా.. ర్యాలీలో పాల్గొనే వారిపైన చట్టప్రకారం కేసులు నమోదు చేయనున్నట్లు సెంట్రల్ డీజీపీ జోయల్ డేవిస్ హెచ్చరించారు. కేవలం మాటలకే పరిమితం కాకుండా.. చేతల్లో కూడా చూపించేసిన తెలంగాణ పోలీసులు మంగళవారం ఉదయం నుంచే పలువురిని అదుపులోకి తీసుకోవటం.. హైదరాబాద్ ర్యాలీకి వెళుతున్నారన్న అనుమానం వస్తే చాలు.. వారిని అరెస్ట్ చేసేయటం గమనార్హం. మొత్తంగా చూస్తే.. ఉద్యమ గళాన్ని ఇద్దరు చంద్రుళ్లు ఎలాంటి కనికరం లేకుండా నొక్కేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/