Begin typing your search above and press return to search.

'గరుడ' శివాజీని విచారించనున్న ఎన్ ఐఏ

By:  Tupaki Desk   |   17 Jan 2019 5:41 AM GMT
గరుడ శివాజీని విచారించనున్న ఎన్ ఐఏ
X
ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై గత అక్టోబర్ 25న విశాఖపట్నం ఎయిర్ పోర్టులో జరిగిన హత్యాయత్నంపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ ఐఏ) దర్యాప్తును వేగవంతం చేసింది. ఏ చిన్న లూప్ హోల్ ను వదలకుండా అన్నీ విచారించాలని అధికారులు నిర్ణయించారు. ఇటీవలే జగన్ పై దాడి చేసిన నిందితుడు శ్రీనివాసరావును కస్టడీకి తీసుకున్న ఎన్ఐఏ అధికారులు జగన్ పై దాడికి గల కారణాలు.. వెనుక ఎవరున్నారనే దానిపై గంటలు గంటలు విచారణ కొనసాగిస్తున్నారు.

ఇక నిందితుడు శ్రీనివాస్ జగన్ పై దాడి చేయడానికి ముందు ఆయన పనిచేస్తున్న ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్ లోకి కోడికత్తిని ఎలా తీసుకొచ్చాడు. ఎక్కడ దాచాడు.? ఎవరు సహకరించారనే దానిపై కూడా అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈ కోవలోనే ఫ్యూజన్ ఫుడ్ రెస్టారెంట్ యజమాని అయిన హర్షకుమార్ ను కూడా ఎన్ఐఏ అధికారులు ప్రశ్నించారు. వారి స్టేట్ మెంట్లను రికార్డు చేశారు.

ఇక ఈ కుట్ర గురించి ముందే తనకు తెలుసు అంటూ ‘ఆపరేషన్ గరుడ’ పేరు హల్ చల్ చేసిన సినీ నటుడు, రాజకీయ నాయకుడు శివాజీ ని కూడా విచారించడానికి ఎన్ఐఏ అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఏపీ ప్రతిపక్ష నాయకుడిపై దాడి చేయించి.. ఆంధ్రప్రదేశ్ ను అల్లకల్లోలం చేయబోతున్నారని.. సీఎం చంద్రబాబును గద్దెదించడమే ధ్యేయంగా ఈ కుట్రకు తెరతీశారని శివాజీ అప్పట్లో సంచలన విషయాలు చెప్పాడు. సీఎం చంద్రబాబుకు మద్దతుగా మాట్లాడారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు ఈ నిజాలు ఎలా తెలుసు.? ఎవరు చెప్పారనే దానిపై పోలీసులు ఆరాతీయనున్నారు. శివాజీ వ్యాఖ్యలు అచ్చుగుద్దినట్టే తదనంతరం అలానే సంఘటనలు చోటుచేసుకోవడంతో ఈ కేసులో ఆయన సాక్ష్యం కీలకంగా మారింది.

ఇలా అన్నీ కోణాల్లో దర్యాప్తు చేస్తున్న ఎన్ ఐఏ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై దాడి వెనుక గల సూత్రధారులను పట్టుకునే ప్రయత్నంలో బిజీగా ముందుకుసాగుతోంది.