Begin typing your search above and press return to search.

హైద‌రాబాద్ మేయ‌ర్.. టీఆర్ ఎస్ అభ్య‌ర్థి ఖ‌రారు?

By:  Tupaki Desk   |   30 July 2015 7:49 AM GMT
హైద‌రాబాద్ మేయ‌ర్.. టీఆర్ ఎస్ అభ్య‌ర్థి ఖ‌రారు?
X
గ్రేట‌ర్ హైదరాబాద్ ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల కాన‌ప్ప‌టికీ...అన్నిపార్టీలు ఆ పోరు లక్ష్యంగా సాగుతున్న సంగ‌తి తెలిసిందే. కాంగ్రెస్ ఇప్ప‌టికే తన క‌మిటీల‌తో ముందుకు వెళుతుండ‌గా...బీజేపీ, టీడీపీలు సైతం క‌య్యానికి కాళ్లు దువ్వుతున్నాయి. అధికార టీఆర్ ఎస్ పార్టీ సైతం త‌నదైన శైలిలో గ్రేట‌ర్‌ కు నిధులు, ప‌నులు అంటూ హ‌డావుడి చేస్తోంది. మ‌రోవైపు మేయర్ అభ్యర్థిత్వంపై టీఆర్ ఎస్ ఓ అంచనాకు వచ్చినట్లు సమాచారం.

మెదక్ జిల్లాకు చెందిన టీడీపీ మాజీ అధ్య‌క్షుడు ప్ర‌స్తుత టీఆర్ ఎస్ గ్రేట‌ర్ అధ్యక్షుడు మైనంపల్లి హన్మంతరావు పేరును మేయ‌ర్ అభ్య‌ర్థిత్వానికి ఖరారు చేసినట్లు తెలుస్తోంది. గ‌త ఎన్నిక‌ల్లో ఆయ‌న మల్కాజ్ గిరి ఎంపీ స్థానానికి టీఆర్ఎస్ తరపున పోటీ చేసి ఓడిపోయిన సంగ‌తి తెలిసిందే. ఇప్పటికే గ్రేటర్ అధ్యక్షునిగా ఉన్న హన్మంతరావునే మేయర్ అభ్యర్థిగా రంగంలోకి దించాలని ప్రయత్నిస్తోంది. టీడీపీ కార్యకర్తలతో సంబంధాలు కలిగి ఉండటం, అలాగే సీఎం త‌న‌యుడు కేటీఆర్‌ కు తక్కువకాలంలోనే నమ్మకమైన వ్యక్తిగా మారడం వంటివి హన్మంతరావుకు కలిసి వచ్చిన అంశాలుగా పార్టీ వర్గాలు చెప్తున్నాయి.

కార్యకర్తలు, నేతలతో మమేకం అవుతున్న తీరు, నియోజకవర్గాల్లో ఉన్న వర్గాలన్నింటిని ఏకం చేయడం, కార్యక్రమాలు చేయడం, ప్రభుత్వ పథకాలు విస్తృతంగా ప్రచారం చేయించడం లాంటి బాధ్యతను తన భుజస్కందాలపై వేసుకున్న తీరు అధిష్టానం ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంది.

అయితే హన్మంతరావు అభ్యర్థిత్వంపై అందరిలో ఏకాభిప్రాయం సాధ్య‌మా అనే సందేహాం వ‌స్తోంది. టీఆర్ ఎస్ సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్ కేకే కూతురు సైతం ఇదే ప‌దవిపై క‌న్నేసిన విష‌యం తెలిసిందే. మ‌రోవైపు మాజీ మేయ‌ర్ తీగ‌ల కృష్ణారెడ్డి త‌న‌యుడు సైతం ఈ పీఠంపై క‌న్నేశారు. తాజా వార్త‌ల నేప‌థ్యంలో అసంతృప్తుల ఏ విధంగా తెర‌మీద‌కు వ‌స్తారో చూడాలి మ‌రి.