కేసీఆర్ క్లోజ్ ఫ్రెండ్ భారీ ప్రాజెక్టు?

Mon Mar 20 2017 12:24:18 GMT+0530 (IST)

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ క్లోజ్ ఫ్రెండ్ భారీ నిర్మాణం ఒకటి చేపట్టనున్నట్లుగా తాజాగా వార్తలు వినిపిస్తున్నాయి. తనకు అత్యంత సన్నిహితుడైన రియల్ ఎస్టేట్ వ్యాపారి మైహోం రామేశ్వరరావు తాజాగా భారీ నిర్మాణాన్ని నిర్మించే దిశగా ప్రయత్నాలు ముమ్మురం చేసినట్లుగా చెబుతున్నారు. దాదాపు రూ.650 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టు దేశంలోనే అత్యంత పొడవైన కమర్షియల్ స్పేస్ గా పేరు ప్రఖ్యాతులు సొంతం చేసుకోనున్నట్లుగా తెలుస్తోంది.

హైదరాబాద్ లో అత్యంత విలువైన మాదాపూర్ లో నిర్మించే ఈ ప్రాజెక్టులో భాగంగా 21 అంతస్థులతో కూడి అతి పొడవైన వాణిజ్య భవనాన్ని నిర్మించనున్నట్లుగా చెబుతున్నారు. ఇందుకోసం బెంగళూరుకు చెందిన అతి పెద్దదైన రియల్ ఎస్టేట్ కంపెనీ ఆర్ ఎంజీతో మైహోం గ్రూప్ జత కట్టనున్నట్లుగా చెబుతున్నారు. స్కైవ్యూ పేరిట నిర్మించే ఈ వాణిజ్య బహుళ అంతస్థుల నిర్మాణంలో దాదాపు కోటి చదరపు అడుగుల మేర ఉంటుందని సమాచారం. ఈ భారీ భవనంలో పలు బడా కంపెనీలు ఉంటాయని తెలుస్తోంది. భాగ్యనగరానికి ఈ భవనం ఒక మణిపూసగా మారటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని.. ఈ భవనాన్ని మైహోం రామేశ్వరరావు నిర్మిస్తున్నారని.. ఇందుకు సంబంధించిన కీలక చర్యలు దాదాపుగా పూర్తి అయినట్లుగా చెబుతున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని వివరాలు బయటకు రానున్నట్లు చెబుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/