Begin typing your search above and press return to search.

అనుకోని నిలదీత..అవాక్కైన ఫిరాయింపు ఎమ్మెల్యే!

By:  Tupaki Desk   |   26 Sep 2017 3:56 AM GMT
అనుకోని నిలదీత..అవాక్కైన ఫిరాయింపు ఎమ్మెల్యే!
X
మరి రాజకీయంగా ఫిరాయింపుకు పాల్పడి.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా.. అనైతిక చర్యకు పాల్పడి.. తమ రాజకీయాన్ని తామెంతగా సమర్థించుకున్నా, ఫిరాయింపు ఎమ్మెల్యేలకు కొన్ని నిలదీతలు తప్పడం లేదు. పార్టీ మారిన అనైతిక చర్యను సమర్థించుకోవడానికి ఫిరాయింపుదారులు చాలా మాటలే చెబుతారు. తాము డెవలప్ మెంట్ కోసం పార్టీ మారామని..కామన్ డైలాగ్ చెబుతూ ఉంటారు. డెవలప్ మెంట్ అనే మాటను ఉపయోగించేస్తే.. ఇక ఎవరూ ఏమనలేరనేది వీరి కాన్ఫిడెన్స్. మరి ఆ డెవలప్ మెంట్ మాటను కూడా అడ్డంగా వాడేస్తూ ఉంటే.. ఒక్కోసారి గట్టి నిలదీతలు ఎదురవుతూ ఉంటాయి. అలాంటి నిలదీతే గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డికి ఎదురైంది.

గత సార్వత్రిక ఎన్నికల్లో ఈయన వైకాపా తరఫున ఎమ్మెల్యేగా నెగ్గిన సంగతి తెలిసిందే. అయితే తెలుగుదేశంలోకి ఫిరాయించాడు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలేదు. పార్టీ మారేసి.. డెవలప్ మెంట్ అని మాట్లాడుతూ.. బండి లాగించేస్తూ ఉన్నాడు. ఇప్పుడు పక్కా తెలుగుదేశం నేత అయిపోయాడు. ఈ నేపథ్యంలో ఇంటింటికీ తెలుగుదేశం పార్టీ.. కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలో పర్యటిస్తున్నాడు.

మరి ఇలాంటి సమయంలో.. ఈయనకు ఒక గట్టి ఝలక్ తగిలింది. అది గిద్దలూరు నియోజకవర్గ పరిధిలోని రాచర్ల మండలం అనుమల పల్లె. ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం కోసం అశోక్ రెడ్డి అక్కడకు వెళ్లాడు. కార్యక్రమం బాగానే జరుగుతున్నట్టుగా అనిపించింది కానీ, అంతలోనే ఒక కార్యకర్త ఎదురై అశోక్ రెడ్డికి షాకిచ్చాడు. తెలుగుదేశం పార్టీ అభిమాని - తెలుగుదేశం కార్యకర్త అతడు. కానీ డెవలప్ మెంట్ విషయంలో నిలదీశాడు.

‘పార్టీ ఫిరాయించింది - డెవలప్ మెంట్ కోసమే అన్నారు కదా.. ఏదీ డెవలప్ మెంట్?’ అని ఆ కార్యకర్త అడిగాడు. ‘పార్టీ మారి మీరు బాగుపడ్డారు.. కానీ ప్రజలకు ఏం చేశారు? మా ఊరికి ఏం చేశారు? పార్టీ మారింది డెవలప్ మెంట్ కోసమే అంటున్నారు కదా - ఇన్నాళ్లలో మీరేం చేశారు?’ అని అతడు అడిగాడు. తెలుగుదేశం పార్టీ అభిమానే అలా నిలదీసే సరికి.. అవాక్కయ్యాడు. అసలు అశోక్ రెడ్డి వద్ద సమాధానమే లేకపోవడం గమనార్హం. కార్యకర్త అలా దీసినా అశోక్ రెడ్డి మారు మాట్లాడకుండా వెళ్లిపోయారు.

ఇక పోలీసులు జోక్యం చేసుకుని, ఆ కార్యకర్తను పక్కకు తీసుకెళ్లి సముదాయించారు. ఈ తెలుగుదేశం పార్టీ ఇంటింటి కార్యక్రమంలో అశోక్ రెడ్డికి నిలదీత ఇది తొలిసారి కాదు. పలు సార్లు ఇలాగే జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన ఇంటింటికీ వెళ్లే ధైర్యం కూడా చేయలేకపోతున్నాడని తెలుస్తోంది. ఊరికే పాంప్లేట్లు ఇచ్చి పంపించి - ఇంటింటీకీ పంపుతున్నాడట ఈ ఫిరాయింపు నేత.