Begin typing your search above and press return to search.

జ‌న‌సేన‌లోకి ఆ మీడియా అధిప‌తి

By:  Tupaki Desk   |   18 Aug 2018 12:34 PM GMT
జ‌న‌సేన‌లోకి ఆ మీడియా అధిప‌తి
X

జ‌న‌సేన పార్టీ అధినేత - సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ గ‌త కొద్దికాలంగా చ‌ర్చ‌ల్లో ఉంచిన అంశానికి తెర‌ప‌డింది. వార్త‌ల్లో నిలుస్తున్న లాంచ‌నం పూర్త‌య్యింది. కాకినాడ‌కు చెందిన మాజీమంత్రి ముత్తా గోపాల‌కృష్ణ జ‌న‌సేన‌లో చేరారు. మాదాపూర్‌ లోని జనసేన పార్టీ కార్యాలయంలో ప‌వ‌న్ సమక్షంలో మాజీ మంత్రి - ప్రముఖ పారిశ్రామికవేత్త ముత్తా గోపాలకృష్ణ - ఆయన పెద్ద కుమారుడు శశిధర్ పార్టీలో చేరారు. జనసేనలో చేరిన వాళ్ళలో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే అనిశెట్టి బుళ్లబ్బాయి రెడ్డి - వైసీపీ రాష్ట్ర కార్యదర్శి సంగిశెట్టి అశోక్ - టీడీపీ నుంచి మాకినేడి శేషు కుమారి ఉన్నారు. ఈ చేరిక‌ సంద‌ర్భంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాట్లాడుతూ ముత్తా గోపాలకృష్ణ గారిని మనస్పూర్తిగా జనసేన పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. పెద్దలు - అనుభవజ్ఞులు పార్టీకి అవసరమ‌ని - ముత్తా గోపాలకృష్ణ జనసేనలోకి రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. ముత్తా గోపాలకృష్ణ పై త‌నకు అపార నమ్మకం ఉంది... ఆయనకి పొలిటికల్ అఫైర్స్ కమిటీలో స్థానం కల్పిస్తున్నాన‌ని తెలిపారు. రాబోయేతరం వారికి ముత్తా గోపాలకృష్ణ గారి అనుభవం ఎంతో పనికి వస్తుందన్నారు. విలువలతో ఉన్న పత్రికను ఆయన నడిపిస్తున్నారని, త‌న‌పైన నమ్మకం, విశ్వాసం ఉండి జనసేనలోకి వచ్చిన ముత్తా గోపాలకృష్ణ, శశిధర్ గారికి నా హృదయ పూర్వక అభినందనలని అన్నారు.

కాగా, ఆంధ్ర‌ప్రభ పేరుతో ఓ దిన‌ప‌త్రిక‌ను నిర్వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఆయ‌న‌ కుమారుడు గౌత‌మ్ ఇటీవ‌ల జాతీయ మీడియా రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. గౌత‌మ్ ఆధ్వ‌ర్యంలో ఇండియా అహేడ్ ఇంగ్లీష్ న్యూస్ ఛాన‌ల్ ప్రారంభం అయింది. ఈ చాన‌ల్ త‌ర‌ఫున ప‌వ‌న్‌ కు ప్ర‌చారం క‌ల్పించేందుకు వారు సిద్ధ‌మ‌య్యారు. ఇటీవ‌ల‌ ఆదివారం మాదాపూర్‌ లోని జ‌న‌సేన కార్యాల‌యాన్ని ముత్తా త‌న కుమారుల‌తో సంద‌ర్శించి ప‌వ‌న్‌ తో భేటీ అయ్యారు. త‌మ చాన‌ల్‌ లో ఒక కార్య‌క్ర‌మాన్ని ప‌వ‌న్ క‌ల్యాణ్ హోస్ట్‌ గా రూప‌క‌ల్ప‌న చేశామ‌ని - ఆ కార్య‌క్ర‌మంలో చేయ‌డానికి అంగీక‌రించాల్సిందిగా వారు ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను కోరారు. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను వెలుగులోకి తెచ్చే ఈ టీవీ షోను చేయ‌డానికి ప‌వ‌న్ కల్యాణ్ అంగీకారం తెలిపారని జ‌న‌సేన తెలిపింది. అదే విధంగా ముత్తా గోపాల కృష్ణ జ‌న‌సేనలోకి రావాల్సిందిగా ప‌న‌న్ క‌ల్యాణ్ చేసిన కోర‌గా అందుకు ఆయ‌న స‌మ్మ‌తించారు.

కాగా, ఆ భేటీలోనే జ‌న‌సేన‌లో కీల‌క స్థానం క‌ల్పించేందుకు ప‌వ‌న్ హామీ ఇచ్చారు. పార్టీ పొలిటిక‌ల్ అఫైర్స్ క‌మిటీలో ముత్తా గోపాల‌కృష్ణ‌కు స్థానం క‌ల్పిస్తామ‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పారు. ఆయ‌న త‌న పెద్ద కుమారుడు శ‌శిధ‌ర్‌తో క‌లిసి కొద్ది రోజుల్లోపార్టీలో చేర‌నున్నారు. దీంతో తెలుగులో ఓ ప్ర‌ధాన ప‌త్రిక, జాతీయ మీడియాలో ఓ కీల‌క టీవీ చాన‌ల్ ప‌వ‌న్‌కు అండ‌గా నిలిచేందుకు సిద్ద‌మైన‌ట్లేన‌నే చ‌ర్చ తెర‌మీద‌కు వ‌చ్చింది. ఇప్పుడది నిజ‌మైంది.