Begin typing your search above and press return to search.

మ‌ళ్లీ అయోధ్య రాముడ్ని వాడ‌టం మొద‌లెట్టేశారు!

By:  Tupaki Desk   |   22 Oct 2018 5:59 AM GMT
మ‌ళ్లీ అయోధ్య రాముడ్ని వాడ‌టం మొద‌లెట్టేశారు!
X
వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేయ‌టం మోడీ మంత్రుల‌కు అల‌వాటే. తాజాగా అదే తీరులో నోరు పారేసుకున్నారు మ‌రో మంత్రి గిరిరాజ్ సింగ్‌. తాజాగా ఆయ‌న అయోధ్య రామాల‌యం ఇష్యూలో ముస్లింల‌ను ఉద్దేశించి ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగానూ.. వివాదాస్ప‌దంగానూ మారాయి.

అయోధ్య‌లో రామాల‌య నిర్మాణానికి ముస్లింలు కానీ మద్ద‌తు ఇవ్వ‌కుంటే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంద‌ని ఆయ‌న పేర్కొన్నారు. ముస్లింలు అంతా ముందుకు వ‌చ్చి రామ‌మందిర నిర్మాణానికి స‌హ‌కరించాల్సిందిగా ఆయ‌న వ్యాఖ్యానించ‌టంపై అభ్యంత‌రం వ్య‌క్త‌మ‌వుతోంది. కేంద్ర‌మంత్రి హోదాలో ఉండి.. అన్ని వ‌ర్గాల ప‌ట్ల స‌మాన బాధ్య‌త‌తో వ్య‌వ‌హ‌రించాల్సింది పోయి.. అందుకు భిన్నంగా ఒక వ‌ర్గానికి మ‌ద్దతుగా వాద‌న‌లు వినిపించ‌టం ఏ మాత్రం స‌రికాద‌న్న వాద‌న వినిపిస్తోంది.

ఇంత‌కీ మంత్రి చేసిన వ్యాఖ్య‌ల్ని చూస్తే.. "ముస్లింలు రాముడి వార‌సులు. వారు మొగ‌ల్స్ వార‌సులు కాదు. అందుకే వారు అయోధ్య‌లో రామమందిరం నిర్మాణానికి మ‌ద్ద‌తు ఇవ్వాలి. రామాల‌యం కోసం ముస్లింలు మ‌ద్ద‌తు ఇవ్వ‌కుంటే వారు హిందువుల ద్వేషాన్ని చూడాల్సి వ‌స్తోంద‌న్న విష‌యం వారికి బాగా తెలుసు" అంటూ వ్యాఖ్యానించారు.

కేంద్ర చిన్న‌.. మ‌ధ్య త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌ల శాఖామంత్రిగా వ్య‌వ‌హ‌రిస్తున్న ఆయ‌న బాగ్ ప‌ట్ ప‌ట్ట‌ణంలో జ‌రిగిన విలేక‌రుల స‌మావేశంలో ఈ త‌ర‌హా వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌స్తుతం రామ‌మందిర నిర్మాణ అంశం కేన్స‌ర్ రెండో ద‌శ‌లో మాదిరి ఉంద‌ని.. ఇప్పుడు చికిత్స చేయ‌కుంటే భ‌విష్య‌త్తులో ఈ స‌మ‌స్య ప‌రిష్కారం కాద‌న్నారు.

ముస్లింలు అంతా ముందుకు వ‌చ్చి రామందిర నిర్మాణానికి స‌హ‌క‌రించాల్సిందిగా మంత్రి కోరారు. ఎక్కువ‌మంది పిల్ల‌ల్ని క‌న‌కుండా చ‌ట్టం తీసుకురావాల్సిన అవ‌స‌రం ఉంద‌న్న మాట‌తో పాటు.. అధిక సంతానం క‌ల‌గ‌కుండా ఉండే విష‌యంలో వ్య‌తిరేకించే వారి ఓటుహ‌క్కును ర‌ద్దు చేయాల‌న్న వ్యాఖ్య‌ను చేశారు. భావోద్వేగాల‌కు సంబంధించిన అంశాల‌ను బాధ్య‌తాయుతంగా కాకుండా సంచ‌ల‌నాల‌కుకేంద్రంగా ఉండేలా మాట్లాడ‌టం మంచిది కాద‌న్న విష‌యాన్ని ప్ర‌ధాని త‌న మంత్రికి చెబితే బాగుంటుంది. నీతులు చెప్పే ప్ర‌ధాని.. త‌న మంత్రుల‌కు.. పార్టీ నేత‌ల‌కు చెప్ప‌క‌పోవ‌టం ఏమిటి?

ఇదంతా ఒకెత్తు అయితే... బీజేపీకి రామ మందిరం క‌ట్టే ఉద్దేశం లేదు. ఒక‌వేళ అలాంటి ఉద్దేశం ఉంటే... ఈపాటికి ఎపుడో క‌ట్టేసేది. ఇపుడు కూడా కేవ‌లం తాము ఎంత‌క‌యినా తెగిస్తాం అని జ‌నాల‌ను భ్ర‌మింప‌జేయ‌డం త‌ప్ప బీజేపీ రామమందిరం క‌ట్టే సాహసం చేయ‌దు. అది బీజేపీ హ‌యాంలో ఎన్న‌టికీ జ‌ర‌గ‌దు అని కొంద‌రు విశ్లేష‌కుల మాట‌.