Begin typing your search above and press return to search.

ప్ర‌తి హిందువు.. ముస్లిం చ‌ద‌వాల్సిన క‌థ‌న‌మిది

By:  Tupaki Desk   |   27 April 2017 5:36 AM GMT
ప్ర‌తి హిందువు.. ముస్లిం చ‌ద‌వాల్సిన క‌థ‌న‌మిది
X
భిన్న‌త్వంలో ఏక‌త్వం అంటూ చెప్పే మాట‌ల‌కు.. క‌ళ్ల ఎదుట క‌నిపించే అంశాల‌కు మ‌ధ్య‌న పొంత‌న క‌నిపించ‌ద‌న్న‌ది భార‌త్‌ లోని ప‌లువురు ప్ర‌జ‌ల అభిప్రాయం. జ‌నాల‌కు రాజ‌కీయ రంగుట‌ద్దాలు త‌గిలించే వారి పుణ్య‌మా అని.. విల‌క్ష‌ణ‌మైన భార‌తీయ‌తత్త్వం అంత తేలిగ్గా క‌నిపించ‌ని వైనంగా మారింది. క‌ళ్లను విప్పి చూస్తే.. భార‌త్ లో క‌నిపించే దృశ్యాలు ప్ర‌పంచంలో మ‌రెక్క‌డా క‌నిపించ‌వ‌న్న వాద‌న‌కు తాజా ఉదంతం ఊతం ఇస్తుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

దేశంలో.. హిందువులు.. ముస్లింల మ‌ధ్య భ‌యంక‌ర‌మైన త‌గాదాలేమీ లేన‌ప్ప‌టికీ.. అలా అని స‌హృద్భావ వాతావ‌ర‌ణం లేద‌నే చెప్పాలి. దీనికి దేశ రాజ‌కీయాలు.. రాజ‌కీయ పార్టీలే కార‌ణ‌మ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఓటు బ్యాంకు రాజ‌కీయాల కార‌ణంగా.. అంద‌రిని ఒక‌టిగా చూడాల్సిన పార్టీలు.. ఓట్ల‌ను దండుకోవ‌టానికి వీలుగా ఫార్ములాలు సిద్ధం చేసిన దుర్మార్గంతో ప్ర‌జ‌ల మ‌ధ్య కంటికి క‌నిపించ‌ని విభ‌జ‌న రేఖ ఒక‌టి ఏర్ప‌డిన దుస్థితి. లేనిపోని అపోహ‌ల‌తో ప్ర‌జ‌ల మ‌ధ్య పెరిగిన దూరాల్ని.. తాజాగా చెప్పే ఉదంతాలు కొన్ని త‌గ్గించేస్తాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. మ‌తాల‌కు.. కులాల‌కు అతీత‌మైన జీవ‌న విధానం భార‌తీయుల్లో ఉంద‌న్న స‌త్యాన్ని చెప్పే ఈ ఉదంతంలోకి వెళితే..

ప‌శ్చిమ‌బెంగాల్ లోని మాల్దా జిల్లాలోని షేక్ పురా లో జ‌నాభా ఆరువేల మంది. ఈ గ్రామంలో రెండే రెండు కుటుంబాలు మిన‌హా మిగిలిన‌వ‌న్నీ ముస్లిం కుటుంబాలే. రెండు కుటుంబాలు హిందువుల‌వి కాగా.. తాజాగా ఒక హిందూ కుటుంబానికి చెందిన 35 ఏళ్ల బివ్వ‌జిత్ ర‌జ‌క్ కాలేయ క్యాన్స‌ర్ తో మ‌ర‌ణించారు. నిరుపేద కుటుంబానికి చెందిన ర‌జ‌క్ మ‌ర‌ణించ‌టంతో.. ఆయ‌న అంతిమ సంస్కారాల‌కు సైతం డ‌బ్బుల్లేని దుస్థితి ఆ కుటుంబానిది. కానీ.. అక్క‌డి ముస్లింలు.. ఆ లోటు తెలీకుండా చేసేందుకు ర‌జ‌క్ అంతిమ‌సంస్కారాల బాధ్య‌త‌ను తాము పంచుకున్నారు.

ర‌జ‌క్ తండ్రి అభ్య‌ర్థ‌న‌తో ముందుకొచ్చిన గ్రామ‌స్తులు.. గ్రామానికి 35 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న శ్శ‌శాన వాటిక‌కు ర‌జక్ మృత‌దేహాన్ని మోసుకెళ్ల‌ట‌మేకాదు.. ఆ సంద‌ర్భంగా హిందూ సంప్ర‌దాయం ప్ర‌కారం హ‌రి నామాన్ని ప‌ఠించారు.
అంతేనా.. అంత్య‌క్రియ‌ల్ని పూర్తిగా హిందూ మ‌తాచారం ప్ర‌కారం చేయించ‌ట‌మే కాదు.. అనంత‌రం ఆస్తిక‌ల్ని ద‌గ్గ‌ర్లోని న‌దిలో క‌లిపే కార్య‌క్ర‌మాన్ని పూర్తి చేశారు. ఈ మొత్తానికి అయ్యే ఖ‌ర్చును గ్రామంలోని ముస్లింలు భ‌రించారు. నిత్యం హిందూ.. ముస్లిం అంటూ వేర్వేరుగా చూసే వారికి.. ఇలాంటి ఉదంతాల త‌ర్వాత అయినా.. మ‌తం కంటే మాన‌వ‌త్వం ముఖ్య‌మ‌ని.. దాన్ని పెంచితే స‌మాజంలోని భేదాభిప్రాయాలు తొలిగి.. స‌మిష్టి భార‌తత‌త్త్వం ఆవిష్కృతం అవుతుంద‌న్న విష‌యాన్ని ఎప్ప‌టికి గుర్తిస్తారో?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/