Begin typing your search above and press return to search.

మరో సీనియర్‌ నేతకు బీజేపీ షాక్

By:  Tupaki Desk   |   26 March 2019 9:49 AM GMT
మరో సీనియర్‌ నేతకు బీజేపీ షాక్
X
భారతీయ జనతాపార్టీలో అలకలు మొదలయ్యాయి. మోడీ ప్రభంజనంతో ఇప్పటికే సీనియర్లు గుస్సాగా ఉన్న విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో ప్రాధాన్యత దక్కని వీరికి ఈసారి కూడా అవమానాలు ఎదురయ్యాయి. బీజేపీ వ్యవస్థాపకుల్లో ఒకరైన అడ్వానీకి ఈ ఎన్నిల్లో టికెట్‌ కేటాయించని విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో గాంధీనగర్‌ నుంచి పోటీ చేసిన ఆయనకు మోడీ ఈసారి సీటు కేటాయించలేదు. తాజాగా సీనియర్‌ నేతల్లో మరొకరైన మురళీమనోహర్‌ జోషీకి సైతం తాను పోటీ చేసే అవకాశం లేదన్నట్లు లేఖ ద్వారా తెలపడం చర్చనీయాంశంగా మారింది.

గత ఎన్నికల్లో బీజేపీ పట్టున్న వారణాసి స్థానాన్ని మురళీమనోహర్‌ జోషి ప్రధాని మోడీ కోసం త్యాగం చేశారు. దీంతో ఆయనకు కాన్పూర్‌ స్థానాన్ని కేటాయించారు. అక్కడ ఆయన భారీ విజయం సాధించారు. ఈసారి కాన్పూర్‌ టికెట్‌ కూడా ఇవ్వడం లేదని చెప్పారు. బీజేపీ ప్రధాని కార్యదర్శి రాంలాల్‌ ద్వారా ఆయనకు సమాచారం అందించారు. ఈ వ్యవహారంతో జోషి తీవ్రంగా మనస్థాపం చెందినట్లు తెలుస్తోంది.

పార్టీకి సీనియర్‌ నేత అయిన తనకు పోటీ చేయవద్దంటూ లేఖ ద్వారా తెలపడం ఆయన అవమానంగా భావించారు. కనీసం అమిత్‌ షా వచ్చి చెబితే బాగుండునని ఆయన అనుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో జోషి మనస్తాపంతో ఓ లేఖను ప్రజలకు పంపారు. 'నియోజకవర్గ ప్రజల్లారా నేను ఎక్కడి నుంచి పోటీ చేయడం లేదు. ఈ ఎన్నికల్లో నన్ను ఎక్కడా పోటీ చేయవద్దని పార్టీ ఆదేశించింది. ఈ విషయాన్ని రాంలాల్‌ ద్వారా లేఖలో పంపింది' అని బహిరంగ లేఖ రాశారు.

అటు కుర వృద్ధుడు, పార్టీ సీనియర్‌ నేత ఎల్‌ కే అడ్వానీకి కూడా టికెట్‌ నిరాకరించింది మోడీ పార్టీ. ఆయన పోటీ చేసే గాంధీనగర్‌ లో అమిత్‌ షా పోటీ చేయనున్నారు. గాంధీనగర్‌ నుంచి ఎల్‌ కే అడ్వాని ఆరుసార్లు ఎంపీగా గెలిచారు. 1996లో వాజ్‌ పేయి కూడా ఇక్కడి నుంచే గెలుపొందడంతో ఈ నియోజకవర్గం బీజేపీకి కంచుకోటగా మారింది.