నీలిరంగులోకి మారుతున్న శునకాలు

Sun Aug 13 2017 19:35:16 GMT+0530 (IST)

సాధారణంగా ఊసరవెల్లి రంగులు మారుస్తుంది. పలు సందర్భాల్లో వాతావరణాన్ని బట్టి కొన్ని మొక్కలు రంగులు మారుస్తుంటాయి. కానీ కుక్కలు రంగు మారుస్తాయా? ఇదేం ప్రశ్న... అనుకోకండి. నిజంగా జరిగింది. నవీ ముంబై సమీపంలోని తాలోజా ఇండస్ట్రీయల్ ఎస్టేట్ సమీపంలోని శునకాలు నీలి రంగులోకి మారాయి! ఒకటి కాదు రెండు కాదు ఏకంగా..ఆరు కుక్కల రంగు మారిపోయింది. ఇలా అవాక్కయే పరిస్థితి... కాలుష్యమే దీనికి ప్రధాన కారణంగా తేల్చారు. పరిశ్రమల కాలుష్యమే ఈ విపరిమానానికి దారితీసిందని చెప్తున్నారు.

మహారాష్ట్ర కాలుష్య నియమంత్రణ మండలికి నవీ ముంబై అనిమల్ ప్రొటెక్షన్ సెల్ చేసిన ఫిర్యాదు ప్రకారం స్థానికంగా ఉన్న పరిశ్రమలు కసాడీ నదిలోకి నేరుగా కాలుష్య కాసారాన్ని వదిలివేయడంతో అవి శునకాల పాలిట శాపంగా మారాయి. ఈ నదిలోని నీటిలో బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ శాతం తీవ్రంగా మారిపోయింది. అంతే కాకుండా నీటిలో క్లోరైడ్ సహా మరిన్ని తీవ్ర స్థాయిలో హెచ్చుమీరిపోవడంతో ఈ విపరిమాణం చోటుచేసుకుందని విశ్లేషించారు. తలోజా నది పరిసర ప్రాంతంలో దాదాపు వెయ్యికి పైగా ఉన్న ఫార్మా ఆహార ఇంజినీరింగ్ ఫ్యాక్టరీల కాలుష్యం ఇందుకు కారణమని తేలింది.

ఈ పరిణామంపై మహారాష్ట్ర కాలుష్య నియమంత్రణ మండలికి చెందిన ప్రాంతీయ అధికారి జయవంత్ హజారే మాట్లాడుతూ ఐదు నుంచి ఆరు శునకాలు నీలి రంగులోకి మారినట్లు గుర్తించామని తెలిపారు. సమీప పరిశ్రమల వారిని హెచ్చరించామని వ్యర్థాలను శుద్ధి చేయాల్సిందేనని తేల్చిచెప్పినట్లు పేర్కొన్నారు. కాగా ఈ నీరు పక్షులు ఇతరత్రా జంతువులకు సైతంహనికరంగా మారే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.