నోరుజారి తమ్ముణ్ని నవ్వులపాలు చేసిన ములాయం!

Mon Dec 10 2018 13:17:58 GMT+0530 (IST)

ఉత్తరప్రదేశ్ సీనియర్ నేత - సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) మాజీ అధినేత ములాయం సింగ్ యాదవ్ టంగ్ స్లిప్పయ్యారు. ఓ పార్టీకి బదులుగా మరో పార్టీని పొగిడారు. ఆ పార్టీ ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. వేరే పార్టీ ర్యాలీ లో పాల్గొంటూ ములాయం ఇలాంటి అనూహ్య వాఖ్యలు చేయడం చూసి అంతా ముక్కున వేలేసుకున్నారు. ములాయం కుమారుడు - ప్రస్తుత ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ తో  పొసగక ఈ ఏడాది అక్టోబర్‌లో ములాయం తమ్ముడు శివపాల్ సింగ్ యాదవ్ ఈ ఏడాది కొత్త పార్టీ పెట్టుకున్నారు. ప్రగతిశీల్ సమాజ్‌వాదీ పార్టీ(లోహియా) గా దానికి నామకరణం చేశారు. ములాయం కూడా కుమారుడి వైపు కాకుండా తమ్ముడి వైపే నిలిచారు.ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. యూపీలో బీజేపీ పాలనకు వ్యతిరేకంగా ప్రగతిశీల్ సమాజ్‌వాదీ పార్టీ(లోహియా) ఆధ్వర్యంలో ఆదివారం లక్నోలో జన్ ఆక్రోశ్ ర్యాలీ పేరుతో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఇందులో శివపాల్‌తో పాటు ములాయం కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ములాయం ప్రసంగించారు. అయితే - తాను వచ్చింది శివపాల్ పార్టీ కార్యక్రమానికి అని ములాయం మరిచారు. సమాజ్ వాదీ పార్టీని ప్రశంసిస్తూ ప్రసంగం కొనసాగించారు. బడుగు - బలహీన వర్గాలందరిని ఎస్పీ కలుపుకుపోతుందన్నారు. పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. దీంతో శివపాల్ సహా అక్కడున్న ప్రగతిశీల్ సమాజ్‌వాదీ పార్టీ నేతలు కార్యకర్తలంతా అవాక్కయ్యారు. వెంటనే తేరుకున్న శివపాల్ తన అన్నను మెల్లగా తాకారు. దీంతో ములాయం వెనక్కి తగ్గారు. ఆ పై శివపాల్ పార్టీకి మద్దతుగా మాట్లాడి ప్రసంగం ముగించారు.

ములాయం మాటల పై ఇప్పుడు అంతా చర్చించుకుంటున్నారు. తాను ఏ పార్టీలో ఉన్నాడో కూడా ఆయనకు గుర్తులేదా అంటూ పలువురు ఎద్దేవా చేస్తున్నారు. అయితే సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ) తో ములాయంసింగ్ యాదవ్ అనుబంధం విడదీయరానిది. 1992లో ఆయనే ఆ పార్టీని స్థాపించారు. రెండు దశాబ్దాలకు పైగా అధ్యక్షుడిగా కొనసాగారు. పార్టీని తన కనుసైగలతో శాసించారు. ఆయన నరనరాల్లో ఎస్పీ నిండి ఉంటుంది. మరి అలాంటి వ్యక్తి మాటల మధ్యలో ఆ పార్టీకి మద్దతు పలకడంలో ఆశ్చర్యమేమీ లేదని మరికొందరు విశ్లేషిస్తున్నారు.