Begin typing your search above and press return to search.

స్నేహం కోసం: ములాయం - అమర్ సింగ్

By:  Tupaki Desk   |   25 Oct 2016 5:29 PM GMT
స్నేహం కోసం: ములాయం - అమర్ సింగ్
X
రాజకీయాల్లో రాసి కంటే వాసి ముఖ్యం' అనుకుంటే సమాజ్ వాదీ పార్టీలో అమర్ సింగ్ కంటే గొప్ప(!) వ్యూహకర్త లేరు. జైలు శిక్ష నుంచి ములాయం సింగ్ యాదవ్ ను కాపాడినా, నేతాజీకి ఢిల్లీ రాజకీయాల ఓనమాలు దిద్దించినా, బిల్ క్లింటన్ నుంచి బడా పారిశ్రామికవేత్తలను యూపీకి రప్పించినా, సినిమా స్టార్లతో సమాజ్ వాదీకి మరింత గ్లామర్ అద్దినా అది ఒక్క అమర్ సింగ్ ఘనతేనని నేతాజీ(ములాయం) బలంగా నమ్ముతారని పార్టీ ప్రముఖులు చెబుతారు. అందుకే కన్న కొడుకును సైతం కాదని ములాయం.. అమర్ సింగ్ పై అమర ప్రేమను ప్రకటిస్తారని అంటారు. అసలు వీళ్ల దోస్తీ ఎలా మొదలైంది?

గొప్ప గొప్ప స్నేహాలు, గొప్ప గొప్ప బంధాలు రాత్రి కి రాత్రి పుట్టినవి సాదారణంగా ఉండవు. ప్రేమకు తొలి చూపు ఉంటుంది కానీ.. స్నేహానికి మాత్రం కచ్చితంగా బలమైన పునాది, అంతకు మించి బలమైన అనుబంధం ఎంతో అవసరం. ఈ క్రమంలో ములాయం సింగ్ - అమర్ సింగ్ ల స్నేహాన్ని కూడా సీనియర్ రాజకీయ విశ్లేషకులు బలమైన దోస్తీగానే వ్యవహరిస్తుంటారు. మధ్య మధ్యల్లో చిన్న చిన్న పొరపొచ్చాలు వచ్చినా... వారిది దృఢమైన బందమనేది పలువురి అభిప్రాయం.

వీరి నేటి బలమైన స్నేహానికి పునాదులు, వాటికి గోడలు ఆపై స్లేబు పడిన సంఘటనలను ఒక సారి తెలుసుకుందాం. అప్పటికే సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్న ములాయం సింగ్ యాదవ్ జనతాపార్టీ ప్రతినిధిగా 1985లో ఉత్తరప్రదేశ్ శాసన మండలి ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. సరిగ్గా ఆ సమయంలోనే ములాయంకు యూపీలో బలమైన రాజ్ పుత్ సామాజిక వర్గానికి చెందిన అమర్ సింగ్ పరిచయం అయ్యారు. మొదటిసారి జనతాదళ్ నుంచి 1989లో ములాయం ముఖ్యమంత్రి అయిన తర్వాత అమర్ -ములాయంకు మరింత దగ్గరయ్యారు. అనంతర కాలంలో పరివార్ నుంచి విడిపోయి 1992లో సొంతగా సమాజ్ వాదీ పార్టీ స్థాపించినప్పుడూ ములాయం వెంట అమర్ సింగ్ ఉన్నారు. 1996లో అధికారికంగా సమాజ్ వాదీ పార్టీలో చేరిన అమర్ సింగ్.. కేంద్రంలో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వ (1996-98) ఏర్పాటయిన కాలంలో ఎస్పీ తరఫున కేంద్రంలో కీలక పాత్ర పోశించారని చెబుతారు.

అప్పట్లో రక్షణ శాఖ మంత్రిగా పనిచేస్తోన్న ములాయంకు ధారళమైన ఇంగ్లీష్, స్వచ్ఛమైన హిందీలో అనర్గళంగా మాట్లాడే అమర్ సింగ్.. అన్నీ తానై వ్యవహారాలన్నీ చక్కబెట్టేవారట. ఆ సమయంలో యూపీలో పార్టీ పగ్గాలన్నీ అమర్ సింగ్ చేతుల్లో ఉండేవి. ఇక 2003లో ములాయం మరోసారి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా గద్దెనెక్కినప్పుడు యూపీ డెవలప్ మెంట్ కౌన్సిల్ చైర్మన్ హోదాలో అమర్ సింగ్ వ్యవహరిచారు. ఈ క్రమంలో అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్, జయప్రద, రాజ్ బబ్బర్ సహా పలువురు బాలీవుడ్ స్టార్లను సమాజ్ వాదీలో చేర్పించింది కూడా అమర్ సింగే!

అలా వర్థిల్లుతోన్న వారి స్నేహం 2009లో అఖిలేశ్ యాదవ్ సీఎంగా ఎంట్రీ ఇచ్చిన తర్వాత కుదుపులకు గురైంది. బయటి వ్యక్తి (అమర్ సింగ్)ని తండ్రి (ములాయం) అతిగా నమ్ముతున్నారని అఖిలేశ్ పలుమార్లు బహిరంగంగా వ్యాఖ్యానించారు కూడా. అనంతరం అఖిలేశ్ సీఎం పగ్గాలు చేపట్టడంతో ఆయన ఖాళీ చేసిన ఫిరోజాబాద్ పార్లమెంట్ స్థానంలో భార్య డింపుల్ యాదవ్ పోటీకి దింపారు. అది రుచించని అమర్ సింగ్.. డింపుల్ కు వ్యతిరేకంగా ఎస్పీ తిరుగుబాటు అభ్యర్థికి మద్దతు ఇచ్చారు. అంతచేసినా ఫలితం మాత్రం అఖిలేశ్ కు అనుకూలంగా రావడంతో ఆ వెంటనే తండ్రిని ఒప్పించిన అఖిలేష్... అమర్ సింగ్ పై వేటువేశారు.

తాజాగా ఆరేళ్ల బహిష్కరణ కాలాన్ని పూర్తిచేసుకున్న అమర్ సింగ్ 2016లో సమాజ్ వాదీ పార్టీలోకి రీ ఎంట్రీ ఇచ్చారు. సరిగ్గా కొడకు చరిష్మా ముందు ములాయం స్టార్ డమ్ వెలిసిపోతున్న ఈ తరుణంలోనే ములాయంకు అమర్ తోడయ్యారు. తన ప్రియ స్నేహితుడికి పూర్వవైభవం కల్పించడంతోపాటు ప్రధాని కావాలనే పాతకలను నిజం చేసే బాధ్యతను అమర్ తలకెత్తుకున్నారు. ఈ క్రమంలో ఎన్ని ఒడుదుడుకులు, తీవ్రస్థాయి విమర్శలకు గురైనా అమర్ స్నేహం కోసం ఎంతకైనా వెళతానని ములాయం తేల్చిచెప్పారు. సరిగ్గా ఇక్కడి నుంచే అఖిలేశ్ కొత్త పార్టీ పెట్టబోతున్నారనడానికి పునాదులు పడ్డాయని చెప్పేవారు ఉన్నారు. అయితే వీరి పాత స్నేహం సంగతి అఖిలేష్ కు తెలియనిదీ కాదు, అమర్ సింగ్ ఫిరోజాబాద్ పార్లమెంట్ స్థానం విషయంలో చేసిన పని సంగతి ములాయం మరిచిపోయీ కాదు. స్నేహం అన్నాక చిన్న చిన్న పొరపొచ్చులుండక తప్పదు. అది సీనియర్స్ అయిన ములాయం - అమర్ లకు అర్ధమవుతాయి కానీ... ఉడుకురత్కంలో ఉన్న అఖిలేష్ కు అర్ధం కాకపోవడంలో అర్ధం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా... ములాయం కు అమరి సింగ్ తోడవడంతో యూపీ రాజకీయాలు, ముఖ్యంగా సమాజ్ వాదీ పార్టీ వ్యవహారాలు మహరంజుగా ఏస్థాయిలో మారబోతున్నాయనేది కలమే చెబుతుంది!!