Begin typing your search above and press return to search.

మోడీ వైపు ములాయం చూపు..

By:  Tupaki Desk   |   24 Oct 2016 9:09 AM GMT
మోడీ వైపు ములాయం చూపు..
X
ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల ముందు సమాజ్ వాది పార్టీలో ఏర్పడిన ముసలం బీజేపీకి బాగా కలిసొస్తున్నట్లుగా ఉంది. తండ్రీకొడుకులు ములాయం సింగ్ యాదవ్ - అఖిలేశ్ యాదవ్ లు రెండు వర్గాలుగా చీలిపోయిన తరుణంలో ఒక వర్గం బీజేపీతో కలిసే దిశగా అడుగులేస్తున్నట్లుగా కనిపిస్తుంది. అందులోనూ మోడీని నిత్యం విమర్శించే ములాయం సింగే తాజా పరిణామాల నేపథ్యంలో మోడీని ఆదర్శంగా చూపడం... ఆయన్ను ప్రశంసించడం చూస్తుంటే రాజకీయాలు కీలక మలుపు తిరగబోతున్నట్లుగా కనిపిస్తోంది. నిజంగా ములాయం కనుక మోడీ వైపు చేరితే అది దేశ రాజకీయాల్లోనూ పెను మార్పులకు దారితీసే అవకాశాలున్నాయి.

తన కుమారుడు అఖిలేశ్ - తమ్ముడు శివపాల్ ల మధ్య విభేదాలు తార స్థాయికి చేరడంతో లక్నోలో ఈ రోజు సమాజ్ వాది పార్టీ సమావేశాన్ని నిర్వహించారు ములాయం ఆ సందర్భంగా కీలక వ్యాఖ్యాలు చేశారు. "మన ప్రధాని మోడీని చూడండి. పేద కుటుంబం నుంచి వచ్చిన ఆయన అకుంఠిత శ్రమతో ప్రధానమంత్రి స్థాయికి చేరుకున్నారు. ఆయన అంకిత భావం చాలా గొప్పది. తన తల్లిని ఎన్నటికీ వీడనని ఆయన ప్రతి సందర్భంలోనూ చెబుతుంటారు. మోడీకి తన తల్లి ఎలాగో - నాకు నా తమ్ముడు శివపాల్ యాదవ్ - అమర్ సింగ్ అంతే. వారిద్దరిని కూడా నేను ఎన్నటికీ వదలను" అని అన్నారు. తన కోసం - పార్టీ కోసం తన తమ్ముడు శివపాల్ చేసిన కృషిని తాను ఎన్నడూ మరవనని ములాయం చెప్పారు. అమర్ సింగ్ తను సొంత తమ్ముడిలాంటి వాడని, కష్ట సమయాల్లో ఎన్నోసార్లు తన వెన్నంటే నిలిచాడని అన్నారు. అమర్ చేసిన తప్పులన్నీ మాఫీ అయిపోయాయని... ఆయనను తప్పుబట్టడానికి ఏమీ లేదని అన్నారు. వీరిద్దరినీ తాను ఎన్నటికీ వదులుకోలేనని స్పష్టం చేశారు.

అయితే... కుమారుడు అఖిలేశ్ - మరో తమ్ముడు రాంగోపాల్ యాదవ్ లు కూడా ఒకరు కడుపున పుట్టినవారు, ఇంకొకరు తోడబుట్టినవారు కావడంతో వారిని ఎందుకు వదులుకోవడానికి సిద్ధమవుతున్నారన్న ప్రశ్న అఖిలేశ్ వర్గం నుంచి వినిపిస్తోంది. అమర్ సింగ్ పూర్తిగా తన తండ్రిని తప్పుదారి పట్టిస్తున్నారని అఖిలేశ్ ఆరోపిస్తున్నారు. అయితే... ఎన్నడూ లేనట్లుగా ములాయం మోడీ భజన చేయడంతో ఆయన ఈ రాజకీయ సంక్షోభం నుంచి సేఫ్ గా బయటపడడానికి భారీ స్కెచ్ వేశారని... బీజేపీ అండతో ఎస్పీని యూపీలో మళ్లీ అధికారంలోకి తెచ్చే ఆలోచనలో ఉన్నారని... బీజేపీతో కలవడానికి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/