Begin typing your search above and press return to search.

అంబానీ అక్కడ : 10వేల కోట్లు - లక్ష ఉద్యోగాలు

By:  Tupaki Desk   |   22 Feb 2018 4:19 AM GMT
అంబానీ అక్కడ : 10వేల కోట్లు - లక్ష ఉద్యోగాలు
X
ముఖేష్ అంబానీ ఒక పూట తమ ఇంటికి భోజనానికి వచ్చిపోయారో లేదో.. వెంటనే చంద్రబాబు అండ్ కోటరీ.. తెగ డబ్బా కొట్టుకోవడం ప్రారంభించేశారు. రాష్ట్రంలో తిరుపతి - బెజవాడ - విశాఖల్లో వేర్వేరు యూనిట్లు ప్రారంభించడానికి రిలయన్స్ సంస్థ విపరీతంగా ఉత్సాహం చూపిస్తున్నదని.. తిరుపతిలో జియో ఫోన్ల పరిశ్రమ వచ్చేసినట్టేనని ఇలా రకరకాల కబుర్లు చెప్పారు. ఆ ప్రచారాన్ని రెండు రోజుల తర్వాత రిలయన్స్ వర్గాలు ఖండించాయి. ఏపీలో పెట్టుబడులకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు ఇంకా తీసుకోలేదని వెల్లడించాయి. బాబు గారి పరువు తుస్సుమంది.

అయితే ఇప్పుడు ముఖేష్ అంబానీ.. ఉత్తరప్రదేశ్ కు మాత్రం స్వయంగా చాలా వరాలనే ప్రకటించేస్తున్నారు. ఒక ముఖ్యమంత్రి అయిన నాయకుడు కూడా అయిదేళ్ల కాలంలో చేస్తానని మేనిఫెస్టోలో కూడా చెప్పలేనంత స్థాయిలో.. ఒక పారిశ్రామికవేత్త ప్రజలకు వరాలు ఇస్తుండడం గమనార్హం. యూపీలో రాబోయే మూడేళ్లలో లక్ష ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం అని ముఖేష్ ప్రకటించారు. తమ జియో సంస్థ తరఫున యూపీలో పదివేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టబోతున్నామని - రాష్ట్రప్రభుత్వ సహకారంతో యూనివర్సిటీలతో అనుసంధానమై ఒక క్యాంపస్ ను ఏర్పాటుచేస్తాం అని వెల్లడిస్తున్నారు.

యూపీ ఇన్వెస్టర్ సమిట్ ప్రారంభ రోజున ముఖేష్ అంబానీ మాట్లాడుతూ.. రిలయన్స్ ఇప్పటికే యూపీలో 40వేల ప్రత్యక్ష పరోక్ష ఉద్యోగాలను కల్పించి ఉన్నదని.. అత్యంత జనాభా ఉన్న రాష్ట్రంగా పేరుపడిన యూపీని అత్యంత సంపన్న రాష్ట్రంగా తయారు చేస్తాం అని ప్రకటించారు. యూపీ తమకు చాలా ప్రధానమైన రాష్ట్రం కావడం వల్ల.. ఆ రాష్ట్రానికి రెండు కోట్ల జియో ఫోన్లను కూడా అందించబోతున్నట్లు ఆయన వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ ను ఉత్తమ ప్రదేశ్ గా తీర్చిదిద్దడానికి అన్ని రకాలుగాను కృషి చేస్తాం అని వెల్లడించారు.

ఇదే ఇన్వెస్టర్స్ మీట్ కు హాజరైన అదానీ గ్రూపు ఛైర్మన్ మాట్లాడుతూ.. రాబోయే అయిదేళ్లలో యూపీలో 35 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెడతాం అని వెల్లడించారు.

మన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా ప్రస్తుతం సీఐఐ సదస్సుకు సన్నాహాల్లో ఉన్నారు. పెట్టుబడుల గురించి... పారిశ్రామికవేత్తలు వెళ్లిపోయిన తర్వాత.. సీఎం, ఆయన వందిమాగధులు ప్రకటించడం కాదు.. అవి నిజమే అయితే గనుక.. ఆ పారిశ్రామికవేత్తలే ప్రకటించాలి.. అప్పుడే జనం నమ్ముతారు. ఆ సంగతి ఆయన యూపీ ఇన్వెస్టర్ మీట్ చూసి తెలుసుకోవాలని జనం అనుకుంటున్నారు.