Begin typing your search above and press return to search.

డ‌బ్బంటే ఎందుకు లెక్క‌లేదో చెప్తున్న అంబానీ

By:  Tupaki Desk   |   20 March 2017 11:30 AM GMT
డ‌బ్బంటే ఎందుకు లెక్క‌లేదో చెప్తున్న అంబానీ
X
ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ సంప‌ద‌ - వ్యాపార ల‌క్ష‌ణాలు - భార‌తదేశ భ‌విష్య‌త్ గురించి ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. ఇండియాటుడే సదస్సులో అంబానీ తన అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ ''నిజం చెప్పాలంటే నా దృష్టిలో డబ్బుకు విలువ లేదు. కేవలం డబ్బు సంపాదించడం కోసమే ఏదైనా పని చేపట్టావంటే నీవు అవివేకివే అని మా తండ్రి గారు అంటుండేవారు. ఎందుకంటే, అప్పుడు నువ్వు ఏ రంగంలోనూ ఉత్తముడివి అన్పించుకోలేవని, డబ్బు కూడా సంపాదించలేవని అనేవారు' అని సదస్సులో అడిగిన ప్రశ్నకు సమాధానంగా అంబానీ చెప్పారు.

రిలయన్స్ ఇండస్ట్రీలో బాధ్యతలు చేపట్టకముందు అధ్యాపకుడిని కావాలనుకున్నా అని ముకేశ్ అంబానీ ఈ సంద‌ర్భంగా వెల్లడించారు. మా తండ్రి గారు (ధీరూభాయ్ అంబానీ) నన్ను రిలయన్స్‌ లోకి తీసుకురాకముందు, వరల్డ్ బ్యాంక్‌ లో పనిచేయడమో లేదంటే ఏదైనా యూనివర్సిటీలో అధ్యాపకుడిగా చేరాలన్న కోరిక ఉండేది అని సదస్సులో అన్నారు. నా భార్య (నీతా అంబానీ) ఇప్పటికే అధ్యాపకురాలిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మున్ముందు రోజుల్లో తనతో కలిసి విద్యా రంగంలో మరింత చురుకుగా పాల్గొంటా. అది మాకు ఆత్మ సంతృప్తినిచ్చే పని అని ముఖేష్ చెప్పారు. వచ్చే రెండేళ్ల‌లో దేశంలోని విద్యా సంస్థలన్నింటినీ అనుసంధానం చేయనున్నట్లు అంబానీ ప్రకటించారు. జియో నెట్‌ వర్క్ ద్వారా దేశంలోని 58 వేల కాలేజీలు - 19 లక్షల పాఠశాలలను అనుసంధానం చేయనున్నట్లు, తద్వారా 20 కోట్ల మంది విద్యార్థులకు డాటా సేవలు కల్పించనున్నట్లు ఆయన తెలిపారు.

ఈ సంద‌ర్భంగా విదేశాల్లోని మ‌న నిపుణుల‌కు ఎదుర‌వుతున్న ఇబ్బందుల‌పై ముఖేష్ అంబానీ ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. విదేశాలకు వలస వెళ్లిన మన మేధావులను ఆకర్షించేందుకు ఇదే సరైన సమయమని ముకేశ్ అంబానీ అన్నారు. తద్వారా వారు భారత్‌కు తిరిగి వచ్చి మాతృభూమికి సేవలు అందించగలరని ఆయన పేర్కొన్నారు. 'ఏ కారణంతో వారు స్వదేశానికి తిరిగి వచ్చినప్పటికీ.. ఇక్కడి 130 కోట్ల మంది ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చడంలో తోడ్పడగలరు. అంతేకాదు, సరికొత్త అభివృద్ధి విధానానికి నాంది పలుకగలరు. ఎందుకంటే, హర్ ఏక్ కా దిల్ హై హిందుస్థానీ (ప్రతి భారతీయుడి గుండెల్లో దేశంపై ప్రేమ ఉంది)' అని అన్నారు. గతంలో విదేశాల్లోని సంస్థల్లో నాయకత్వ బాధ్యతలు నిర్వహించిన అనుభవం కలిగిన భారతీయులు.. స్వదేశానికి తిరిగి వచ్చాక రిలయన్స్‌లో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న వారు చాలా మందే ఉన్నారని అంబానీ ఈ సందర్భంగా తెలిపారు. ప్రతినెలా రిలయన్స్‌లో చేరుతున్న వారిలో కనీసం ఇద్దరు లేదా ముగ్గురు విదేశాల్లో పనిచేసిన అనుభవం కలిగిన వారు ఉంటున్నారని ఆయన వెల్లడించారు. గతనెల నాస్కామ్ సదస్సులో అంబానీ మాట్లాడుతూ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్1బీ వీసాలపై ఆంక్షలు విధించడం ఒక విధంగా మన దేశానికి వరమేనని అన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/