Begin typing your search above and press return to search.

కాపుల బాధ‌!...ముద్ర‌గ‌డ ఇలా చేశారేంటీ?

By:  Tupaki Desk   |   13 Sep 2017 2:01 PM GMT
కాపుల బాధ‌!...ముద్ర‌గ‌డ ఇలా చేశారేంటీ?
X
ఏపీలో కాపుల‌కు రిజ‌ర్వేష‌న్లు తక్ష‌ణ‌మే క‌ల్పించాలంటూ గ‌త కొంత కాలం నుంచి తీవ్ర స్థాయిలో ఉద్య‌మం చేస్తున్న కాపు ఐక్య‌వేదిక నేత‌ - మాజీ మంత్రి ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం... ఇప్పుడు పెద్ద ఇబ్బందిలో ప‌డిపోయార‌న్న మాట వినిపిస్తోంది. కాపుల సంక్షేమ‌మే త‌న జీవిత ల‌క్ష్య‌మంటూ చెప్పుకునే ముద్ర‌గ‌డ‌... త‌న వియ్యంకుడి కార‌ణంగా నిజంగానే అభాసుపాల‌య్యార‌ని ఆయ‌న సామాజిక వ‌ర్గం భావిస్తోంద‌ట‌. గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో అధికార‌మే ప‌ర‌మావధిగా రంగంలోకి దిగిన తెలుగుదేశం పార్టీ... లెక్క‌లేన‌న్ని హామీల‌ను గుప్పించింది. ఇందులో కాపుల‌కు రిజ‌ర్వేషన్లు క‌ల్పిస్తామ‌న్న కూడా ఒక‌టి. టీడీపీ ఇచ్చిన హామీల్లో ఇదీ ఒకటి అని చెప్పేకంటే... ఇదే ప్ర‌ధాన‌మైన‌ద‌న్న విశ్లేష‌ణ లేక‌పోలేదు. టీడీపీ స‌ర్కారు ఇచ్చిన ఈ హామీతో పాటు మిగిలిన హామీలు కూడా ఆ పార్టీకి అధికారం క‌ట్ట‌బెట్టాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

అయితే ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఇచ్చిన హామీల‌ను నెర‌వేర్చే ల‌క్ష‌ణం రాజ‌కీయ పార్టీలకు... ప్ర‌త్యేకించి టీడీపీకి లేవ‌న్న వాద‌న లేక‌పోలేదు. ఈ క్ర‌మంలోనే అధికారం చిక్కేదాకా హామీల వ‌ర‌ద పారించిన టీడీపీ అధినేత‌... న‌వ్యాంధ్ర సీఎంగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేపట్టిన త‌ర్వాత వాటి అమ‌లుపై పెద్ద‌గా దృష్టి సారించ‌లేద‌నే చెప్పాలి. ఈ క్ర‌మంలో టీడీపీ స‌ర్కారు గ‌ద్దెనెక్కిన త‌ర్వాత కొంత కాలం పాటు వేచి చూసిన ముద్ర‌గ‌డ‌... ఆ త‌ర్వాత ఉద్య‌మ బాట ప‌ట్టారు. టీడీపీ స‌ర్కారుకు కంటి మీద కునుకు లేకుండానే చేశారు. అస‌లు ముద్ర‌గ‌డ‌ను ఎలా దారికి తెచ్చుకోవాలా? అన్న దిశ‌గా చంద్ర‌బాబు స‌ర్కారు ప‌రి ప‌రి విధాలుగా యోచించింద‌న్న వాద‌న కూడా లేక‌పోలేదు. ఉద్య‌మంలో ముద్ర‌గ‌డ ముందు న‌డిస్తే... కాపు సామాజిక వ‌ర్గం మొత్తం ఆయ‌న వెంటే న‌డిచింది. త‌మ‌కు రిజ‌ర్వేష‌న్లు సాధించేందుకు రంగంలోకి దిగిన ముద్ర‌గ‌డ‌కు వారు సంపూర్ణ మ‌ద్ద‌తు ఇచ్చార‌న్న విష‌యంలోనూ ఎలాంటి అతిశ‌యోక్తి కూడా లేద‌నే చెప్పాలి.

ఇలాంటి కీల‌క త‌రుణంలో ముద్ర‌గ‌డ... ఓ చిన్న విష‌యాన్ని ప‌రిష్క‌రించుకునేందుకు ఏకంగా ఉద్య‌మాన్నే ప‌క్క‌న‌పెట్టేశార‌న్న వాద‌న వినిపిస్తోంది. అయినా ఆ చిన్న విష‌యం ఏమిటంటే... రియ‌ల్ ఎస్టేట్ ఒప్పందానికి సంబంధించి త‌న వియ్యంకుడు ర‌వికుమార్ ఓ ఎన్నారైని ముప్పు తిప్ప‌లు పెట్టి మూడు చెరువుల నీరు తాగించార‌ట‌. దీంతో స‌ద‌రు ఎన్నారై రాజ‌మ‌హేంద్ర‌వ‌రం  రూర‌ల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రిని ఆశ్ర‌యించ‌గా.. ప‌రిస్థితి విష‌మించిన వైనాన్ని గుర్తించిన ముద్ర‌గ‌డ నేరుగా గోరంట్ల గ‌డ‌ప తొక్కారు. మొన్న సాయంత్రం నాలుగు గంట‌ల‌కు బీజేపీ ఎమ్మెల్యే ఆకుల స‌త్య‌నారాయ‌ణ‌ను వెంట‌బెట్టుకుని వెళ్లిన ముద్ర‌గ‌డ‌... ఏకంగా నాలుగు గంట‌ల పాటు చ‌ర్చోపచ‌ర్చ‌లు జ‌రిపి రాత్రి 8 గంట‌ల స‌మ‌యంలో బ‌య‌ట‌కు వ‌చ్చారు. అప్ప‌టిదాకా ఏదో రాజ‌కీయ అంశ‌మో, కాపుల‌కు రిజ‌ర్వేష‌న్ల కోసం తాను సాగిస్తున్న ఉద్య‌మం గురించో గోరంట్ల‌కు చెప్పేందుకు ముద్ర‌గ‌డ అక్క‌డికి వెళ్లిన‌ట్లు తొలుత వార్తా క‌ధ‌నాలు వినిపించాయి. కాపుల‌కు రిజ‌ర్వేష‌న్లు క‌ల్పిస్తే... త‌మ పూర్తి మ‌ద్ద‌తు టీడీపీకేన‌ని చెప్పేందుకే ముద్ర‌గ‌డ‌... గోరంట్ల‌తో రాయ‌బారం న‌డిపేందుకు వెళ్లార‌ని కూడా కొంద‌రు భావించారు.

అయితే నాలుగు గంట‌ల భేటీ త‌ర్వాత బ‌య‌ట‌కు వ‌చ్చిన ముద్ర‌గ‌డ... గోరంట్ల‌తో భేటీలో ఎలాంటి రాజ‌కీయ ప్రాధాన్యం లేద‌ని, కేవ‌లం ఓ వ్య‌క్తిగ‌త విష‌యం మాట్లాడేందుకే వ‌చ్చాన‌ని చెప్ప‌డంతో కాపులంతా షాక్ తిన్నార‌ట‌. ఇక ఆ త‌ర్వాత ఆ వ్య‌క్తిగ‌త విష‌యం ఏమిట‌న్న విష‌యాన్ని మీడియా బ‌య‌ట‌పెట్ట‌డంతో ఈ ద‌ఫా కాపులంతా ముద్ర‌గ‌డ తీరుపై ఆగ్ర‌హంతో ర‌గిలిపోతున్నార‌ట‌. కాపుల రిజ‌ర్వేష‌న్ల కోసం నిత్యం తాను తుల‌నాడుతున్న టీడీపీ నేత‌ల ఇంటికి... త‌న వ్య‌క్తిగ‌త స‌మస్య ప‌రిష్కారం కోసం ముద్ర‌గ‌డ వెళ్లిన తీరు నిజంగానే కాపుల్లో తీవ్ర అసంతృప్తిని ర‌గిలిస్తోంద‌న్న వాద‌న‌ వినిపిస్తోంది. వియ్యంకుడి కోసం ముద్ర‌గ‌డ కాపు ఉద్య‌మాన్నే ప‌క్క‌న పెట్టేశార‌ని కాపులంతా కూడా తీవ్ర మ‌నోవేద‌న‌కు గుర‌వుతున్నార‌ట‌. మ‌రి ఈ విష‌యం ముద్ర‌గ‌డ దాకా వెళ్లిందో, లేదో చూడాలి. ఒక‌వేళ ఈ విష‌యం ఆయ‌న వ‌ద్ద‌కు వెళ్లితే... ముద్ర‌గ‌డ ఎలా స్పందిస్తార‌న్నది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.