Begin typing your search above and press return to search.

మళ్లీ ముద్ర రగడ!

By:  Tupaki Desk   |   28 Aug 2016 7:21 AM GMT
మళ్లీ ముద్ర రగడ!
X
టీడీపీకి మరో టెన్షన్ మొదలైంది.. పవన్ కళ్యాణ్ సభ పెట్టి ప్రత్యేక హోదా ఉద్యమం మొదలుపెడుతుండడంతో ఒక ఎత్తయితే సందట్లో సడేమియాలా కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కూడా మరోసారి ఆందోళనకు సన్నద్ధమవుతున్నట్టు ప్రకటించడంతో టీడీపీకి నిద్ర పట్టడం లేదు. కొన్ని రోజులుగా రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని గమనిస్తూనే - రాష్ట్రంలోని తన సామాజికవర్గ నేతలతో సమావేశాలు నిర్వహిస్తూ వచ్చిన ముద్రగడ తాజాగా ఉద్యమ కార్యాచరణను ప్రకటించనున్నట్టు స్పష్టం చేశారు. దీంతో తూర్పు గోదావరి జిల్లాకు చెందిన అధికార పార్టీ నేతల్లో కలవరం మొదలయ్యింది. ముద్రగడ ప్రకటన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తూర్పుగోదావరి జిల్లా ముఖ్యనేతలతో సంప్రదింపులు జరిపినట్టు తెలిసింది. మరోవైపు ముద్రగడ పద్మనాభం ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు హైదరాబాద్‌ లో ఉండనున్నారు. చిరంజీవి - దాసరి నారాయణరావు వంటి కాపు పెద్దలతో పాటు కాపు జేఏసీ నేతలతో ఆయన భేటీ అవుతారు. కాపు ఉద్యమ కార్యచరణపై చర్చిస్తారు. సెప్టెంబర్‌ 11న రాజమండ్రిలో 11 జిల్లాల కాపు జేఏసీ ప్రతినిధులతో ముద్రగడ సమావేశమవుతారు.

కాగా తమ ఉద్యమ కార్యాచరణను సెప్టెంబరు 11న రాజమహేంద్రవరంలో ప్రకటించనున్నట్టు కాపు జెఎసి ప్రకటించింది. ఈ ప్రకటన రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ముద్రగడ ఉద్యమ వ్యూహ రచనపై అప్రమత్తంగా ఉండాలని, ఉద్రిక్త పరిస్థితుల వైపు కాపు సామాజికవర్గం వెళ్లకుండా కట్టడి చేసే బాధ్యత మీదేనంటూ జిల్లాకు చెందిన ఉప ముఖ్యమంత్రి - హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప సహా కాపు ఎంపిలు - ఎమ్మెల్యేలు - ఇతర ముఖ్య నేతలకు ముఖ్యమంత్రి నుండి ఆదేశాలు జారీ అయినట్టు సమాచారం. ముద్రగడ ఆమరణ దీక్ష సమయంలో దిగివచ్చిన ప్రభుత్వం ఏడు నెలల్లోగా సమస్య పరిష్కారానికి హామీ ఇచ్చిందని కాపు నేతలు పేర్కొంటున్నారు. కాపులను బిసిల్లో చేర్చుతామంటూ ఇచ్చిన ఏడు నెలల గడువు ఈ ఆగస్టుతో పూర్తయ్యిందని, మంజునాథ కమిషన్ ఇంతవరకు రాష్ట్రంలో పర్యటించకపోవడం చూస్తే, బీసీల్లో తమను చేరుస్తారనే నమ్మకం లేదని జెఎసి వ్యాఖ్యానిస్తోంది. ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి పట్ల రాష్ట్ర వ్యాప్తంగా కాపు సామాజికవర్గం తీవ్ర ఆవేదనతో ఉన్నారని పేర్కొంటున్నారు. 13 జిల్లాల్లో కాపు జెఎసి కార్యవర్గాలను ఏర్పాటుచేశామని - నియోజకవర్గ - మండల స్థాయిల్లో కూడా కమిటీలను ఏర్పాటుచేస్తున్నట్టు చెప్పారు. ఈ సారి ఉద్యమం అంటూ జరిగితే తీవ్రంగానే ఉంటుందని ఉంటుందని జెఎసి హెచ్చరిస్తోంది.

ముద్రగడ ఉద్యమం అనగానే ప్రభుత్వానికి ఎప్పుడూ టెన్షనే. ఏమత్రం టైం ఇవ్వకుండా నిర్ణయాలు తీసుకునే ముద్రగడ తన ఉద్యమానికి మద్దతు కూడగట్టేందుకు హైదరాబాద్‌ రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే.. గతంలో ముద్రగడ ఉద్యమాన్ని బాగానే ఎదుర్కొన్న అనుభవంతో ఈసారి కూడా అలాంటి వ్యూహాలతోనే విఫలం చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా సమాచారం.