Begin typing your search above and press return to search.

బెజవాడ2వెలగపూడి : పోలీస్ బెల్ట్ !

By:  Tupaki Desk   |   28 July 2017 12:30 AM GMT
బెజవాడ2వెలగపూడి : పోలీస్ బెల్ట్ !
X
తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా ఖాకీ మేఘాలు కమ్ముకుని ఉన్నట్లుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. నిజానికి చాలా చోట్ల చెదురుమదురుగా అవాంఛనీయ సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ముద్రగడ పద్మనాభం రెండో రోజుకూడా పాదయాత్రకు ప్రయత్నించారు. తొలిరోజున ఆయనను 24 గంటలపాటు హౌస్ అరెస్టు చేస్తున్నట్లుగా ప్రకటించిన పోలీసులు, రెండో రోజు కూడా ఆయన పాదయాత్ర ప్రారంభించగానే.. పోలీసులు మళ్లీ అరెస్టు చేశారు. ఈసారి ఏకంగా వారం రోజుల పాటు హౌస్ అరెస్టు చేసేస్తున్నట్లుగా ప్రకటించారు.

ఈ పరిణామాలు అన్నీ కిర్లంపూడి మరియు పరిసర గ్రామాల్లో జరుగుతున్నందువలన.. అక్కడ మాత్రమే ఖాకీవాతావరణం నెలకొని ఉన్నదని అనుకుంటే కుదరదు. నిజానికి రాజధాని అమరావతి మరియు సెక్రటేరియేట్ ఉన్న వెలగపూడి ప్రాంతం అంతా కూడా ఖాకీమయంగానే ఉంది. సెక్రటేరియేట్ వరకు పాదయాత్ర చేయాలన్నది కాపు నాయకుడు ముద్రగడ పిలుపు ఇచ్చిన పాదయాత్ర లక్ష్యం కావడంతో ఏదో ఒక మూల నుంచి కాపు యువత సెక్రటేరియేట్ ను ముట్టడిస్తారనే భయం ప్రభుత్వ వర్గాల్లో అడుగడుగునా కనిపిస్తోంది.

మరో రకంగా చెప్పాలంటే.. విజయవాడ నుంచి అమరావతిలోని వెలగపూడి సచివాలయానికి వెళ్లే మార్గం మొత్తం ఖాకీ బెల్ట్ లాగా తయారైంది. పోలీసుమయం అయిపోయింది. ఒక్క వ్యక్తి ఇచ్చిన పిలుపుకు ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఎంతగా జడుసుకుంటున్నదోననడానికి ప్రబల తార్కాణం లాగా.. రాష్ట్రవ్యాప్తంగా అంతో ఇంతో కాపుల ప్రాబల్యం ఉన్న ప్రతిచోటా.. పోలీసుల మోహరింపు బీభత్సంగా కనిపిస్తోంది.

చూడబోతే.. కాపుసామాజిక వర్గం మొత్తం తన మీద కత్తులు నూరుతున్నారనే భయంలో చంద్రబాబునాయుడు ప్రభుత్వం బితుకుబితుకుమంటూ బతుకు సాగిస్తున్నదా అనే అభిప్రాయం కలుగుతోంది. అవును మరి... లేకపోతే.. కిర్లంపూడి నుంచి పాదయాత్ర చేయదలచుకున్న వ్యక్తిని ఇంటి ప్రహరీ గేటు దాటి బయటకు రాకుండ నిర్బంధించడం మాత్రమే కాదు.. జిల్లాలో ప్రతి రోడ్డు మీద లెక్కకు మిక్కిలిగా చెక్ పోస్టులు పెట్టి ప్రతి వాహనాన్నీ తనిఖీ చేయడం, గుర్తింపు కార్డులు ఉన్నవారిని మాత్రమే పల్లెల్లోకి అనుమతిస్తూ, హెచ్చరికలు చేయడం.. ఇవన్నీ కూడా కాస్త అతి చేస్తున్నట్లుగా ప్రజలు భావిస్తున్నారు.