Begin typing your search above and press return to search.

బాబుకు బీపీ పెంచేనున్న ముద్ర‌గ‌డ కొత్త‌ ప్లాన్

By:  Tupaki Desk   |   17 Nov 2017 7:29 AM GMT
బాబుకు బీపీ పెంచేనున్న ముద్ర‌గ‌డ కొత్త‌ ప్లాన్
X
ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ఇచ్చిన మాట నిలుపుకోవ‌డంలో వైప‌ల్యం చెందుతున్న తీరుపై కాపు ఉద్యమనేత - మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ర‌గిలిపోతున్నార‌ని ఆ సామాజిక‌వ‌ర్గాల్లో చ‌ర్చ‌సాగుతోంది. వెనుకబడిన వర్గాలలో చేరుస్తానని ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన హామీని అమలుచేయకుండా కాలయాపన చేస్తుండ‌ట‌మే కాకుండా...త‌నను గృహ‌నిర్భందం చేసిన తీరుపై ముద్ర‌గ‌డ తీవ్ర అసహ‌నంతో ఉన్నార‌ని అంటున్నారు. ఈ నేప‌థ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వ్య‌తిరేకంగా కొత్త ఫార్ములా తెర‌మీద‌కు తెచ్చార‌ని అంటున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు నాయ‌కుడిగా తాను ప్ర‌తిపాదించిన ఎజెండాతో ముందుకు సాగిన ముద్ర‌గ‌డ తాజాగా దానికి మ‌రో రూపం ఇచ్చార‌ని చెప్తున్నారు.

తాజాగా, ముద్ర‌గ‌డ త‌న కొత్త ఫార్ములాను ప్ర‌తిపాదించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం పెనుమంచిలి గ్రామంలో నిర్వహించిన కాపు వన సమారాధనలో ఆయన మాట్లాడారు. మెడలు వంచైనా రిజర్వేషన్లు సాధించడానికి అనుసరించాల్సిన వ్యూహంపై తగు సూచనలు, సలహాలు అందించాలని కోరారు. డిసెంబర్ 6 వరకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు గడువిచ్చామని - ఈలోగా రిజర్వేషన్లపై చేయాల్సిన ఉద్యమం గూర్చి మంచి సూచనలు - సలహాలు అందజేయాలని కోరారు. అలాగే ఉద్యమానికి సిద్ధంకావాలని పిలుపునిచ్చారు. అన్ని ప్రభుత్వాలు కాపులకు రిజర్వేషన్లు కల్పిప్తామని హామీ ఇచ్చి మాట తప్పుతున్నాయని ముద్ర‌గ‌డ ఆక్షేపించారు. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పిన చంద్రబాబు నాలుగు సంవత్సరాలు గడుస్తున్నా కమిషన్లు - నివేదికల పేరుతో కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. హామీ అమలు కోసం ఉద్యమిస్తుంటే తప్పుడుకేసులు బనాయించడం - లాఠీ ఛార్జీలు చేయించడం - రౌడీషీట్లు ఓపెన్ చేయడం - చివరకు మహిళలను కూడా కించపరచడం చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.

ఏ నేరం చేయకుండానే కాపులను నేరస్తులుగా చిత్రీకరిస్తుండడం బాధాకరమని ముద్ర‌గ‌డ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇచ్చిన హామీ నెరవేర్చమంటే చంద్రబాబుకు ఎందుకు అంత కోపమని ఆయ‌న‌ ప్రశ్నించారు. కాపు ఉద్యమాన్ని నీరుకార్చడమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నారని అన్నారు. త‌న‌ గృహ‌నిర్భందం వంటివి ఇందుకు ఉదాహ‌ర‌ణ‌ల‌ని తెలిపారు. రాబోయే రోజుల్లో కొత్త ప్ర‌ణాళిక‌తో ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తామ‌న్నారు. ఈ సంద‌ర్భంగా ప‌లువురు త‌మ అభిప్రాయాలు పంచుకున్నారు. కాగా, రాబోయే రోజుల్లో మ‌రోమారు స‌మావేశ‌మై పోరాట‌పంథాను రూపొందించాల‌ని ముద్ర‌గ‌డ స‌హా కాపు నేత‌లు నిర్ణ‌యం తీసుకున్నారు.