Begin typing your search above and press return to search.

ముద్ర‌గ‌డ ప్లాన్ బీ...వ‌ర్క‌వుట్ అవుతుందా?

By:  Tupaki Desk   |   10 Jan 2017 6:30 PM GMT
ముద్ర‌గ‌డ ప్లాన్ బీ...వ‌ర్క‌వుట్ అవుతుందా?
X
తన వర్గానికి రిజర్వేషన్లు డిమాండ్లు చేస్తున్న కాపు ఉద్య‌మ నేత ముద్రగడ ప‌ద్మ‌నాభం ప్లాన్ బీ మొద‌లుపెట్టిన‌ట్లు తెలుస్తోంది. కాపుల‌కు రిజ‌ర్వేష‌న్ ప్రయత్నాలపై బీసీల నుంచి ప్రతిఘటన ఎదురవుతున్న నేపథ్యంలో తమకు బీసీలపై వ్యతిరేకత లేదని - వారి హక్కులు ఇవ్వమని కోరడం లేదంటూ భీమవరంలోని కొందరు బీసీ నేతలను కలవడంతో కొత్త‌ చర్చకు తెరలేచింది. దశాబ్దాల నుంచి కొనసాగుతున్న జాతి వైరానికి తెరదించేందుకు కాపు నేత ముద్రగడ పద్మనాభం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయా? నిరంతరం కులపరంగా భౌతికదాడులకు దిగే కాపులు-బీసీలు కలుస్తారా? తమ రాజకీయ అవకాశాలు వదులుకునేందుకు బీసీలు ముందుకొస్తారా?.. తాజాగా ఏపీలో మొదలైన రాజకీయ చర్చ ఇది. కులవైరంతో రగిలిపోతున్న కాపులు-బీసీల మధ్య సయోధ్య కుదిర్చేందుకు ముద్రగడ పద్మనాభం ప్రారంభించిన ప్రయత్నాలపై ఆ రెండు సామాజిక వర్గాలపై చర్చ మొదలయింది.

ఆర్థికంగా - రాజకీయంగా బలంగా ఉన్న కాపులకు రిజర్వేషన్లు ఇస్తే ఆ కోటాలో ప్రవేశించి స్థానిక సంస్థల్లో ఇప్పటివరకూ ఉన్న తమ అవకాశాలను కాపులు కొల్లగొడతారంటూ ఇప్పటికే బీసీలు ఉద్యమిస్తున్నారు. రెండుసార్లు బీసీ కమిషన్ కార్యాలయాన్ని ముట్టడించారు. కాపులకు ఎన్ని వేల కోట్లు ఇచ్చినా, ఎన్ని ఉద్యోగాలిచ్చినా తమకు అభ్యంతరం లేదని, కానీ బీసీ ముసుగులో చేరి స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ అవకాశాలు దెబ్బతీస్తే మాత్రం సహించేదిలేదని బీసీ సంఘాలు ఇప్పటికే ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. అయితే ప్రభుత్వం మాత్రం ఈ అంశంలో పాము చావకుండా కర్ర విరక్కుండా.. అన్న చందంగా రెండు వర్గాలకు సమన్యాయం చేస్తామన్నట్లుగానే వ్యవహరిస్తోంది. కాపులకు బీసీ హోదా ఇచ్చినా బీసీల ప్రయోజనాలు దెబ్బతినవని చెబుతుందే తప్ప, స్థానిక సంస్థల ఎన్నికల్లో కాపులకు అవకాశం ఇవ్వమని చెప్పకపోవడంతో బీసీల్లో గందరగోళం కొనసాగుతోంది. ఈనేపథ్యంలో తమపై చంద్రబాబు బీసీలను ఉసిగొల్పుతున్నారంటూ ఆరోపణలు ప్రారంభించిన ముద్రగడ.. తమ లక్ష్యసాధనపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న బీసీలను బుజ్జగించడం ద్వారా అడ్డంకులు అధిగమించాలని భావించారు. ఆ వ్యూహంలో భాగంగానే ఆయన భీమవరంలో పర్యటించి బీసీ నేతలతో చర్చల ప్రక్రియకు శ్రీకారం చుట్టారు.

కాపుల‌కు రిజ‌ర్వేష‌న్ విష‌యంలో బీసీలే కాకుండా అన్ని కులాలవారూ తమకు మద్దతునిస్తున్నారన్న కొత్త ప్రచారానికి ముద్రగడ తెరలేపారు. దీనివల్ల ఒక్క చంద్రబాబు మినహా తమకెవరూ అడ్డంకి కాదన్న సంకేతం పంపడమే ఆయన వ్యూహమన్నది స్పష్టమవుతోంది. అయితే, ఈ పరిణామాలపై బీసీల్లో సానుకూలత వ్యక్తమవుతున్నట్లు కనిపించడం లేదు. కొన్ని దశాబ్దాల నుంచి ఉభయ గోదావరి జిల్లాలో కాపు-బీసీ, కాపు-ఎస్సీలకు కులపరమైన శత్రుత్వం కొనసాగుతోంది. అనేక సందర్భాల్లో భౌతికదాడులకు దిగిన సమయాల్లో ఇరు వర్గాలపై వందల సంఖ్యలో కేసులు కూడా నమోదయ్యాయి. ముఖ్యంగా కాపు-శెట్టిబలిజ (బీసీ) మధ్య పొసిగే వాతావరణం ఇప్పటికీ కనిపించడం లేదు. గోదావరి జిల్లాల్లోనే కాపులను బీసీల్లో చేర్చే ప్రతిపాదనపై తీవ్ర నిరసన, ప్రతిఘటన కొనసాగుతోంది. తెదేపాకు ఆది నుంచి సంప్రదాయ మద్దతుదారుగా ఉన్న శెట్టిబలిజలు, కాపులకు బీసీ హోదా హామీ ఇచ్చిన ఆ పార్టీపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్న నేపథ్యంలో వారిని శాంతింపచేసేందుకు ముద్రగడ రంగంలోకి దిగడం చర్చనీయాంశమయింది. కాపుల వల్ల తాము కొన్నే ళ్ల నుంచి అన్ని రకాలుగా నష్టపోతున్నామని, ఎన్టీఆర్ పుణ్యానే తమకు రాజకీయంగా అవకాశం వచ్చిందని, ఇప్పుడు ముద్రగడ వచ్చి మా హక్కులకు భంగం వాటిల్లదని చెబితే ఎలా నమ్ముతామని శెట్టిబలిజ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో బీసీలు ఏరకంగా కాపునాడు డిమాండ్లకు సమర్థిస్తారనుకుంటున్నారని నిలదీస్తున్నారు.
ఇదంతా కేవలం కాపు ఉద్యమానికి బీసీల మద్దతుతోపాటు, వారి వ్యతిరేకత లేదన్న ప్రచారం చేసుకునేందుకేనని కుండబద్దలు కొడుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/