Begin typing your search above and press return to search.

పవన్ ఫెయిలైనా పాపం.. చంద్రబాబుదేనంట!

By:  Tupaki Desk   |   14 Feb 2018 11:09 AM GMT
పవన్ ఫెయిలైనా పాపం.. చంద్రబాబుదేనంట!
X
ఇదీ ట్విస్టు అంటే!

‘‘ఎవరో జ్వాలను రగిలించారు.. వేరెవరో దానికి బలియైనారూ...’ అంటూ పాత సినిమాలో ఒక సూపర్ హిట్ సాంగుంది. ఆ లెక్కన కనిపిస్తోంది ఇప్పుడు రాజకీయం. పవన్ కల్యాణ్ తనంత తాను జేఎఫ్‌సీ అనే ప్రయత్నాన్ని ప్రారంభించారు. పోరాటం లాంటి పదాలు తన ప్రయత్నంలో వినిపించకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ.. రాష్ట్రానికి న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తాం.. అంటూ.. అర్థమయ్యీ కాకుండా.. పవన్ కల్యాణ్ ప్రజలకు చెప్పుకుంటూ వస్తున్నారు. ఏదైతేనేం.. రాష్ట్రంలో మరే ఇతర పార్టీ కూడా ప్రయత్నించని రీతిలో - వారికి సాధ్యం కాని రీతిలో పార్టీ రహితంగా.. రాష్ట్రహితాన్ని కాంక్షించే పెద్దలను ఒక వేదిక మీదికి తీసుకువచ్చారు. వారిద్వారా ఏం పని జరుగుతుంది? ఏం సాధ్యం అవుతుంది అనేది పక్కన పెడితే.. ఇలా నలుగురూ ఒకచోట కూర్చుని రాష్ట్రం గురించి మాట్లాడుకోవడం కూడా శుభపరిణామమే.

అయితే ప్రజల్లో మాత్రం.. పోరాటం అనేది లేకుండా నిజాలు తేలుస్తామంటున్న ఈ ప్రయత్నం ఈసురోమని పోతుందనే వెరపు ఉంది. దీనిపై ముద్రగడ కూడా ఇటీవల తిరుపతిలో కొన్ని విమర్శలు చేశారు. అయితే.. కాపు సామాజిక వర్గంలో గుర్తింపు తప్ప మరోటి అక్కర్లేదనుకునే ముద్రగడ.. తన కులానికే చెందిన పవన్ ను తప్పుపట్టడం అనేది ఆయన కు కులసహచరుల నుంచి నెగటివ్ స్పందన తెచ్చినట్లుంది. అందుకే దాన్ని కాస్త దిద్దుకుంటూ.. చంద్రబాబు తెర వెనుకనుంచి ఆడిస్తున్నట్లుగా ఆరోపణలు గుప్పిస్తున్నారు.

పవన్ ను ఫెయిల్యూర్ లీడర్ గా తేల్చేయడానికే.. ఇలాంటి ప్రయత్నాన్ని అతనితో చంద్రబాబు చేయిస్తున్నారనేది తాజాగా ముద్రగడ చేస్తున్న ఆరోపణ. రాష్ట్రానికి హోదా సాధించాలంటే జగన్ - పవన్ లాంటి వాళ్లు సరిపోరని.. ఒక్క చంద్రబాబునాయుడు నాయకత్వంలోని పోరాటం ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుందని ఆయన సన్నాయినొక్కులు నొక్కుతున్నారు. ఈ మాటల్లో వెటకారమే తప్ప.. మరో ఉద్దేశం లేదని అందరూ గ్రహిస్తున్నదే. తెలుగుదేశం ఎంపీలు - కేంద్రమంత్రులు రాజీనామా చేయాలని కూడా అంటున్నారు.

అయితే ట్విస్టు ఏంటంటే.. ‘పవన్ ను ఇప్పటికే భాజపాకు దూరం చేశారు. ప్యాకేజీ ఉద్యమాన్ని పవన్ మీద వేసి అతణ్ని బలిచేయొద్దు’’ అని చంద్రబాబుకు ముద్రగడ లేఖ రాశారు. మొత్తానికి ఫెయిల్యూర్ పవన్ కు వచ్చినా పాపం చంద్రబాబు ఖాతాలో వేయాలన్నట్లుగా ముద్రగడ స్ట్రాటెజీ భలేఉందే అని జనం అనుకుంటున్నారు.