Begin typing your search above and press return to search.

ఇవే.. ముద్రగడ దీక్ష తాజా అప్ డేట్స్

By:  Tupaki Desk   |   7 Feb 2016 9:18 AM GMT
ఇవే.. ముద్రగడ దీక్ష తాజా అప్ డేట్స్
X
కాపుల్ని బీసీల్లో చేర్చాలంటూ మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం గడిచిన మూడు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయనతో పాటు.. ముద్రగడ సతీమణి కూడా ఆమరణ దీక్ష చేస్తున్నారు. ఆదివారం ఉదయం నుంచి చోటు చేసుకున్న సంఘటనలు.. అనంతర పరిణామాలు చూస్తే..

= తాను చేస్తున్న ఆమరణ దీక్షను ముద్రగడ ఆదివారం కొనసాగించారు

= ముద్రగడ దంపతులకు వైద్య పరీక్షలు జరిపేందుకు వచ్చిన వైద్యుల్ని లోపలకు అనుమతించలేదు

= అప్పుడప్పడు తన ఇంటి తలుపులు వేసుకునే ముద్రగడ.. ఆదివారం కూడా ఆగ్రహంతో ఇంటి తలుపులు మూసేసుకున్నారు.

= దీక్ష మూడో రోజుకు చేరుకోవటంతో ముద్రగడ దంపతుల ఆరోగ్యం క్షీణించినట్లు చెబుతున్నారు.

= పరీక్షలకు వైద్యుల్ని అనుమతించకపోవటం.. తలుపులు వేసేసుకోవటంతో ముద్రగడ తమకు సహకరించాలని కోరుతున్నారు

= తలుపుల్ని బిడాయించుకోవటంతో తూర్పుగోదావరిజిల్లా జాయింట్ కలెక్టర్.. అదనపు ఎస్పీలు ముద్రగడ ఇంటికి చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు

= తాజాగా మీడియాతో మాట్లాడిన ముద్రగడ తాను జగమొండినని.. ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించే వరకూ తాను దీక్షను విరమించనని స్పష్టం చేశారు

= ఈ సందర్భంగా చంద్రబాబు ఆస్తులపై సంచలన వ్యాఖ్యలు చేశారు

= చంద్రబాబు ఆస్తులు రూ.2లక్షల కోట్లుగా ఆయన పేర్కొన్నారు. దీనిపై అధికార పార్టీ నేతలు ఖండించారు

= ఏటా చంద్రబాబు తన ఆస్తుల్ని ప్రకటిస్తున్నారని.. అలాంటిది బాబుపై ఆరోపణలు సరికాదని ఏపీ ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప అసంతృప్తి వ్యక్తం చేశారు

= మరోవైపు కాపు మంత్రులు తమ పదవులకు రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు

= ఇంకోవైపు ముద్రగడ దీక్షపై మంత్రి నారాయణ స్పందిస్తూ.. కాపులకు ఇచ్చిన హామీల్ని నెరవేర్చే చిత్తశుద్ధి తమ ప్రభుత్వానికి ఉందని.. రిజర్వేషన్ల అంశంపై జస్టిస్ మంజునాథ కమిషన్ ను నెల క్రితమే ఏర్పాటు చేశామని.. కాల పరిమితిని 9 నెలలుగా నిర్ణయించిన విషయాన్ని గుర్తు చేశారు. మరో 7 నెలల 23 రోజుల్లో నివేదిక రానున్న నేపథ్యంలో.. ముద్రగడ దయచేసి దీక్ష విరమించాలని కోరారు

= మరోవైపు కాపుల్ని బీసీల్లోకి చేరిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయంటూ రిజర్వేషన్ వర్గాల ఐక్య వేదిక రంగంలోకి దిగింది. తిరుపతిలో ఈ వేదికను ప్రారంభించిన ఆయా వర్గాల నేతలు.. బాబు సర్కారు కానీ కాపుల్ని బీసీల్లోకి చేరిస్తే ఏపీ సర్కారును కూలదోస్తామని హెచ్చరించారు

= ముద్రగడ దీక్ష నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరంలో కాపునేతలు ఆందోళనలు షురూ చేశారు. ఈ సందర్భంగా ఏపీ ఉప ముఖ్యమంత్రి ఫ్లెక్సీలు చించేసి దగ్థం చేయటం ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. అనంతరం కాపు మహిళలు పెద్ద సంఖ్యలో పి.గన్నవరం పోలీస్ స్టేషన్ ను ముట్టడించటంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి

= ముద్రగడ ఆమరణ నిరాహార దీక్ష నేపథ్యంలో గోదావరి జిల్లాల్లో టెన్షన్ నెలకొంది. తాజాగా మాజీ ఎంపీ హర్షకుమార్ ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ముద్రగడ దీక్షకు హర్షకుమార్ ఆందోళనకు దిగనున్నారన్న ముందస్తు సమాచారంతో ఆయన్ను హౌస్ అరెస్ట్ చేసినట్లు చెబుతున్నారు

= ముద్రగడ ఇంటి వద్ద ఏర్పాటు చేసిన భారీ బందోబస్తును ఏపీ సర్కారు సగం మినహాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. పెద్ద సంఖ్యలో బలగాల్ని నియమించటం ద్వారా దీక్షకు భారీ ప్రాధాన్యతను ఇచ్చినట్లు అవుతుందన్న భావనతో ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లుగా చెబుతున్నారు.

= ముద్రగడ దీక్ష నేపథ్యంలో విశాఖపట్నంలో కాపు సామాజిక వర్గానికి చెందిన మంత్రులతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు. ప్రత్యామ్నాయ మార్గాలపై మంతనాలు జరిపినట్లుగా తెలుస్తోంది.

= ఆమరణ దీక్ష చేస్తున్న ముద్రగడ వైద్యపరీక్షలకు వైద్యుల్ని అనుమతించటం లేదు. దీంతో.. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో వైద్యులు ఉండిపోయారు. ఈ పరిణామం ఏపీ ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది.