Begin typing your search above and press return to search.

పాద‌యాత్ర‌ను ఆపి హౌస్ అరెస్ట్ చేయ‌ట‌మా?

By:  Tupaki Desk   |   26 July 2017 6:55 AM GMT
పాద‌యాత్ర‌ను ఆపి హౌస్ అరెస్ట్ చేయ‌ట‌మా?
X
కొన్ని త‌ప్పులు అస్స‌లు చేయ‌కూడ‌దు. కాలం క‌లిసి వ‌చ్చే వేళ‌.. అంతా బాగానే ఉన్న‌ట్లు ఉంటుంది కానీ.. ఫ్యూచ‌ర్లో మాత్రం ఈ త‌ప్పులు శాపాలుగా మారి వెంటాడి వేధిస్తుంటాయి. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు అనుస‌రిస్తున్న కొన్ని విధ‌నాల విష‌యంలో ఈ మాట‌లు అక్ష‌ర స‌త్యాలుగా చెప్పాలి. ఈ రోజు కాపుల రిజ‌ర్వేష‌న్ల కోసం ముద్ర‌గ‌డ ఉద్య‌మ పంథాలోకి వెళ్ల‌టానికి.. పాద‌యాత్ర చేయ‌టానికి కార‌ణం ఎవ‌రు? అన్న ప్ర‌శ్న‌కు సూటి స‌మాధానం చెప్పాల్సి వ‌స్తే.. చంద్ర‌బాబు పేరే వ‌స్తుంది.

2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో కాపులను బీసీల జాబితాలో చేరుస్తామ‌ని.. తాము అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే కాపుల్ని బీసీలుగా చేస్తూ నిర్ణ‌యం తీసుకుంటామ‌ని హామీల మీద హామీలు ఇవ్వ‌టాన్ని మ‌ర్చిపోకూడ‌దు. ఎన్నిక‌ల వేళ ఇచ్చిన హామీని వెనువెంట‌నే కాకున్నా.. అధికారంలోకి వ‌చ్చి మూడేళ్లు పూర్తి అయిన త‌ర్వాత కూడా హామీని నెర‌వేర్చ‌క‌పోవ‌టం త‌ప్పు క‌దా? అన్న‌ది ప్ర‌శ్న‌.

ఇప్ప‌టికే ప‌లుమార్లు ఆందోళ‌న‌లు.. నిర‌స‌న‌లు చేయ‌టం.. దానికి ఏపీ స‌ర్కారు చిగురుటాకులా వ‌ణికిపోయి హామీ ఇవ్వ‌టాన్ని మ‌ర్చిపోకూడ‌దు. ఇన్ని జ‌రిగిన త‌ర్వాత కూడా కాపుల్ని బీసీల్లోకి చేరుస్తూ మాత్రం బాబు స‌ర్కారు నిర్ణ‌యం మాత్రం తీసుకోలేదు. దీంతో.. విసిగిపోయిన ముద్ర‌గ‌డ తాజాగా పాద‌యాత్ర చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు.

ముద్ర‌గ‌డ లాంటి నాయ‌కుడు పాద‌యాత్ర పేరుతో రోడ్డు మీద‌కు వ‌స్తే ఏపీ స‌ర్కారుకు ఎన్ని క‌ష్టాలు ఎదుర‌వుతాయో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. అందుకే పాద‌యాత్ర‌కు అనుమ‌తి లేదంటూ అడ్డుకోవ‌ట‌మే కాదు.. ఆయ‌న్ను హౌస్ అరెస్ట్ చేసి ఇంట్లోనే ఉంచేశారు. 24 గంట‌ల పాటు హౌస్ అరెస్ట్ చేస్తున్న‌ట్లుగా పోలీసులు ముద్ర‌గ‌డ‌కు నోటీసులు జారీ చేశారు.

అధికారంలో ఉన్న వేళ‌.. ఉద్య‌మాల్ని.. పాద‌యాత్ర‌ల్ని అడ్డుకుంటున్న చంద్ర‌బాబు.. రేపొద్దున తాను విప‌క్షంలో ఉన్న‌ప్పుడు ఇలాంటి ప‌రిస్థితి ఎదురైతే ఏమిట‌న్న‌ది ప్ర‌శ్న‌. విప‌క్షంలో ఉన్న‌ప్పుడు ఏదైనా స‌మ‌స్య మీద తాను కానీ త‌న పార్టీకి చెందిన నేత‌లు కానీ రోడ్ల మీద‌కు వ‌స్తామ‌ని చెబితే.. ఇప్ప‌టి త‌ర‌హాలోనే అప్పుడు అడ్డుకుంటే దాన్ని త‌ప్పు అన‌టానికి కూడా బాబుకు అవ‌కాశం ఉండ‌ద‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు. కొన్ని సంద‌ర్భాల్లో స్వ‌ల్ప‌కాలిక ప్ర‌యోజ‌నాల కోసం తీసుకునే నిర్ణ‌యాలు దీర్ఘ‌కాలం పాటు త‌ప్పులుగా వెంటాడ‌తాయ‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు. పోలీసుల ప‌హ‌రాతో ముద్ర‌గ‌డ పాద‌యాత్ర‌ను నిలువ‌రించిన వైనం కాపుల్లో మ‌రింత ఆగ్ర‌హాన్ని రాజేస్తుంద‌న్న అభిప్రాయాన్ని బాబు ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటే బాగుంటుంద‌న్న మాట వినిపిస్తోంది.