ఆ మాటలు జనం నమ్మితే బాబుకు ప్రమాదమే!

Wed Apr 11 2018 19:05:30 GMT+0530 (IST)

చంద్రబాబుకు ఓటు వేసినందుకు రాష్ట్రంలోని ప్రజలు సిగ్గు పడాలి.. నా ముందు చంద్రబాబు ఓ బచ్చా.. కాపులకు ద్రోహంచేశాడు.... ఊపిరి ఉన్నంత వరకూ ఎవ్వరూ తెలుగుదేశాన్ని నమ్మకూడదు.. పాదయాత్రలు చేయాలన్నా దీక్షలు చేయాలన్నా దేనికీ అనుమతులు ఇవ్వకుండా.. అరాచకపాలన సాగిస్తున్నారు...’’ ఈ విమర్శలన్నీ ఎవరు చేశారనే సంగతి తెలుసుకోవడానికంటె ముందు... ఆ విమర్శలను జనం నమ్మితే మాత్రం.. తెలుగుదేశం పార్టీకి సమాధి కట్టేస్తారేమో అని పలువురు భావిస్తున్నారు. ఇంతకూ ఈ మాటలు అన్నదెవరో తెలుసా.. కాపులకు చంద్రబాబు అన్యాయం చేస్తున్నాడంటూ ఛాన్సు దొరికినప్పుడెల్లా నిప్పులు చెరుగుతూ ఉండే ముద్రగడ పద్మనాభం. పైగా ఈ మాటలను ఆయన కాపు జేఏసీ సదస్సులోనే వెల్లడించడం విశేషం.కాపుల విషయంలో చంద్రబాబు ఎంత మాయ చేస్తున్నప్పటికీ.. కాపులకు రిజర్వేషన్లు అనే అంశాన్ని ఆయన చాలా తెలివిగా పక్కదారి పట్టించేశారనే మాట వాస్తవం. ఎందుకంటే.. కాపుల రిజర్వేషన్ల బిల్లుకు ఢిల్లీలో బ్రేకు పడిపోయింది. ఈలోగా కేంద్రంతో  మంతనాలు సాగించి.. పని చక్కబెట్టుకునేపాటి బంధాన్ని కూడా చంద్రబాబు తుంచేసుకున్నారు. ఇలాంటి నేపథ్యంలో తాను మాత్రం అన్ని రాజకీయ కార్యాలూ చక్కబెట్టుకుంటూ ఉన్నప్పటికీ... కాపుల హామీల విషయం వచ్చేసరికి.. రాష్ట్రమంతా ఇప్పుడు ప్రత్యేకహోదా తప్ప మరో అంశం టేకప్ చేసే ఉద్దేశం లేదన్నట్టుగా ఆయన బిల్డప్ ఇస్తున్నారు.

ఇలాంటప్పుడు.. కాపు జేఏసీ భేటీలో ముద్రగడ మాటలు ఇబ్బందికరమైనవే. వీటిని కాపు వర్గం అంతా విశ్వాసంలోకి తీసుకుంటే గనుక.. చంద్రబాబు మోసం చేస్తున్నారనే సంగతిని.. ముద్రగడ మాటలద్వారా వారు గ్రహిస్తే గనుక.. చంద్రబాబుకు వచ్చే ఎన్నికల్లో చిక్కులే అని పలువురు విశ్లేషిస్తున్నారు. కీలకమైన సామాజికవర్గ ఓటు బ్యాంకును ఆయన చేజేతులా దురం చేసుకున్నట్లే అవుతుందని ప్రజలు అనుకుంటున్నారు.