Begin typing your search above and press return to search.

బాబును గ‌ట్టిగా టార్గెట్ చేశారే!

By:  Tupaki Desk   |   17 Nov 2017 5:30 AM GMT
బాబును గ‌ట్టిగా టార్గెట్ చేశారే!
X
ఆచితూచి మాట్లాడ‌టం.. వివాదాల‌కు దూరంగా ఉండ‌టం సినిమా వాళ్ల‌కు ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఎవ‌రు అధికారంలో ఉంటే వారిని పిసికేసే త‌త్త్వం సినిమావాళ్ల‌కు ఎక్కువేన‌న్న భావ‌న చాలామందిలో వ్య‌క్త‌మ‌వుతూ ఉంటుంది. దీనికి త‌గ్గ‌ట్లే సినిమా ఫంక్ష‌న్లు న‌డుస్తుంటాయి. ఎవ‌రినైనా స‌రే ఇంద్రుడు.. చంద్రుడు అంటూ పొగిడేయ‌ట‌మే కానీ.. వారి త‌ప్పుల్ని క‌డిగేయ‌టం అస్స‌లు క‌నిపించ‌దు.

అవార్డుల్ని ప్ర‌క‌టించిన‌ప్పుడు కూడా త‌మ‌కు రాలేద‌న్న బాధ‌ను చెప్పుకోవ‌టం ఇప్ప‌టివ‌ర‌కూ చూశాం. కానీ.. ఆ బాధ‌ను సైతం చాలా పొందిగ్గా.. ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్న‌ట్లు ఉండేది. కానీ.. తాజా నందుల ప్ర‌క‌ట‌న విష‌యంలోసీన్ రివ‌ర్స్ అయ్యింది. ఎప్పుడు లేని రీతిలో సినిమా ఇండ‌స్ట్రీకి చెందిన ప‌లువురు తెర మీద‌కు వ‌చ్చారు. అవార్డుల ప్ర‌క‌ట‌న‌లో అన్యాయం జ‌రిగింద‌న్నారు.

న‌ల్ల‌మ‌లుపు బుజ్జి లాంటి నిర్మాత అయితే ఏకంగా అవార్డుల ప్ర‌క‌ట‌న‌లో కుల లాబీయింగ్ జ‌రిగిదంటూ భారీ బాంబునే పేల్చారు. క‌డుపు మండటంతోనే మీడియా ముందుకు వ‌చ్చాన‌ని.. గ‌తంలో ఎప్పుడూ బ‌య‌టకు రాలేద‌న్నారు. బండ్ల గ‌ణేశ్ మీడియా ముందుకు వ‌చ్చినా కుల లాబీయింగ్ మాట‌ను న‌మ్మ‌నంటూనే ప‌లు ప్ర‌శ్న‌లు సంధించి.. ప్ర‌భుత్వాన్ని త‌న‌దైన శైలిలో బోనులో నిల‌బెట్టే ప్ర‌య‌త్నం చేశారు.

తాను ఇలా బ‌య‌ట‌కు వ‌చ్చి మాట్లాడినంత మాత్రాన ఎలాంటి లాభం ఉండ‌ద‌ని తెలుస‌ని.. త‌న ఆవేద‌న‌ను వ్య‌క్తం చేయ‌టానికి.. ప్ర‌జ‌ల‌కు తెలియాల‌నే ఉద్దేశంతోనే తాను మాట్లాడుతున్న‌ట్లు చెప్పారు. ఎప్పుడూ నోరు విప్ప‌ని తాను నోరు విప్ప‌టానికి కార‌ణం.. మంచి సినిమాల‌కు అవార్డులు రాక‌పోవ‌ట‌మేన‌న్నారు.

ఇక‌.. ద‌ర్శ‌కుడు గుణ‌శేఖ‌ర్ తాను తీసిన రుద్ర‌మ‌దేవి సినిమాకు అవార్డులు రాక‌పోవ‌టంపై బాధ‌ను వ్య‌క్తం చేశారు. తానిప్పుడు ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించ‌టం ద్వారా మ‌రో మూడేళ్లు నంది అవార్డుల‌కు అప్లై చేయ‌టానికి అర్హ‌త కోల్పోతాన‌ని తెలిసి కూడా మీడియా ముందుకు వ‌చ్చి మాట్లాడుతున్న‌ట్లుగా గుణ‌శేఖ‌ర్ వ్యాఖ్యానించారు. నంది అవార్డులు త‌న‌కు కొత్త కాద‌ని..కానీ రుద్ర‌మ‌దేవికి నంది అవార్డుల విష‌యంలో అన్యాయం జ‌రిగింద‌న్నారు.

రుద్ర‌మ‌దేవికి ఏపీ స‌ర్కారు ప‌న్ను రాయితీ ఎందుకు ఇవ్వ‌లేద‌ని ప్ర‌శ్నించ‌ట‌మే కాదు.. గౌత‌మీ పుత్ర‌శాత‌క‌ర్ణి విష‌యంలో మాత్రం రాయితీ ఎలా ఇచ్చార‌ని ప్ర‌శ్నించ‌టం వ‌ల్లనే రుద్ర‌మ‌దేవి సినిమాకు అన్యాయం జ‌రిగింద‌ని సోష‌ల్ మీడియాలో చాలామంది అంటున్నార‌ని.. రుద్ర‌మ‌దేవి తెలంగాణ నాయ‌కురాలు కాద‌ని.. ఆమె తెలుగు నేల‌నంతా పాలించిన తెలుగు నాయ‌కురాల‌న్నారు.

ఇలా ఒక‌రిద్ద‌రో కాదు.. ప‌లువురు సినిమా ఇండ‌స్ట్రీకి చెందిన వారు నోరు విప్ప‌టం బాబు స‌ర్కారుకు ఇబ్బందిక‌రంగా మారింద‌ని చెప్పాలి. ఎప్పుడూ లేనిది మీడియా ముందుకు వ‌చ్చి ఇంత ధైర్యంగా ఎలా మాట్లాడుతున్నారు? ఏకంగా ప్ర‌భుత్వం మీద కుల ముద్ర వేసే సాహ‌సాన్ని బుజ్జి లాంటోళ్లు ఎలా చేయ‌గ‌లుగుతున్నార‌న్న ప్ర‌శ్న ఇప్పుడు అంద‌రి మ‌దిలో మెదులుతుంది. దీనికి ఇండ‌స్ట్రీకి సంబంధించిన కొంద‌రి మాట‌ల్లో చెప్పాలంటే.. ఇంత ధైర్యం వెనుక రాష్ట్ర విభ‌జ‌న ఉందంటున్నారు.

ఈ రోజు సినిమా ఇండ‌స్ట్రీకి ఏపీ స‌ర్కారుకు పెద్ద‌గా లింకులు లేవ‌ని.. సినిమాకు సంబంధించినంత‌వ‌ర‌కూ తెలంగాణ రాష్ట్ర‌మే ముఖ్య‌మ‌ని.. ఏపీలో సినిమాను విడుద‌ల చేయ‌ట‌మే త‌ప్పించి.. మ‌రింకేమీ సంబంధం లేదంటున్నారు.ఈ కార‌ణంతోనే ప్ర‌భుత్వం త‌మ‌కు చేసిన అన్యాయం గురించి ఓపెన్ గా చెప్పేస్తున్నార‌న్న మాట వినిపిస్తోంది.