Begin typing your search above and press return to search.

బాబు కథ కంచికి..మోత్కుపల్లి టీఆర్ ఎస్ కి..

By:  Tupaki Desk   |   22 May 2018 8:04 AM GMT
బాబు కథ కంచికి..మోత్కుపల్లి టీఆర్ ఎస్ కి..
X
తెలుగుదేశం పార్టీలో ఉండి నిండా మునిగిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులే.. చంద్రబాబు తర్వాత పార్టీలో సీనియర్ నేతల్లో ఒకడిగా ఉన్న మోత్కుపల్లి ఉమ్మడి ఏపీలో ఎన్నోసార్లు మంత్రిగా కూడా చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ ను పదునైన విమర్శలతో ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించారు. కానీ రాష్ట్రం విడిపోయాకే మోత్కుపల్లి కథ అడ్డం తిరిగింది. బీజేపీతో సాన్నిహిత్యంగా ఉన్న సమయంలో గవర్నర్ పదవి ఇస్తామని చంద్రబాబు ఇచ్చిన హామీ అటకెక్కింది. కనీసం రాజసభ్య సీటో - ఎమ్మెల్సీనే ఇద్దామన్న తెలంగాణలో బలం లేకపోవడంతో ఆ ఆశ తీరలేదు. ఇక మొన్నీ మధ్యే భువనగిరిలో జరిగిన మినీ మహానాడులో కూడా చంద్రబాబు నిర్లక్ష్యానికి నిరసనగా మోత్కుపల్లి పాల్గొనలేదు. ఆయన అనుచరులు దీనిపై మహానాడులో నిరసన తెలపడంతో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు రమణ ఈ వ్యవహారాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారట.. అయినా కూడా బాబు మోత్కుపల్లిని పట్టించుకోలేదట.. కనీసం పిలుపు కూడా రాకపోవడంతో మోత్కుపల్లి టీడీపీకే దూరంగా జరిగారు..

*ఆ ఒక్కమాటే చంద్రబాబుకు దూరం జరిపింది..

తెలంగాణలో టీడీపీ పరిస్థితి రోజురోజుకు తీసికట్టుగా తయారవుతోంది.. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి రాజీనామా పూర్తిగా ఢీలా పడ్డ పార్టీ తెలంగాణలో రోజురోజుకు ఉనికే లేకుండా పోతోంది. ఈ నేపథ్యంలోనే పార్టీని బతికించుకునేందుకు టీఆర్ ఎస్ లో విలీనం చేయాలని గత మార్చి 18న మోత్కుపల్లి వ్యాఖ్యానించారు. టీఆర్ ఎస్ అంటేనే పడని చంద్రబాబు.. మోత్కుపల్లి వ్యాఖ్యలకు హర్ట్ అయి అప్పటి నుంచి మోత్కుపల్లిని దూరంగా పెట్టారు. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్న మోత్కుపల్లిని హైదరాబాద్ లో నిర్వహించిన సమావేశానికి చంద్రబాబు పిలవకపోవడం చర్చనీయాంశమైంది. దీనిపై సీరియస్ అయిన మోత్కుపల్లి టీఆర్ ఎస్ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు..

*వచ్చేనెలలోనే టీఆర్ ఎస్ లోకి..

కొంతకాలంగా టీడీపీలో అవమానాలు ఎదుర్కొంటున్న మోత్కుపల్లి ఎట్టకేలకు వచ్చేనెలలోనే టీఆర్ ఎస్ లో చేరబోతున్నట్టు తెలిసింది. ఈ నెలఖారులోగా జిల్లాస్థాయిలో టీడీపీ - కార్యకర్తలు - అనుచరులతో సమావేశమై.. టీఆర్ ఎస్ లో చేరికకు ప్రణాళికలు తయారు చేస్తున్నారని తెలిసింది. పంచాయతీ ఎన్నికలకు ముందే టీఆర్ ఎస్ లో చేరబోతున్నట్టు తెలిసింది. ఇప్పటికే పలుమార్లు టీఆర్ ఎస్ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు - తలసాని శ్రీనివాస్ యాదవ్ లు మోత్కుపల్లిని కలిసి టీఆర్ ఎస్ లోకి ఆహ్వానించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో టీడీపీలో ఉండి అవమానాలు భరించే కంటే టీఆర్ ఎస్ లో చేరడమే మేలని అనుచరులు మోత్కుపల్లిని కోరుతున్నట్లు తెలిసింది.

టీఆర్ ఎస్ లో చేరాక వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆలేరు నుంచి పోటీచేయడానికి మోత్కుపల్లి ఆసక్తి చూపుతున్నట్టు తెలిసింది.. అయితే తుంగతుర్తి అసెంబ్లీ - వరంగల్ ఎంపీ సీటుల్లో ఏదో ఒకటి ఆయనకు ఇచ్చేందుకు టీఆర్ ఎస్ అధిష్టానం నిర్ణయించినట్టు తెలిసింది..