Begin typing your search above and press return to search.

బాబు గాడ్సే కంటే దుర్మార్గుడు: మోత్కుపల్లి

By:  Tupaki Desk   |   12 July 2018 1:54 PM GMT
బాబు గాడ్సే కంటే దుర్మార్గుడు: మోత్కుపల్లి
X
ఏపీ ముఖ్య‌మంత్రి - టీడీపీ ర‌థ‌సార‌థి నారా చంద్ర‌బాబు నాయుడుపై టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు మ‌రోమారు మండిప‌డ్డారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంత‌రం మీడియాతో మాట్లాడుతూ సంచ‌ల‌న కామెంట్లు చేశారు. చంద్రబాబు ఆధర్మంపై మోత్కుపల్లి ధర్మపోరాటం పేరుతో బుధవారం ఆయన తిరుపతి నుంచి తిరుమలకు పాదయాత్ర చేపట్టారు. ఈ యాత్ర గురించి - త‌న భ‌విష్య‌త్ గురించి ఆయ‌న వివ‌రించారు.ఆవిర్భావం నుంచి టీడీపీ బలోపేతానికి కృషి చేసిన బలవంతంగా సాగనంపారన్నారు. చంద్రబాబు పాపాలను శ్రీవారికి వివరించేందుకు తాను తిరుపతికి వచ్చినట్లు చెప్పారు. చంద్రబాబు పెట్టిన బాధలతో తన రాజకీయ జీవితం నాశనమైందన్నారు. తాను శ్రీవారిని వ్యక్తిగతంగా ఏమీ కావాలని కోరుకోలేదన్నారు. ఎవరి హస్తాల నుంచి రాష్ట్రాన్ని కాపాడాలని ఎన్టీఆర్ కోరుకున్నారో.. అదే విషయాన్ని శ్రీవారికి తెలియజేశానని మోత్కుపల్లి అన్నారు. ఎన్టీఆర్ చనిపోయే ముందు తన మనసులో ఉన్న మాటను తనకు చెప్పారన్నారు. అదే నెరవేర్చమని వెంకటేశ్వరస్వామిని కోరుకున్నట్లు నర్సింహులు మీడియాకు చెప్పారు. మహాత్మాగాంధీని హత్యచేసిన గాడ్సే కంటే దారుణమైన వ్యక్తి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అని విరుచుకుప‌డ్డారు.

చంద్ర‌బాబు త‌న‌ను రాజ‌కీయంగా వాడుకొని వ‌దిలేశార‌ని మోత్కుప‌ల్లి ఆరోపించారు. తెలంగాణలో తనను అడ్డం పెట్టుకొని చంద్రబాబు బతికాడని ఆవేదన వ్యక్తం చేశారు. తాను పెద్ద మాదిగ అని చెప్పిన చంద్రబాబు నోటివెంట దళితుల మాటే లేదన్నది నిజం కాదా అని ప్రశ్నించారు. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అప్పటి టీడీపీ నేత రేవంత్‌ రెడ్డికి డబ్బులిచ్చి పంపింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. ఓటుకు కోట్ల కేసులో ఇద్దరు ఉన్నారు కాబట్టి పార్టీ నుంచి రేవంత్‌ను సస్పెండ్‌ చేయలేదని మోత్కుప‌ల్లి పేర్కొన్నారు. ``రేవంత్‌ పై ఎందుకు చర్యలు తీసుకోలేదు నేను మాదిగ వ్యక్తినని నా మీద చర్యలు తీసుకున్నార‌నే విష‌యాన్ని చంద్ర‌బాబు వెల్ల‌డించాలి`` అని మోత్కుప‌ల్లి డిమాండ్ చేశారు. అన్నా క్యాంటీన్లను ప్రారంభించ‌డం వెనుక చంద్ర‌బాబు స్వార్థ ఎత్తుగ‌డ ఉంద‌ని మోత్కుప‌ల్లి ఆరోపించారు. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబుకు ఎన్టీఆర్‌ గుర్తురారని - నందమూరి కుటుంబం చంద్రబాబు చుట్టు తిరగాల్సిన పరిస్థితి తలెత్తిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం ప్రతిపక్షంలో ఉన్నప్పుడే చంద్రబాబుకు ఎన్టీఆర్‌ బొమ్మ గుర్తొస్తుందని ఎద్దేవా చేశారు.

ఏపీలో ప్ర‌స్తుతం కాపులు - బీసీల మధ్య చంద్రబాబు చిచ్చుపెట్టి పబ్బం గడుపుతున్నారని మోత్కుప‌ల్లి విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో ఓటు వేయకుండా చంద్రబాబుకు ఏపీ ప్రజలే బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. తనకు ఎవరి సపోర్ట్ లేదని, అందరికీ నేనే సపోర్ట్ చేస్తున్నానని చెప్పారు. చంద్ర‌బాబుకు సంబంధించిన పార్టీ నేత‌లు త‌న‌పై విమ‌ర్శ‌లు చేయ‌డం కంటే ముందు బాబు చేస్తున్న రాజ‌కీయాల గురించి ఆలోచించుకోవాల‌ని మోత్కుప‌ల్లి కోరారు.