Begin typing your search above and press return to search.

2017లో జ‌నం దృష్టిని ఆక‌ర్షించిన నేతాశ్రీలు వీరే!

By:  Tupaki Desk   |   27 Dec 2017 5:36 PM GMT
2017లో జ‌నం దృష్టిని ఆక‌ర్షించిన నేతాశ్రీలు వీరే!
X
ఇంకో మూడు రోజులుంటే... 2017 కాలంలో క‌లిసిపోతుండ‌గా, కొత్త ఆశ‌ల‌తో, కొత్త ఆశ‌యాల‌తో 2018 మ‌న ముందుకు వ‌చ్చేస్తోంది. 2018కి స్వాగ‌తం ప‌లుకుతూ జాతీయ రాజ‌కీయ పార్టీలు కొత్త వ్యూహాల‌ను సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ సంగ‌తి ఎలా ఉన్నా... గ‌తించిపోతున్న 2017లో మ‌న నేతాశ్రీ‌ల వ్వ‌వ‌హారాల‌ను ఓ సారి గుర్తుకు తెచ్చుకోవ‌డం స‌ర్వ‌సాధార‌ణ‌మే క‌దా. ఆ కోణంలోనే జాతీయ రాజ‌కీయాల్లో త‌మ‌కంటూ ఓ ప్ర‌త్యేక స్థానాన్ని సంపాదించుకున్న నేత‌లెవ‌ర‌న్న విష‌యాన్ని ఓ సారి ప‌రిశీలించుకుందాం. 2014లో జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల త‌ర్వాత జాతీయ పార్టీలైన కాంగ్రెస్ - బీజేపీలు ఎప్ప‌టిక‌ప్పుడు ఎత్తులు - పై ఎత్తుల‌తో ర‌స‌వ‌త్త‌ర రాజకీయాల‌ను న‌డిపాయి. అదే స‌మ‌యంలో త‌మిళ‌నాడు - బీహార్‌ - ఉత్త‌ర‌ప్ర‌దేశ్ వంటి రాష్ట్రాల్లో చోటుచేసుకున్న రాజ‌కీయ ప‌రిణామాలు కూడా మ‌న‌కు చాలా ఆస‌క్తిని రేకెత్తించాయి.

మొత్తంగా చూస్తే కాంగ్రెస్ పార్టీలో ఇటీవ‌ల చోటుచేసుకున్న అధికార మార్పిడిని ప్ర‌ధానంగా ప్ర‌స్తావించుకోవాలి. మొన్న‌టిదాకా పార్టీ ఉపాధ్య‌క్షుడిగా ఉన్న రాహుల్ గాంధీ... ఇప్పుడు పార్టీ అధ్య‌క్ష బాధ్య‌త‌ల‌ను చేప‌ట్టేశారు. అదే స‌మ‌యంలో గ్రాండ్ ఓల్డ్ పార్టీకి 19 ఏళ్ల పాటు అధ్య‌క్షురాలిగా కొన‌సాగిన ఆ పార్టీ మాజీ అధ్య‌క్షురాలు సోనియా గాంధీ అత్య‌ధిక కాలం పార్టీ అధ్య‌క్షురాలిగా కొన‌సాగిన రికార్డును నెల‌కొల్పారు. ఇక త‌మిళ నాట జ‌య‌ల‌లిత మృతితో ఏర్ప‌డ్డ రాజ‌కీయ శూన్యం నేప‌థ్యంలో ఆ రాష్ట్రంలో లెక్క‌లేన‌న్ని మ‌లుపులు చోటుచేసుకున్నాయి. ఇక ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల‌ను తీసుకుంటే... అప్ప‌టిదాకా సీఎంగా కొన‌సాగిన అఖిలేశ్ యాద‌వ్‌... ఎన్నిక‌ల్లో ఓట‌మితో ప‌ద‌వి దిగిపోగా... కొత్త‌గా బీజేపీ నేత యోగి ఆదిత్య‌నాథ్ సీఎంగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టారు. మ‌రోవైపు దాణా స్కాంలో నిందితుడిగా ఉన్న ఆర్జేడీ అధినేత లాలూ ప్ర‌సాద్ యాద‌వ్‌.. ఆ కేసులో దోషిగా తేలి శ్రీ‌కృష్ణ జ‌న్మ‌స్థానానికి వెళ్ల‌క త‌ప్ప‌లేదు. ఇలా 2017 మొత్తంలో జనం దృష్టిని బాగా ఆక‌ట్టుకున్న నేత‌లుగా ఎవ‌రెవ‌రు ఉన్నార‌న్న విష‌యాన్ని ఓ సారి అవ‌లోక‌నం చేసుకుందాం ప‌దండి.

1. సోనియా గాందీ...

2017లో జాతీయ రాజ‌కీయాల‌ను ప్ర‌స్తావించుకుంటే ముందుగా సోనియా గాంధీ పేరునే ప్ర‌స్తావించుకోవాలి. 130 ఏళ్ల‌కు పైగా చ‌రిత్ర క‌లిగిన కాంగ్రెస్ పార్టీకి అత్య‌ధిక కాలం (19 ఏళ్లు) అధ్య‌క్షురాలిగా కొన‌సాగిన సోనియా గాంధీ స‌రికొత్త రికార్డును త‌న పేరిట లిఖించుకున్నారు. అయితే ఈ ఏడాది ప్ర‌థ‌మార్థంలో జరిగిన ఉత్త‌ర‌ప్ర‌దేశ్ స‌హా ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల ప్ర‌చారం సంద‌ర్భంగా తీవ్ర అనారోగ్యానికి గురైన సోనియా గాంధీ.. ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకునే దిశ‌గా అడుగులు వేశార‌నే చెప్పాలి. పార్టీ ప‌గ్గాల‌ను త‌న కుమారుడు, పార్టీ ఉపాధ్య‌క్షుడిగా ఉన్న రాహుల్ గాంధీకి అప్పగించేసి రెస్ట్ తీసుకుందామ‌న్న భావ‌న‌తో సుదీర్ఘ కాలం పాటు యోచించిన సోనియా... ఎట్ట‌కేల‌కు మొన్న ఆ ప‌ని చేసేశారు. అయితే రెస్ట్ తీసుకుందామ‌నుకున్న ఆమె వాద‌న మాత్రం నిజం కాలేక‌పోయింది. తాను రాజ‌కీయాల్లో నుంచి త‌ప్పుకుంటాన‌ని సోనియా ప్ర‌క‌టించినా... ఆ మ‌రుక్ష‌ణ‌మే రంగంలోకి దిగిన పార్టీ సీనియ‌ర్లు.. సోనియా అస్త్ర‌స‌న్యాసం చేయ‌డం లేద‌ని చెప్ప‌డంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ సోనియా త‌న సొంత నియోజక‌వ‌ర్గం రాయ్‌బ‌రేలీలో బ‌రిలో దిగ‌క త‌ప్ప‌డం లేదు.

2. రాహుల్ గాంధీ...

సోనియా గాంధీ త‌ర్వాత జాతీయ రాజ‌కీయాల్లో బాగా చ‌ర్చ‌కు వ‌చ్చిన పేరు ఏద‌న్నా ఉందంటే... అది కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్య‌క్షుడిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన రాహుల్ గాంధీదేన‌ని చెప్పాలి. మూడేళ్ల పాటు పార్టీ ఉపాధ్య‌క్షుడి హోదాలో ఉన్న రాహుల్ గాంధీ పార్టీ అధ్య‌క్షుడిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేపడుతున్నారంటూ చాలా కాలం నుంచి ప్ర‌చారం సాగినా... ఇటీవ‌లే ఆ మాట నిజ‌మైపోయింది. స‌రిగ్గా గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారంలో రాహుల్ బిజీబిజీగా ఉన్న స‌మ‌యంలో ఆయ‌న‌కు పార్టీ ప‌గ్గాలు అప్ప‌గించాల్సిందేనంటూ పార్టీ అధిష్ఠానం తీర్మానించేసింది. అందుక‌నుగుణంగానే రోజుల వ్య‌వ‌ధిలోనే రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టారు. ఇదే స‌మ‌యంలో గ‌తంలో అంత‌గా ప్ర‌భావం చూపే నేత‌గా రాహుల్ క‌నిపించ‌కున్నా... గుజ‌రాత్ ఎన్నిక‌ల పుణ్య‌మా అని ఆయ‌న ఓ ప‌రిణ‌తి సాధించిన నేత‌గా కొత్త అవ‌తారం ఎత్తారు. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీపై త‌న‌దైన శైలిలో విరుచుకుప‌డుతున్న రాహుల్‌... ఇటీవ‌లి కాలంలో వ్యంగ్యాస్త్రాల‌తోనూ బీజేపీని ఓ ఆటాడుకుంటున్నార‌నే చెప్పాలి.

3. వెంక‌య్య‌నాయుడు...

తెలుగు నేల‌కు చెందిన ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు... రాష్ట్ర రాజ‌కీయాల కంటే కూడా జాతీయ రాజ‌కీయాల‌కే ప్రాధాన్యం ఇస్తూ వ‌చ్చిన విష‌యం తెలిసిందే. బీజేపీలో సీనియ‌ర్ నేత‌గా ఉన్న వెంక‌య్య‌... ఇటీవ‌లే ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకోక త‌ప్ప‌లేదు. త‌న‌కు ఇష్టం లేక‌పోయినా కూడా బీజేపీ అధిష్ఠానం మాట‌ను దిక్క‌రించేందుకు స‌సేమిరా అన్న వెంక‌య్య యాక్టివ్ పాలిటిక్స్‌కు స్వ‌స్తి చెప్పేసి... భార‌త ఉప రాష్ట్ర‌ప‌తిగా ఇటీవ‌లే ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టారు. తొలుత భార‌త రాష్ట్ర‌ప‌తిగా వెంక‌య్య నాయుడు ఎన్నిక కానున్నార‌న్న ప్ర‌చారం జ‌రిగినా... పార్టీ అధిష్ఠానం మాత్రం ఆయ‌న‌ను ఉప‌రాష్ట్రప‌తి ప‌ద‌వికి మాత్ర‌మే ప‌రిమితం చేసేసింది. బీజేపీ అధిష్ఠానం తీసుకున్న నిర్ణ‌యం... జాతీయ రాజ‌కీయాల్లో ఓ క్రియాశీల నేత‌ను ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పించేలా చేసింద‌న్న వాద‌న వినిపించింది. ఉప‌రాష్ట్రప‌తిగా ఎన్నిక కాక‌ముందు ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ కేబినెట్ లో కీల‌క శాఖ‌ల మంత్రిగా ఉన్న వెంక‌య్య‌నాయుడు... బీజేపీ స‌ర్కారును చాలా క్లిష్ట స‌మస్య‌ల నుంచి బ‌య‌ట‌ప‌డేసిన నేత‌గా పేరుంది.

4. యోగీ ఆదిత్య‌నాథ్...

క‌ర‌డుగ‌ట్టిన హిందూత్వ వాదిగానే కాకుండా... త‌న పేరులోని యోగికి ఏమాత్రం తీసిపోని విధంగా పూజ‌లు, హోమాలు నిర్వ‌హించే బీజేపీ నేత‌గా, ఆ పార్టీ ఎంపీగా మ‌న‌కు చిర‌ప‌ర‌చితులైన యోగీ ఆదిత్మ‌నాథ్... ఈ ఏడాది మార్చిలో అనూహ్య ప‌రిణామాల మ‌ధ్య ఉత్త‌ర‌ప్ర‌దేశ్ సీఎంగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టారు. అప్ప‌టికే ఐదు ప‌ర్యాయాలు ఎంపీగా ఎన్నికైన యోగీ... పార్టీ అధిష్ఠానం తీసుకున్న నిర్ణ‌యంతో యూపీ సీఎంగా మారిపోయారు. ఆ త‌ర్వాతే.. ఆయ‌న ఎంపీ ప‌ద‌వికి రాజీనామా చేశారు. ఎంపీగా ఉన్న స‌మ‌యంలో ఎంత‌గా వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారో, సీఎంగా అయిన త‌ర్వాత కూడా యోగీ త‌న‌దైన మార్కు పాల‌న‌తో వార్త‌ల్లో వ్య‌క్తిగా నిలిచార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. అయోధ్య‌లో రామ మందిరం నిర్మాణ‌మే ల‌క్ష్యంగా బీజేపీ అధిష్ఠానం యోగిని యూపీ సీఎంగా కూర్చోబెట్టింద‌న్న వాద‌న కూడా లేక‌పోలేదు. ఏదేమైనా అస‌లు ఏమాత్రం అంచ‌నాలు లేకుండా ఉన్న ఎంపీగా ఉన్న యోగీ... ఒక్క‌సారిగా యూపీ సీఎంగా మారిపోవ‌డం నిజంగానే సంచ‌ల‌నం అయ్యింది.

5. లాలూ ప్ర‌సాద్ యాద‌వ్...

బీహార్ రాజ‌కీయాల్లోనే కాకుండా జాతీయ రాజ‌కీయాల్లోనూ త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు సంపాదించుకున్న నేత‌గా ఆర్జేడీ అధినేత లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ పేరున‌ను ప్ర‌స్తావించుకోవాలి. బీహార్ సీఎంగా ఉన్న కాలంలో వెలుగు చూసిన దాణా కుంభ‌కోణంలో ప్ర‌ధాన ముద్దాయిగా ఉన్న లాలూ... ఇప్ప‌టికే ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల‌కు దూర‌మైపోక త‌ప్ప‌లేదు. అయితే ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల బ‌రి నుంచి మాత్ర‌మే త‌న‌ను త‌రిమేయ‌గ‌ల‌రు గానీ.. తెర వెనుక ఉండి తానే మొత్తం క‌థ న‌డిపిస్తాన‌ని చెప్పిన లాలూ... ఈ ఏడాది ప్ర‌థ‌మార్ధంలో జ‌రిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో చ‌క్రం తిప్పారు. ఆర్జేడీ, జేడీయూ కూటిమికి విజ‌యం సాధించి పెట్ట‌డంతో పాటుగా జేడీయూ నేత నితీశ్ కుమార్‌ను ముచ్చ‌ట‌గా మూడో ప‌ర్యాయం సీఎం కుర్చీ ఎక్కించేశారు. త‌న ఇద్ద‌రు కుమారుల‌ను నితీశ్ కేబినెట్‌లో కీల‌క మంత్రులుగా చేశారు. అయితే ఓ నాలుగు రోజుల క్రితం దాణా స్కాంపై విచార‌ణ చేప‌ట్టిన సీబీఐ ప్ర‌త్యేక కోర్టు సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది. దాణా స్కాంలో ప్ర‌ధాన ముద్దాయిగా ఉన్న లాలూను కోర్టు దోషిగా తేల్చేయ‌డంతో ఇప్పుడు లాలూ జైలుకు వెళ్లిపోయారు.

6. నితీశ్ కుమార్‌...

లాలూ ప్ర‌సాద్ సొంత రాష్ట్రం బీహార్‌కే చెందిన నితీశ్ కుమార్ ఈ ఏడాది ప్ర‌థ‌మార్ధంలో హ్యాట్రిక్ సీఎంగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టారు. లాలూతో పాటు కాంగ్రెస్‌తో జ‌ట్టు క‌ట్టి ఎన్నిక‌ల‌కు వెళ్లిన నితీశ్... బంప‌ర్ మెజారిటీతో అధికారాన్ని చేజిక్కించుకున్నారు. ఇంత‌దాకా బాగానే ఉన్నా... జాతీయ రాజ‌కీయాల్లో అటు కాంగ్రెస్‌, ఇటు బీజేపీలు కాకుండా... ఈ రెండు పార్టీల కూట‌ముల‌కు ప్ర‌త్యామ్నాయంగా థ‌ర్డ్ ఫ్రంట్ ఏర్పాటు త‌థ్య‌మ‌న్న భావ‌న‌ను ప‌టాపంచ‌లు చేస్తూ... నితీశ్... కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పంచ‌న చేరిపోయారు. ఈ దెబ్బ‌తో థ‌ర్డ్ ఫ్రంట్ ఆశ‌లు గ‌ల్లంతు కాగా... అస‌లు కేంద్రంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ పోటీ కాంగ్రెస్‌, బీజేపీల మ‌ధ్యే జ‌రుగుతుంద‌న్న భావ‌న‌కు ఆయ‌న పునాది వేసిన‌ట్లైంది. మొత్తంగా ఓ రాష్ట్రానికి సీఎంగా ఉన్న నితీశ్ దేశ రాజ‌కీయాల‌ను తీవ్రంగా ప్ర‌భావితం చేసేలా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

7. రామ్‌ నాథ్ కోవింద్...

భార‌త రాష్ట్ర‌ప‌తిగా ఈ ఏడాదిలో ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన ద‌ళిత నేత రామ్ నాథ్ కోవింద్ కూడా వార్త‌ల్లో వ్య‌క్తిగా నిలిచార‌నే చెప్పాలి. బీహార్ గ‌వ‌ర్న‌ర్‌గా ఉన్న రామ్ నాథ్ ను రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో ఎన్డీఏ త‌న అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించేసింది. దీంతో బీహార్ సీఎంగా ఉన్న నితీశ్ కుమార్‌... త‌న‌కు ఇష్టం లేక‌పోయినా... బీజేపీతో చేతులు క‌ల‌పక త‌ప్ప‌లేద‌న్న వాద‌న వినిపించింది. ఎన్నిక‌ల్లో బంప‌ర్ మెజారిటీ సాధించిన రామ్ నాథ్ కోవింద్ ఇటీవ‌లే భార‌త రాష్ట్ర‌ప‌తిగా పద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టారు. మృదు స్వ‌భావిగా పేరున్న రామ్ నాథ్ రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల ప్ర‌చారంలో త‌న‌దైన శైలిలో ముందుకు సాగారు. అప్ప‌టిదాకా ఏ ఒక్క‌రూ చేయ‌ని విధంగా వివిధ రాష్ట్రాలు తిరిగిన కోవింద్ త‌న‌కు ఓటేయాల‌ని ఆయా పార్టీల అధినేత‌ల‌ను అభ్యర్థించారు.

8. వీఎస్ శ‌శిక‌ళ‌ - టీవీవీ దిన‌క‌ర‌న్‌....

త‌మిళ‌నాడు దివంగ‌త సీఎం జ‌య‌ల‌లిత మ‌ర‌ణంతో ఒక్క‌సారిగా జాతీయ స్థాయి మీడియాలో ప‌తాక శీర్షిక‌ల‌కు ఎక్కిన నేత‌గా జ‌య నెచ్చెలి వీఎస్ శ‌శిక‌ళను చెప్పుకోవాలి. జ‌య చేతుల క‌ష్టం మీద వ‌చ్చిన అధికారాన్ని జ‌య మ‌ర‌ణానంత‌రం త‌న చేతుల్లోకి తీసుకునేందుకు విశ్వ య‌త్నాలు చేసిన శ‌శిక‌ళ‌... చివ‌ర‌కు త‌న క‌ల తీర‌కుండానే జైలు పాలు కావాల్సి వ‌చ్చింది. బీజేపీ ఆడిన నాట‌కం కార‌ణంగానే శశిక‌ళ‌కు ఈ దుస్థితి త‌ప్ప‌లేద‌న్న వాద‌న కూడా వినిపిస్తోంది. ఇక‌ శ‌శిక‌ళ బంధువుగా... అన్నాడీఎంకే చీలిక వ‌ర్గానికి చెందిన నేత‌గా టీవీవీ దిన‌క‌ర‌న్ ఇప్పుడు జాతీయ స్థాయి రాజ‌కీయాల‌ను ఇట్టే ఆక‌ర్షించారు. జ‌య మృతి కార‌ణంగా ఖాళీ అయిన ఆర్కే న‌గ‌ర్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి ఇటీవ‌ల జ‌రిగిన ఉప ఎన్నిక‌లో... గ‌తంలో జ‌య‌కు వ‌చ్చిన మెజారిటీ కంటే కూడా అధిక ఓట్లు సాధించిన దిన‌క‌ర‌న్ త‌న ప‌ట్టును నిల‌బెట్టుకున్నార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. అస‌లు జాతీయ పార్టీల‌కు త‌మిళ‌నాట చోటే లేద‌ని కూడా దిన‌క‌ర‌న్ త‌న విజ‌యంతో చెప్పేసిన‌ట్లుగా విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. అయితే ఉప ఎన్నిక‌లో డ‌బ్బును నీళ్ల‌లా ఖ‌ర్చు చేసిన నేత‌గా, ఓ ప‌ర్యాయం విడుద‌లైన ఎన్నిక‌ల నోటిఫికేష‌న్‌ను ర‌ద్ద‌య్యేలా చేసిన నేత‌గా దిన‌కర‌న్ అప‌ఖ్యాతిని మూట‌గ‌ట్టుకున్నారు.

9. అరుణ్ జైట్లీ...

న‌రేంద్ర మోదీ స‌ర్కారు అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత తీసుకున్న అతి పెద్ద నిర్ణ‌యం పెద్ద నోట్ల ర‌ద్దే అయిన‌ప్ప‌టికీ... అంత‌కంటే పెద్ద నిర్ణ‌యంగా గూడ్స్ అండ్ స‌ర్వీస్ ట్యాక్స్‌(జీఎస్టీ)గా చెప్పుకోవాలి. ఎందుకంటే... పెద్ద నోట్ల ర‌ద్దు ప్ర‌భావం అప్ప‌టిక‌ప్పుడే జ‌నాల‌పై త‌న ప్ర‌భావాన్ని చూపించేసింది. ఆ తర్వాత కాస్త లేటైనా మ‌ళ్లీ నోట్ల ఇబ్బందులు లేకుండా పోయాయి. అయితే జీఎస్టీ అలా కాదు. దేశ‌వ్యాప్తంగా అన్ని సేవ‌లు, వ‌స్తువుల‌పై ఒక‌టే త‌ర‌హా ప‌న్ను అన్న నినాదాన్ని భుజానికెత్తున్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఆ క‌ఠిన‌మైన ప‌న్నుల చ‌ట్టాన్ని పార్ల‌మెంటులో ప్ర‌వేశ‌పెట్టారు. అస‌లు దేశ ఆర్థిక రంగ చ‌రిత్ర‌నే మార్చివేసే ప‌న్నుల విధానంగా పేరున్న జీఎస్టీ ప్ర‌వేశానికి ముందు... దానికి సంబంధించిన క‌స‌ర‌త్తులో జైట్లీ నిండా మునిగిపోయారు కూడా. జీఎస్టీ విధానంలో ఏమాత్రం తేడా వ‌చ్చినా కూడా ఆ ప్ర‌భావం మొత్తం మోదీ స‌ర్కారుపై డైరెక్ట్‌గా ప‌డిపోతుంది. ఇదే విష‌యాన్ని గ‌మ‌నించిన మోదీ కూడా ప‌నిలో రాక్ష‌సుడిలా ప‌నిచేసే జైట్లీ మీదే ఆ భారాన్ని వేశారు. మోదీ అనుకున్న‌ట్లుగానే ప‌నిచేసిన జైట్లీ కూడా జీఎస్టీ రూప‌క‌ల్ప‌న‌లో గానీ, పార్ల‌మెంటులో బిల్లు ప్ర‌వేశ‌పెట్ట‌డంలో గానీ, ఆ త‌ర్వాత స‌ద‌రు ప‌న్నుల చ‌ట్టానికి స‌వ‌ర‌ణ‌లు చేసే విష‌యంలో గానీ ప‌క్కాగా వ్య‌వ‌హ‌రిస్తున్న జైట్లీ... నిజంగానే ఈ ఏడాది జ‌నం దృష్టిని ఆక‌ర్షించిన కీల‌క నేత‌గా చెప్పుకోవ‌చ్చు.

10. ర‌జ‌నీ - క‌మ‌ల్‌...

త‌మిళ‌నాడు దివంగ‌త సీఎం జ‌య‌ల‌లిత మ‌ర‌ణంతో ఆ రాష్ట్రంలో ఏర్ప‌డ్డ రాజ‌కీయ శూన్య‌త‌ను క్యాష్ చేసుకునేలా రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధ‌మైపోయిన సినీ న‌టులుగా ర‌జ‌నీకాంత్‌, క‌మ‌ల్ హాస‌న్‌లు జాతీయ మీడియాలో బాగానే ప్ర‌చారంలోకి వ‌చ్చేశారు. ఇప్ప‌టికే రాజ‌కీయాల్లోకి వ‌చ్చేశానంటూ క‌మ‌ల్ హాస‌న్ ప్ర‌క‌టించి...అన్ని పార్టీల‌కు కంటి మీద కునుకు లేకుండా చేసేశార‌నే చెప్పాలి. అయితే ఎందుక‌నో గానీ... ఇటీవ‌ల క‌మ‌ల్ మౌనం పాటిస్తున్నారు. ఇక ర‌జ‌నీ విష‌యానికి వ‌స్తే... అప్పుడెప్పుడో త‌న అభిమానుల‌తో ఫొటో సెష‌న్ అంటూ హ‌డావిడి చేసేసిన ర‌జ‌నీ... మ‌ళ్లీ ఇప్పుడు అదే త‌ర‌హాలో ఫ్యాన్స్‌తో ఫొటో సెష‌న్‌లో మునిగిపోయారు. త‌మిళ‌నాడులో ప్ర‌స్తుత‌మున్న ప‌రిస్థితుల్లో ర‌జ‌నీ ఎంట్రీ ఇస్తే... ఆయ‌న సీఎం కావ‌డం చాలా ఈజీ అన్న వాద‌న కూడా వినిపిస్తోంది. మ‌రి ఈ ఏడాది చివ‌రి రోజైన ఈ నెల 31న త‌న నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టిస్తాన‌ని చెప్పిన ర‌జ‌నీ... ఆ రోజే ఏ మాట చెబుతారోన‌న్న ఆస‌క్తి నెల‌కొంది.