Begin typing your search above and press return to search.

మత ఛాందసవాదానికి కొత్త పేరు...

By:  Tupaki Desk   |   29 Aug 2015 1:13 PM GMT
మత ఛాందసవాదానికి కొత్త పేరు...
X
రెండు వేరు వేరు మతాలకు చెందిన యువతీ యువకులు కలిసి తిరగడానికి బయపడుతున్నారు అంటే అతిశయోక్తి కాదు. అదేంటి... ఈ రోజుల్లో అంతా బాగానే కలిసిపోయారు కదా! మనుషుల మధ్య కులాలు, మతాలు అనే తేడాలు తగ్గుముఖం పడుతున్నాయని కొన్ని సర్వేలు చెబుతున్నాయి కదా అంటారా! ఇది నాణానికి ఒకవైపు మాత్రమే... మరో వైపు చూస్తే... మతతత్వపు మూర్ఖత్వం పెనవేసుకుపోయింది. కళాశాల ప్రాంగణంలో కానీ, బయట కానీ రెండు వేర్వేరు మతాలకు చెందిన యువతీ యువకులు కలిసి కనిపించినా, మాట్లాడుకుంటున్నా అకస్మాత్తుగా ఒక ముఠా వచ్చి దాడి చేస్తుంది. మతతత్వపు జాడ్యం బలంగా పేరుకుపోయిన వీరు... ఈ దాడులకు పెట్టిన ముద్దుపేరు "మోరల్ పోలీసింగ్"!

ఈ మోరల్ పోలీసింగ్ అనే మాట ఈ మధ్యకాలంలో తరచూ వినిపిస్తుంది. నైతిక విలువలు కాపాడటానికి వాడాల్సిన మోరల్ పోలీసింగ్ పేరును.. మతోన్మాదానికి వాడుతున్నారు. తాజాగా జరిగిన ఎన్నో సంఘటనలు ఈ వాదనకు బలం చేకూరుస్తున్నాయి. తాజాగా మంగుళూరులోని ఒక వ్యక్తిని స్తంభానికి కట్టి కొట్టారు. కారణం... అతడు ముస్లిం అయ్యి.. ఒక హిందూ మహిళతో మాట్లాడటం. దీన్ని మోరల్ పోలీసింగ్ అంటున్నారు! తాజాగా పూణేలో ఒక అమ్మాయితో కలిసి నడుస్తున్న ముస్లిం అబ్బాయిని చితకొట్టారు. కారణం ఆ మహిళ హిందూ కావడం! ఇలాంటివి నిత్యం ఏదో ఒక మూల జరుగుతూనే ఉన్నాయి. ఇది కేవలం ముఠాలకు, ఖాళీగా ఉన్న బ్యాచ్ లకు మాత్రమే చెల్లిందనుకుంటే పొరపాటే. తాజాగా మంగుళూరు సమీపంలోని ఒక కళాశాలలో వేర్వేరు మతాలకు చెందిన ఇద్దరు విద్యార్థులను సస్పెండ్ చేశారు. కారణం ఆరా తీస్తే... వారివి వేర్వేరు మతాలు కావడమే అని తెలిసింది!

వినడానికి నమ్మసక్యంగా లేకపోయినా, ఈ రోజుల్లో కూడా ఇలా జరుగుతుందా అని ఆశ్చర్యపోయినా... ఇది నిజం! ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రంలోని తీరప్రాంతాల్లో ఈ వ్యవస్థ దినదినాభివృద్ధి చెందుతుంది. మోరల్ పోలీసింగ్ మాటున మూడత్వం, మూర్ఖత్వం ముదిరి ముదిరి పాకానపడుతుంది! ఈ విషయాన్ని పోలీసు వ్యవస్థ చూసీ చూడనట్లు గనక వదిలేస్తే భవిష్యత్తులో ఇవి చినికి చినికి గాలివానగా మరే ప్రమాధం ఉంది. ఏమతం చెబుతుంది మరో మతస్థుడితో మాట్లాడొద్దని, ఏ మతం ప్రవచిస్తుంది మరో మతస్థుడిపై దాడిచేయమని. విజ్ఞత మరిచి చేసే దాడులకు మోరల్ పోలీసింగ్ అని పేరుపెట్టినా అది మూర్ఖత్వం, మతజాడ్యం, మత ఛాందసవాదం అవుతుందే తప్ప మరొకటి కాదని సదరు మతోన్మాదులు గ్రహించాలని కోరుకుందాం!