Begin typing your search above and press return to search.

నెహ్రు.. ఇందిర‌ల కంటే మోడీనే 'బెస్ట్‌'!

By:  Tupaki Desk   |   19 Aug 2017 4:51 AM GMT
నెహ్రు.. ఇందిర‌ల కంటే మోడీనే బెస్ట్‌!
X
ప్ర‌ధాని మోడీ మ‌రో ఘ‌న‌త‌ను సాధించేసిన‌ట్లే. త‌న‌ను తాను సామాన్యుడిగా.. చాయ్ వాలాగా అభివ‌ర్ణించుకునే మోడీ ఇప్పుడు దేశ చ‌రిత్ర‌లోనే అత్యంత ప్ర‌భావ‌వంత‌మైన ప్ర‌ధానిగా అవ‌త‌రించిన‌ట్లుగా ప్ర‌ముఖ మీడియా సంస్థ జ‌రిపిన స‌ర్వే తేల్చింది. స్వాతంత్య్ర పోరాటంలో కీల‌క‌భూమిక పోషించి.. దేశ తొలి ప్ర‌ధానిగా మ‌న్న‌న‌లు అందుకున్న నెహ్రును సైతం మోడీ బీట్ చేయ‌టం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

ఇండియాటుడే- కార్వీ ఇన్ సైట్స్ సంయుక్తంగా నిర్వ‌హించిన మూడ్ ఆఫ్ ద నేష‌న్ పేరిట నిర్వ‌హించిన స‌ర్వేలో ప‌లు ఆస‌క్తిక‌ర అంశాలు వెలుగులోకి వ‌చ్చాయి. స‌ర్వేలో పాల్గొన్న వారిలో ఎక్కువ‌మంది మోడీ ప‌ట్ల ఎక్కువ మొగ్గు చూప‌టం విశేషం.

దేశ చ‌రిత్ర‌లో త‌మ మార్క్ చూపిన ప్ర‌ధాన‌మంత్రుల్లో మోడీనే బెస్ట్ అని ప‌లువురు చెప్ప‌టం గ‌మ‌నార్హం. నెహ్రు.. ఇందిర‌.. వాజ‌య్ పేయ్ ల కంటే కూడా మోడీనే అత్యంత ప్ర‌భావ‌వంత‌మైన ప్రధానిగా పేర్కొన‌టం విశేషం. అంతేనా.. ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిపితే తిరుగులేని మెజార్టీని మోడీ స‌ర్కారు సొంతం చేసుకుంటుంద‌ని తేల్చారు. మోడీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఈ స‌ర్వే సంస్థ ఇప్ప‌టికి ఐదు సార్లు స‌ర్వే నిర్వ‌హించింది. తాజాగా జులైలో నిర్వ‌హించిన స‌ర్వే ఫ‌లితాల్ని ప్ర‌క‌టించింది.

ఈ ఫ‌లితాల ప్ర‌కారం దేశంలో అత్యుత్త‌మ ప్ర‌ధానిగా ప్ర‌భావం చూపిన వారి విష‌యానికి వ‌స్తే.. మోడీకి 33 శాతం బాస‌ట‌గా నిలిస్తే.. ఇందిర‌మ్మ 17 శాతంతో రెండో స్థానం.. వాజ్ పేయ్ 9 శాతంతో మూడో స్థానం.. నెహ్రు 8 శాతంతో నాలుగో స్థానంలో నిలిచారు. 2015లో నిర్వ‌హించిన తొలి స‌ర్వేలో ఇందిర 21 శాతంతో ముందు ఉంటే.. అప్ప‌ట్లో మోడీ 20 శాతంతో రెండో స్థానంలో నిలిచారు. తాజా స‌ర్వేలో ఇందిర‌ను మోడీ అధిగ‌మించిన‌ట్లైంది.

ఇక‌.. ఇప్ప‌టికిప్పుడు దేశ వ్యాప్తంగా లోక్ స‌భ‌కు ఎన్నిక‌లు జ‌రిగితే ఎన్డీయేకు349 సీట్లు వ‌స్తాయ‌ని పేర్కొంది. ఇక‌.. ఇప్పుడున్న హ‌వానే న‌డిస్తే 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో మోడీ బ్యాచ్‌కు తిరుగులేద‌ని చెబుతున్నారు. ఇటీవ‌ల కాలంలో బీహార్ ముఖ్య‌మంత్రి నితీశ్ బృందం ఎన్డీయేలో క‌లిస్తే మాత్రం సీట్ల సంఖ్య 400ల‌కు చేరుకున్నా ఆశ్చ‌ర్యం లేద‌ని చెబుతున్నారు.

ఇదిలా ఉంటే.. తాజా స‌ర్వే ప్ర‌కారం యూపీఏకు 75 సీట్లు మాత్ర‌మే వ‌స్తాయ‌ని.. ఇత‌ర విప‌క్షాల‌కు119 సీట్లు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని అంచ‌నా వేశారు. మోడీ పాపులారిటీతో బీజేపీ 298 స్థానాల్లో విజ‌యం సాధించే అవ‌కాశం ఉంద‌ని లెక్క క‌ట్టింది. ప‌శ్చిమ‌.. ఉత్త‌ర భార‌త్ ల‌లో బీజేపీకి 249 సీట్లు రానుండ‌గా.. ద‌క్షిణ భార‌తంలో 107 స్థానాల్ని మాత్ర‌మే ఎన్డీయే కూట‌మి సొంతం చేసుకునే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు. ద‌క్షిణ భార‌తంలో 286 ఎంపీ స్థానాలు ఉండ‌టం గ‌మ‌నార్హం.

పెద్ద‌నోట్ల ర‌ద్దు కార‌ణంగా ప్ర‌జ‌లు తీవ్రంగా ఇబ్బంది ప‌డినా.. అవినీతి మీద మోడీ సంధించిన అస్త్రంగా ప్ర‌జ‌లు భావిస్తున్న‌ట్లు పేర్కొంది. మిగిలిన సంగ‌తులు ఎలా ఉన్నా అవినీతిర‌హిత పాల‌నే మోడీ ప్ర‌భుత్వం సాధించిన అతి పెద్ద విజ‌యంగా ప్ర‌జ‌లు భావిస్తున్న‌ట్లు పేర్కొంది. స్వ‌చ్ఛ భార‌త్‌.. పాక్ మీద స‌ర్జిక‌ల్ దాడులు.. మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న‌.. పేలు.. రైతుల అనుకూల ప‌థ‌కాలు కూడా మోడీపై ప్ర‌జాభిమానాన్ని పెంచేలా చేశాయ‌ని వెల్ల‌డించారు. అయితే.. నిరుద్యోగిత విష‌యంలో మాత్రం మోడీకి మైన‌స్ మార్కులు ప‌డ్డాయి. దేశ వ్యాప్తంగా 63 శాతం మంది ప్ర‌ధానిగా మోడీ ప‌ని తీరు బాగుంద‌ని చెప్ప‌గా.. 12 శాతం మంది మాత్ర‌మే బాగోలేద‌న్న మాట‌ను చెప్ప‌టం క‌నిపించింది. సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో మోడీ ప్ర‌ధానంగా ప్ర‌స్తావించిన‌ అచ్ఛేదిన్‌పై 39 శాతం మంది సానుకూలత వ్య‌క్తం చేస్తే.. 34 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేయ‌టం క‌నిపించింది.

మోడీ పాల‌న ఎలా ఉంద‌న్న ప్ర‌శ్న‌కు స‌మాధానంగా 24 శాతం మంది ప్ర‌ధాని ధైర్యంగా నిర్ణ‌యాలు తీసుకోవ‌టం న‌చ్్చింద‌ని పేర్కొన‌గా.. 23 శాతం మంది మోడీ పాల‌న ఓకే అన్నారు. అయితే.. మ‌రో 23 శాతం మంది మాత్రం మోడీవి మాట‌లే త‌ప్పించి చేత‌లు క‌నిపించ‌టం లేదంటూ పెద‌వి విరిచారు. పేద‌లు.. రైతుల ప‌క్ష‌పాతిగా మోడీని 15 శాతం మంది అభివ‌ర్ణిస్తే.. మైనార్టీ వ్య‌తిరేకి అన్న ముద్ర‌ను 12 శాతం మంది వేశారు. మోడీకి స‌రైన పోటీ ఎవ‌ర‌న్న ప్ర‌శ్న‌కు 13 శాతం మంది యోగి ఆదిత్య‌నాథ్‌కు ఓటు వేయ‌గా.. కేంద్ర మంత్రులు సుష్మా.. జైట్లీ.. రాజ్ నాథ్ ల‌కు 10 శాతం మంది ఓకే చెప్పారు.